logo

పార్కుల కబ్జా.. అక్రమార్కుల దర్జా!

వేసవిలో సేదదీరేందుకు ప్రజలకు పార్కులు ఎంతో ఉపయోగపడతాయి. కానీ, జిల్లాలో మౌలిక వసతులతో కూడిన ఉద్యానాలు చెప్పుకోదగ్గవి లేకుండాపోయాయి. 

Published : 25 Mar 2023 05:34 IST

ఆహ్లాదం కనుమరుగు

కోవూరులో నిరుపయోగంగా నుడా పార్కు

కోవూరు, న్యూస్‌టుడే: వేసవిలో సేదదీరేందుకు ప్రజలకు పార్కులు ఎంతో ఉపయోగపడతాయి. కానీ, జిల్లాలో మౌలిక వసతులతో కూడిన ఉద్యానాలు చెప్పుకోదగ్గవి లేకుండాపోయాయి.  ప్రతి అయిదు వేల జనాభాకు కనీసం 20ఎకరాల్లో పార్కులను నిర్మించాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జిల్లాలోని నెల్లూరు నగరం, పెద్ద పట్టణాల్లో వీటి స్థలాలు దురాక్రణలకు గురవుతున్నాయి. మరికొన్ని చోట్ల వీటిని అభివృద్ధి చేయకపోవడంతో దుమ్మూధూళితో నిండి దురావస్థకు చేరుకున్నాయి.

ఇదీ పరిస్థితి.. : పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తగిన పార్కులను నిర్మించాల్సి ఉంది. కానీ, ఎక్కడ కొత్తగా పార్కులు నిర్మించకపోగా పాత పార్కుల్లో సైతం కట్టడాలు నిర్మిం ప్రజలకు ఆహ్లాదం లేకుండా చేస్తున్నారు.

* జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్‌పార్కు సుమారు 12ఎకరాల్లో ఉంది. ఇక్కడ పురపాలక సంఘం ప్రైవేటు వ్యక్తులకు పర్యవేక్షణ బాధ్యత ఇవ్వడంతో వారు తమ ఇష్టారీతిన ప్రజల నుంచి ప్రవేశ రుసుములు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది.

* చారిత్రక గాంధీపార్కులో భారీ నీటి ట్యాంకులను నిర్మించడంతో అక్కడ కూడా ప్రజలు సేదదీరేందుకు స్థలం కరవైంది. తాగునీరు, టీవీ, బెంచీలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు తీవ్ర వైఫల్యం చెందారు.

* ఆత్మకూరు పంచాయతీ బస్టాండ్‌ వద్ద సుమారు 3ఎకరాల్లో పార్కు ఉండేది. ఉదయగిరి, కడప, నెల్లూరు ప్రాంతాలకు చెందిన ప్రజలు, గ్రామీణ ప్రయాణికులు ఇక్కడ సేదతీరేవారు. పట్టణ నడిబొడ్డులో పార్కు స్థలం కావడంతో విలువ పెరిగింది. దీంతో భారీ వాణిజ్య భవనాలను నిర్మించడంతో ప్రజలకు ఆహ్లాదం కరవైంది.

* బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని పార్కులో సౌకర్యాలు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది.

* కోవూరులో సౌకర్యాలున్న నుడా పార్కు.. పర్యవేక్షణ లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. పట్టణ నడిబొడ్డులోని గాంధీపార్కును అభివృద్ధి పేరిట అక్కడున్న భారీ వృక్షాలను తొలగించారు. దీంతో వేసవిలో నీడ కరవైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పడుగుపాడులో ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ముళ్లకంపలతో నిండిన పార్కు స్థలాన్ని స్థానికులు చందాలు వేసుకొని అభివృద్ధి చేసుకోవడం విశేషం.

* కావలి, సర్వేపల్లి, ఉదయగిరి నియోజకవర్గ కేంద్రాల్లోని పార్కుల్లోనూ ఆహ్లాదం కరవైంది.

యథేచ్ఛగా నిర్మాణాలు..

జిల్లాలోని నగరం, పట్టణాలు జనాభా పెరిగిపోతోంది. లేఅవుట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతి లేఅవుట్‌లో పదిశాతం భూమిని పార్కుల కోసం కేటాయించాల్సి ఉంది. కానీ, అక్రమార్కులు తమ అధికార బలంతో తొలుత పది శాతం భూమిని వీటికి కేటాయించినట్లుగా చూపి.. ప్రభుత్వ అనుమతులు పొందాక అక్కడ భారీ భవనాలు నిర్మించేస్తున్నారు. మాగుంట లేఅవుట్‌లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటాయించిన పదిశాతం భూమిలో కొందరు అక్రమార్కులు భవనాలు నిర్మించబోతే గత ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంది. పలు లేవుట్లలో చిన్నపాటి పార్కులను నిర్మించడంతో ప్రజలు హర్షించారు. కానీ, నేడు అలాంటి పరిస్థితులు లేకుండాపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ స్థలం కన్పిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. పడుగుపాడులో ఓ లేఅవుట్‌దారుడు తాను తొలుత నిర్మించిన లేఅవుట్‌లో పార్కు కోసం కేటాయించిన పదిశాతం భూమిలో భారీ భవంతులు నిర్మించేశారు. ఇదేమని గతంలో ఇక్కడ ఇళ్లు కొనుగోలు చేసిన వారు అతన్ని ప్రశ్నిస్తే.. తమకు నుడా అనుమతులున్నాయని బుకాయించడం గమనార్హం. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి మమ అనిపించారు.

జగనన్న లేఅవుట్లలోనూ..

జిల్లాలో నిర్మించిన వేలాది జగనన్న లేఅవుట్లలో ఎక్కడా కూడా కనీసం పదిశాతం స్థలాన్ని పార్కుల కోసం ప్రత్యేకంగా కేటాయించలేదు. దీంతో భవిష్యత్తులో అక్కడ నివాసాలు ఉండే ప్రజలకు ఆహ్లాదం అందని దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా పార్కుల కోసం స్థలాలను కేటాయించాలని లబ్ధిదారులు కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు