logo

పురిపై ఫ్లూ పంజా

జిల్లాలోనూ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల సలహాలు, సందేహాలకు జిల్లా కేంద్రంలో కాల్‌సెంటరును ఏర్పాటు చేశారు.

Updated : 20 Mar 2023 05:57 IST

పెరుగుతున్న బాధితులు.. అందుబాటులో టోల్‌ఫ్రీ నంబర్లు

దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్న వేళ జాగ్రత్తలు తీసుకోవాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సూచించింది. కొవిడ్‌ గాయంతో కోలుకుంటున్న జిల్లా ప్రజలకు అవే లక్షణాలతో దూసుకొస్తున్న ఫ్లూ.. ఆందోళన కలిగిస్తోంది. నెలరోజుల నుంచే ఇది జిల్లాలో ఉందని,  భయాందోళన చెందకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తే వైరస్‌ దరి చేరదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు, దీర్ఘకాలిక వ్యాధులున్న రోగులు, క్యాన్సర్‌, నియంత్రణ లేని మధుమేహ బాధితులు మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.


న్యూస్‌టుడే, నెల్లూరు(కలెక్టరేట్‌): జిల్లాలోనూ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల సలహాలు, సందేహాలకు జిల్లా కేంద్రంలో కాల్‌సెంటరును ఏర్పాటు చేశారు. 104, 1077 నంబర్లకు అందుబాటులో ఉంచారు. రోజుల తరబడి దగ్గు, గొంతు నొప్పి, తగ్గని జ్వరం, నిత్యం ఇబ్బంది పెట్టే జలుబు, ఒళ్లు నొప్పులు, వీటికి తోడు శ్వాసకోశ సమస్యల లక్షణాలతో జిల్లాలోని ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేటులోనూ ఓపీ అధికంగా నమోదవుతోంది. స్వైన్‌ఫ్లూకు చెందిన ఇన్‌ఫ్లూయింజా హెచ్‌3ఎన్‌2 అనే వేరియంట్‌ దేశవ్యాప్తంగా పంజా విసురుతున్న నేపథ్యంలో జిల్లాలోనూ ఈ లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.


కిటకిటలాడుతున్న ఆసుపత్రులు

జ్వరం, జలుబు, దగ్గు, వాంతులు, విరేచనాలు, తదితర సాధారణ వైద్య చికిత్సలు అందించే ఆసుపత్రులు జిల్లాలో దాదాపు 300 వరకు ఉన్నాయి. అన్నింట్లో నెల రోజుల నుంచి రోగుల రద్దీ పెరిగింది. నెల్లూరు నగరం, కావలి, ఆత్మకూరు, కందుకూరు పట్టణాల్లో ఒక్కో ఆసుపత్రికి 50 నుంచి 60 ఉండే ఓపీ 15 రోజులుగా 100 వరకు ఉంటుందని ఆయా ఆసుపత్రుల వర్గాలు చెబుతున్నాయి.


ఈ లక్షణాలుంటే.. అశ్రద్ధ చేయొద్దు

* వంద డిగ్రీల పైబడి జ్వరం 10 రోజుల నుంచి ఉంటే ఇన్‌ఫ్లూయింజా అయ్యే అవకాశం ఉంది.
*ఎక్కువ రోజులుగా దగ్గు, కఫం పడటం, తీవ్ర గొంతు నొప్పి ఉండటం, కూడా ఫ్లూ సంకేతాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
*ఎక్కువ కాలం జలుబు వచ్చినా తేలిగ్గా తీసుకోవద్దు.
* వీటన్నింటికి తోడు శ్వాసకోశ సమస్యలు, ఆయాసం, పిల్లి కూత వంటివి వస్తే మాత్రం కచ్చితంగా దగ్గరలోని వైద్యులను సంప్రదించి చికిత్స చేసుకోవాలి.
* శ్వాసకోశ సమస్యలు వచ్చినప్పుడు ఆక్సిజన్‌ శాతం ఒకేసారి పడిపోవడం ఉండదు. 96 వరకు ఆక్సిజన్‌ శాతం తగ్గి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది.
* కొంత మందికి వాంతులు, విరేచనాలు వస్తున్నాయి.


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేవీఎన్‌ చక్రధర్‌బాబు, కలెక్టర్‌

కొవిడ్‌-19, ఫ్లూ వైరస్‌ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తప్పనిసరిగా సామాజిక దూరం, మాస్క్‌, శానిటైజర్లను వినియోగించాలి. మూడు రోజులు దగ్గు, జ్వరంతో ఇబ్బంది ఉంటే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలో పరీక్ష చేయించుకుని స్వీయ నిర్బంధంలో ఉండి అయిదు రోజులు వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి. ఎలాంటి సందేహం ఉన్నా.. 104, 1077 టోల్‌ఫ్రీ నంబర్లకు సంప్రదించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని