logo

క్షతగాత్రుల ఆర్తనాదాలు

గూడూరుకు చెందిన తల్లీ కుమారుడు చీమకుర్తి లక్ష్మి, సతీష్‌ ద్విచక్రవాహనంపై నెల్లూరుకు బయల్దేరారు.

Published : 24 Mar 2023 05:14 IST

రోడ్డుపై గాయాలతో విలవిల్లాడుతున్న లక్ష్మి

వెంకటాచలం, న్యూస్‌టుడే: గూడూరుకు చెందిన తల్లీ కుమారుడు చీమకుర్తి లక్ష్మి, సతీష్‌ ద్విచక్రవాహనంపై నెల్లూరుకు బయల్దేరారు. ఒక ప్రైవేటు ఆసుపత్రిలో లక్ష్మీ కుమార్తెకు శస్త్రచికిత్స జరుగుతుండటంతో కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై వస్తుండగా వెంకటాచలం సమీపంలోకి రాగానే సడన్‌ బ్రేక్‌ వేయడంతో రహదారిపై అదుపుతప్పి పడిపోయారు. ప్రమాదంలో లక్ష్మికి చేయి విరిగి... తలకు దెబ్బతగిలి తీవ్రగాయాలతో రహదారిపై లేవలేని స్థితిలో పడిపోయింది. సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలానికి వంద మీటర్ల దూరంలో ప్రభుత్వ ఆసుపత్రి, అర కిలోమీటరు దూరంలో టోల్‌ప్లాజా ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో 108, రహదారి అంబులెన్స్‌లు అందుబాటులో ఉండాలి. చాలా మంది స్థానికులు, ప్రయాణికులు రెండు వాహనాల కోసం ఫోన్లు చేశారు. సుమారు అరగంట వరకు వాహనాలు రాకపోవటంతో తీవ్రగాయాలతో ఆర్తనాదాలు చేశారు. తమ తల్లిని తక్షణం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సహకరించండంటూ మరొక వైపు కుమారుడు వేడుకున్నారు. 108 వాహనం మరొక చోటకు వెళ్లిందని చెప్పగా ... చివరకు రహదారి అంబులెన్స్‌ వచ్చి నెల్లూరుకు తీసుకెళ్లారు. కుమార్తెను చూసేందుకు ఏ ఆసుపత్రికి అయితే వారు వెళ్లాలనుకున్నారో... అదే ఆసుపత్రిలో తల్లీ కుమారుడు తీవ్ర గాయాలతో చికిత్స కోసం చేరడం స్థానికులను కలచి వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని