logo

కన్నీటి వాన

ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో జిల్లాలో కురిసిన వర్షాలు జన జీవనానికి, ముఖ్యంగా రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి.

Published : 24 Mar 2023 05:14 IST

తల్లడిల్లిన అన్నదాతలు

అల్లూరు: ధాన్యం  రాశులను చుట్టుముట్టిన వర్షపు నీరు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో జిల్లాలో కురిసిన వర్షాలు జన జీవనానికి, ముఖ్యంగా రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. గురువారం మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండతో పాటు ఉక్కపోతగా ఉన్న వాతావరణం 3 గంటల సమయంలో ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికప్పుడు మబ్బులు కమ్ముకురావడంతో పాటు భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం.. ఏకధాటిగా గంటకుపైగా కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. కందుకూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 3 గంటలకు ప్రారంభమైంది. కందుకూరు కోటారెడ్డినగర్‌, పోతురాజుమిట్ట ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. జలదంకి మండలం బ్రాహ్మణక్రాక కాకమ్మ చెరువులో పిడుగుపడి నాని(10) మృతి చెందగా- కొండికందుకూరులో రెండు పశువులు మృత్యువాత పడ్డాయి. కావలి పట్టణంతో పాటు బోగోలు, అల్లూరు, బిట్రగుంట, జలదంకి మండలాల్లో 3.30 గంటలకు వాన ప్రారంభమైంది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. ఇప్పుడిప్పుడే కళ్లాలోని నీటిని బయటకు పంపి.. పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న అన్నదాతలను మరోసారి ముంచేసింది. వర్షం ప్రారంభమైన కాసేపటికే.. అన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సాయంత్రం 5 గంటలకే వర్ష ప్రభావం తొలగినా.. విద్యుత్తు సరఫరా పునరుద్ధరించకపోవడంతో ఆయా ప్రాంతాలు అంధకారంగా మారాయి. బోగోలు మండల పరిధిలో విద్యుత్తు స్తంభాలు పక్కకు వాలగా, కరేడు, తుమ్మలపెంట పరిధిలో చెట్ల కొమ్మలు విరిగి తీగలపై పడ్డాయి. అధికారులు, సిబ్బంది స్పందించడంతో.. రాత్రి 10 గంటలకు విద్యుత్తు సరఫరాను దాదాపుగా పునరుద్ధరించారు.

బిట్రగుంట: ఓదెల్లోనే మొలకెత్తిన ధాన్యం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని