logo

లక్ష్యం ఘనం.. పనుల్లో జాప్యం..!

గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పనులు కల్పించడంతో పాటు భవిష్యత్తు ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పనుల్లో భాగంగా అమృత్‌ సరోవర్‌ కింద నీటి వనరుల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

Published : 24 Mar 2023 05:14 IST

అధికారుల పర్యవేక్షణ లేక నత్తనడకన సాగుతున్న వైనం

నాడు.. దాసరిపల్లి ఊర చెరువు.

న్యూస్‌టుడే, ఉదయగిరి, సీతారామపురం

గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పనులు కల్పించడంతో పాటు భవిష్యత్తు ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ పనుల్లో భాగంగా అమృత్‌ సరోవర్‌ కింద నీటి వనరుల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామాలకు సమీపంలో ఉండే చెరువులు, ఊట కుంటలు గుర్తించి వాటిని వినియోగంలోకి తెస్తే స్థానికులతో పాటు పశు పక్షాదులకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తున్నారు. జిల్లాలో 31 మండలాల్లో 191 పనులను గుర్తించగా అందులో 111 పనులను ఎంపిక చేశారు. వాటిల్లో ఇప్పటి దాకా 48 చోట్ల పూర్తయ్యాయి.

ప్రయోజనమిలా..

ఉపాధిహామీ పథకంలో భాగంగా చేసే పనుల్లో గ్రామాలకు సమీపంలో ఉన్న చెరువులు, ఊట కుంటలను ఎంపిక చేశారు. గ్రామ సమీపంలో చేస్తే కూలీలు ఆసక్తిగా పనులకు రావడమే గాక చెరువులు, కుంటలను అభివృద్ధి చేయటం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెంచడం ద్వారా భూగర్భజలాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. కట్టలను అభివృద్ధి చేసి వాటిపై ఉదయం, సాయంత్రం సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు కాసేపు సేదతీరేలా వీటిని సిద్ధం చేస్తున్నారు. కట్టపైన లేదా దిగువ భాగంలో మొక్కలను నాటి వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు.

అభివృద్ధి పనులు చేపట్టాం

ఉపాధిహామీలో కొన్ని పనులను అమృత్‌ సరోవర్‌లో భాగంగా చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయగిరి మండలంలో మూడు పనులను గుర్తించి జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం పనులు చేయిస్తున్నాం. గ్రామాలకు సమీపంలో చెరువులు, కుంటలు అభివృద్ధి పనులు చేపట్టాం. ఈ పనులతో గ్రామీణ ప్రాంతాల వారికి  ప్రయోజనం కలుగుతుంది.

శ్రీనివాసులు, ఏపీవో ఉదయగిరి


ప్రతి పనికి రూ.2 లక్షలు..

కూలీలతో పనులు చేయించి అభివృద్ధి చేయడంతో పాటు కట్ట ఎత్తు పెంచేందుకు అవసరమైన గ్రావెల్‌ తరలింపు, రివిట్‌మెంట్‌, అలుగు ప్రాంతాల్లో మరమ్మతులు చేసేందుకు, కట్టపై ప్రజల సేద తీరేందుకు అవసరమైన సిమెంట్‌ బల్లలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పనికి మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధుల కింద ఒక్కో పనికి రూ. 2 లక్షల వంతున ప్రభుత్వం మంజూరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 31 మండలాల్లో అక్కడి పరిస్థితులకనుగుణంగా రెండు నుంచి ఐదు వరకు పనులను చేపట్టారు. ప్రభుత్వం లక్ష్యం మేరకు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదంతో పాటు భూగర్భజలాలు పెరిగే అవకాశముంది.

నేడు.. పనులు చేసిన తరువాత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని