logo

బడ్జెట్‌ సమావేశం ఊసేది?

54 డివిజన్లు.. 1.50 లక్షల గృహాలు.. సుమారు పది లక్షల జనాభా.. రాష్ట్రంలోనే పెద్ద నగరపాలక సంస్థల్లో ఒకటి నెల్లూరు..  అయితేనేం.. పాలకవర్గం, అధికారుల నిర్లక్ష్యంతో ఆ ప్రభ మసకబారుతోంది.

Published : 25 Mar 2023 05:34 IST

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే

54 డివిజన్లు.. 1.50 లక్షల గృహాలు.. సుమారు పది లక్షల జనాభా.. రాష్ట్రంలోనే పెద్ద నగరపాలక సంస్థల్లో ఒకటి నెల్లూరు..  అయితేనేం.. పాలకవర్గం, అధికారుల నిర్లక్ష్యంతో ఆ ప్రభ మసకబారుతోంది. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారన్న అసంతృప్తి ప్రజల్లో నెలకొంది. గత ఎనిమిది నెలలుగా కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించకపోవడం.. రానున్న ఆర్థిక సంవత్సరానికి మార్చి 21వ తేదీలోపు బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉన్నా.. ఆ ఊసేలేకపోవడం.. విమర్శలను నిజం చేస్తున్నాయి.

నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం గత ఏడాది జులై 29వ తేదీన నిర్వహించారు. నాటి నుంచి నగరాభివృద్ధి, సమస్యలపై చర్చించిన దాఖలాలు లేవు. గత ఏడాది మార్చి 30న బడ్జెట్‌ సమావేశం పెట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.7,34,15,56,000 ఆదాయం కాగా- రూ. 8,43,59,50,000 ఖర్చులుగా చూపారు. దీంతో రూ. 109.43 కోట్ల లోటు బడ్జెట్‌ ఏర్పడింది. ఈ ఏడాది కాలంలో ఖర్చులు తప్ప.. ఆదాయంపై దృష్టిసారించింది లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి అధికారులు శాఖల వారీగా అంచనాలతో వార్షిక పద్దు రూపొందించారు.

ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా..

మరో ఆరు రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ లోపు బడ్జెట్‌ సమావేశం పెట్టే అవకాశం లేదు. సమావేశానికి ఏడు రోజుల ముందుగానే సభ్యులకు బడ్జెట్‌ ప్రతులు అందించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆ ఊసే కనిపించడం లేదు. నెల్లూరు నగరపాలక సంస్థ పాలకవర్గం 54 మంది అధికార పార్టీ నుంచే ఎన్నికయ్యారు. అనంతరం మూడు గ్రూపులుగా విడిపోయారు. ఇటీవల రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైకాపాకు దూరంగా ఉండటంతో.. మేయర్‌ స్రవంతితో పాటు మరో పది మంది ఆయన వెంçË ఉన్నారు. మరికొంత మంది నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌తో ఉన్నారు. పాలకవర్గం, అధికారులకు మధ్య సరైన సమన్వయం, సుహృద్భావ వాతావరణం లేకపోవడం నగరాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. దీనిపై కార్పొరేషన్‌ మేనేజర్‌ ఇనాయతుల్లా మాట్లాడుతూ.. ఏప్రిల్‌ నెలలో బడ్జెట్‌ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని