logo

అయినాకాణి చిన్నచూపే!

అవసరాలు కొండంత.. నిధులు గోరంత- తాజా బడ్జెట్‌లో సోమశిల.. దాని అనుబంధ వ్యవస్థల పనులకు చేసిన కేటాయింపులను చూసినవారు అంటున్న మాటలివి.

Updated : 23 Mar 2023 02:47 IST

ప్రాజెక్టు పనుల్లో కొరవడిన పురోగతి
ఆత్మకూరు, న్యూస్‌టుడే

ఆఫ్రాన్‌తోపాటు సోమశిల జలాశయ ఇతర రక్షణ కట్టడాల పటిష్ఠ పరిచే పనులను రూ. 99 కోట్లతో చేపట్టారు. ఇప్పటి వరకు రూ. 25కోట్ల పనులు చేశారు. బిల్లులు రాకపోవడంతో.. గుత్తేదారుకు సమస్యలు ఎదురై.. మూడు నెలలుగా పనులు ఆపేశారు. బిల్లులు ఎప్పటికి వస్తాయో? పనులు ఎప్పటికి పునః ప్రారంభిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.


హైలెవల్‌ కెనాల్‌లో భాగంగా సోమశిల వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు.. ఆగిపోయి మూడున్నరేళ్లకు పైగా అయింది. నిధుల ఊసేలేదు.. కదలిక అసలే లేదు. నిధుల కొరతతో.. ఈ పథకం పరిధిలో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పూర్తికాక.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.


ఇవి గుండెమడకల రిజర్వాయరు నిర్మాణ పనులు. సోమశిల హైలెవల్‌ కాలువ రెండో దశలో భాగంగా ఇప్పటి వరకు రూ. 100 కోట్ల విలువైన పనులు చేశారు. కంపసముద్రం రిజర్వాయరు, ఇతర పనులు చేపడుతున్నా.. చేసిన వాటికి బిల్లులు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి.


కండలేరు వరద కాలువ.. వెడల్పు పనులు చేపట్టారు. రూ. 80 కోట్లపైనే బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఎప్పటికి చెల్లిస్తారో తెలియని స్థితి నెలకొనడంతో పనులు ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయన్న దానిపై స్పష్టత లేదు.

వసరాలు కొండంత.. నిధులు గోరంత- తాజా బడ్జెట్‌లో సోమశిల.. దాని అనుబంధ వ్యవస్థల పనులకు చేసిన కేటాయింపులను చూసినవారు అంటున్న మాటలివి. ఇప్పటికే జలాశయం.. దాని అనుబంధ కాలువల పరిధిలో చేసిన పనులకు చెల్లించాల్సిందే సుమారు రూ. 375 కోట్లు ఉండగా- చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. బడ్జెట్‌లో కేటాయింపులు మాత్రం రూ. 46 కోట్లే. దీంతో ప్రస్తుత కార్యాచరణలో ఉన్న అభివృద్ధి పనుల అవసరాలు తీరవనే ఆవేదన వ్యక్తమవుతోంది.

హైలెవల్‌ కాలువల ఊసేది?

మెట్ట ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే హైలెవల్‌ కాలువల పనుల సాకారానికి నిధుల కేటాయింపులు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొదటి దశ పనుల్లో మూడున్నరేళ్లుగా కదలిక లేదు. కీలకమైన భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులు పూర్తికాక.. చేసిన పనులు నిరుపయోగమవుతున్నాయి. రెండో దశ పనులు చేపడుతున్నా.. చేసిన వాటికి బిల్లుల చెల్లింపు లేదు. దీంతో ఎప్పటి వరకు సాగుతాయో తెలియని పరిస్థితి. ఉత్తర కాలువ వెడల్పు, జలాశయం వద్ద వరద నీటి విడుదల సందర్భంగా దెబ్బతిన్న రక్షణ కట్టడాలు పటిష్ఠం చేసే పనులు, కండలేరు వరద కాలువ వెడల్పు పనులకు సంబంధించిన చెల్లింపులు జరగకపోవడంతో అంతటా సందిగ్ధత నెలకొంది. దీనికి తోడు ఈ బడ్జెట్‌లో కేటాయించిన రూ. 46 కోట్లలో.. ఈ పనులకు ఏ మేరకు చెల్లిస్తారో తెలియడం లేదు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే.. ప్రాజెక్టు అనుబంధ కాలువలు.. వాటి అభివృద్ధి పనుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారో వేచి చూడాల్సి ఉంది.


కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యం కోరాం

దశరథరామిరెడ్డి, ఈఈ సోమశిల ప్రాజెక్టు

అంతరాష్ట్ర ప్రాధాన్యం కలిగిన సోమశిల జలాశయం రక్షణ పనులకు కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యం కోరాం. రూ. 30 కోట్లు సాయం అందించాలని అడిగాం. త్వరలోనే ఈ విషయమై సమాచారం రానుంది. నిధులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తక్కిన పనులు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని