logo

చినుకా చినుకా ఎందుకు కురిశావ్‌

జిల్లాలో తొలి పంట సాగు చేసిన రైతులు ఇప్పటికే కష్టనష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి తోడు అకాల వర్షం వారి పాలిట అశనిపాతంలా మారింది.

Updated : 20 Mar 2023 05:59 IST

దళారుల మాయాజాలం.. ధాన్యం ధరల పతనం

వ్యాపారుల ద్వారా  ధాన్యం కొనుగోలు

ఉందిలే మంచి కాలం ముందుముందునా.. అంటూ కోతల ప్రారంభంలో అన్నదాతలు ఆనందించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.17,500 కన్నా బహిరంగ మార్కెట్లో రూ.20 వేలు ఉండటంతో అందరూ అక్కడే విక్రయించారు. ఇంత వరకు బాగున్నా.. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు మిల్లర్లు, దళారులు రంగంలోకి దిగారు. గంట గంటకూ ధర దిగ్గోస్తున్నారు. రూ.16,500 చొప్పున కొనుగోలు చేస్తూ నిలువునా దోచుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడం.. ధాన్యం నిల్వ చేసుకుని ధర వచ్చినప్పుడు విక్రయించుకునే వెసులుబాటు అన్నదాతలకు లేకపోవడం వారికి ఆసరాగా మారింది.


అల్లూరు మండలం ఇస్కపల్లిలో ఓ రైతు వద్ద పుట్టు ధాన్యం రూ.17,500 కొనుగోలు చేసేందుకు ఓ దళారీ శనివారం రాత్రి ఒప్పందం కుదర్చుకొని ఆదివారం ఉదయానికి రూ.17 వేలకు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో మరో గత్యంతరం లేక ఆ ధరకు రైతు విక్రయించారు.


అదే మండలంలో చింతగుంట రోడ్డులో పుట్టు ధాన్యం రూ.17,800 చొప్పున కొనుగోలు చేస్తానని ఓ రైతు వద్ద శనివారం రాత్రి దళారీ ఒప్పందం చేసుకొని ఆదివారం ఉదయానికి రూ.16,500 ధర తగ్గించాడు. ధాన్యాన్ని నిల్వ చేసుకునే సౌకర్యం లేక రైతు దక్కిందే ధర అనుకొని ధాన్యం అమ్మేశారు.


న్యూస్‌టుడే, సంగం: జిల్లాలో తొలి పంట సాగు చేసిన రైతులు ఇప్పటికే కష్టనష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి తోడు అకాల వర్షం వారి పాలిట అశనిపాతంలా మారింది. వ్యాపారులు, దళారులు, మిలర్లకు మాత్రం కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం విక్రయించుకునేందుకు అవసరమైన కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నేటికీ జరగలేదు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో బహుళ ప్రయోజనకర (మల్టీపర్పస్‌) గోదాముల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 561 రైతు భరోసా కేంద్రాల పరిధిలో తొలిదశలో రూ.18 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన 48 గోదాముల నిర్మాణం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. రెండో దశ, మూడో దశ నిర్మాణాలు నామమాత్రంగా ఉన్నాయి.


గతేడాది 10 లక్షల టన్నులు

జిల్లాలో తొలి పంట సమయంలో దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తే.. 17 లక్షల టన్నుల వరకు దిగుబడులు లభిస్తాయి. రైతులు తమ ఆహారం, విత్తన అవసరాలకు 2.5 లక్షల టన్నులు పోను గతేడాది కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం 4.5 లక్షల టన్నులు మాత్రమే మద్దతు ధరకు విక్రయించగా.. మిగతా 10 లక్షల టన్నుల  ధాన్యాన్ని వ్యాపారులు, దళారులకు అతి తక్కువ ధరకు విక్రయించారు.


లాభపడిన వ్యాపారులు

గతేడాది తొలి పంట కాలంలో జిలకర మసూరీ రకం ధాన్యాన్ని రైతులు పుట్టి రూ.12 వేల కనిష్ఠ ధరకు అమ్ముకున్నారు. వ్యాపారులు భారీగా కొనుగోలు చేసి నిల్వ చేసి కేవలం మూడు నెలల వ్యవధిలో పుట్టిని రూ.25 వేల చొప్పున విక్రయించి అత్యధిక ఆదాయం పొందారు.


60 శాతం కోత కోయాల్సి ఉండగా..

జిల్లాలో ప్రస్తుతం 40 శాతం మాత్రమే కోతలు జరిగాయి. ఈనెల ప్రారంభంలో బీపీటీ (జిలకర మసూరీ), ఆర్‌ఎన్‌ఆర్‌ (సుగర్‌లెస్‌) వంటి రకాలకు ధర పలికింది. ఆ తర్వాత నుంచి జిలకర మసూరీ ధర తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కోత కోయాల్సిన 60 శాతం పంటలో అత్యధికంగా నెల్లూరు మసూరీ రకం ఉంది. ఆ పంట కోతలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ మద్దతు ధర రూ.17,500గా ఉండగా.. ప్రస్తుతం దాన్ని రూ.14,300కి దళారులు తగ్గించారు.

నిల్వ చేసుకునే వసతి ఉంటే.. దళారుల బారిన పడకుండా రైతులు లాభాలను ఆర్జించాలంటే జిల్లాలో గోదాములు అందుబాటులో ఉండాలి. వాటిలో నామమాత్రం రుసుముతో నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించాలి. ధాన్యానికి రైతు బంధు పథకం ద్వారా సాయం అందిస్తే రైతులకు చేయూతగా ఉంటుంది. తద్వారా గిట్టుబాటు ధర వచ్చినప్పుడు రైతులు విక్రయించుకుని ప్రయోజనం పొందుతారు.

క్షేత్రస్థాయి పరిశీలన లేక..వాస్తవ స్థితిగతులు అత్యంత దారుణంగా ఉంటే అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదు. ఈనెల ప్రారంభంలో ఉన్న ధర ఇప్పటికీ అమలవుతుందని భావిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక కాలయాపన చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో మల్టీపర్పస్‌ గోదాముల నిర్మాణాలను పూర్తి చేసి వాటిని రైతులకు అందుబాటులోకి తీసుకొస్తేనే రైతుల కడగండ్లు తీరుతాయి.

సిద్దీపురం సమీపంలో వర్షపునీరు ధాన్యం కిందకు
వెళ్లకుండా అడ్డుగా మట్టి కట్ట వేస్తున్న రైతు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని