logo

ఇళ్ల సామగ్రి.. పక్కదారి

పట్టణ పరిధిలోని పేదలకు నవరత్నాలు కార్యక్రమంలో ఇళ్లు నిర్మించేందుకు భారీ లేఅవుట్‌ తయారుచేశారు. ఇందులో 5,118 ప్లాట్లు వేశారు.

Published : 25 Mar 2023 05:34 IST

న్యూస్‌టుడే, కావలి

ఈ చిత్రంలో కనిపించే నిర్మాణాలు పట్టణంలోని ముసునూరు జగనన్న మెగా లేఅవుట్‌లో గుత్తేదారులు చేపడుతున్న ఇళ్లు. నాలుగున్నర నెలలకు పైగా ఇలా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఎప్పుడు పూర్తవుతాయో తెలియని స్థితి. వీటి కోసం లబ్ధిదారులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

పట్టణ పరిధిలోని పేదలకు నవరత్నాలు కార్యక్రమంలో ఇళ్లు నిర్మించేందుకు భారీ లేఅవుట్‌ తయారుచేశారు. ఇందులో 5,118 ప్లాట్లు వేశారు. వీటిలో 4,109 ఇళ్ల నిర్మాణానికి తొలి విడతగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంటి నిర్మాణానికి ఇచ్చే నగదు సరిపోదనే భావనతో చాలామంది లబ్ధిదారులు ముందుకురాలేదు. దీంతో గుత్తేదారు వ్యవస్థను తీసుకొచ్చారు. వీరితో నిర్మించి ఈఏడాది ఉగాది నాటికి ఇవ్వాలని నిర్ణయించారు. అయినా ఇంతవరకు శ్లాబు పూర్తైన వాటి సంఖ్య 500 లోపే. మరోవైపు అక్రమాలు జరుగుతున్నాయి. అప్పగించిన నిర్మాణ సామగ్రి మాయమైంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువెళ్లిందో ఇంతవరకు తేలలేదు. నలుగురు గుత్తేదారులకు ఇచ్చిన దానిలో వంద ఇళ్లకు సంబంధించిన నిర్మాణ సామగ్రిలో తేడా కనిపిస్తోంది.

సిమెంట్‌, ఇనుము, ఇసుక

ఒక్కో ఇంటికి 30 బస్తాల సిమెంట్‌, 300 కేజీల ఇనుము, రెండు ట్రాక్టర్ల ఇసుక ఇచ్చారు. ఇసుకకు టోకెన్లు ఇవ్వడంతో బోగోలు మండలంలోని కడనూతల గ్రామం వద్ద ఉన్న నిల్వ కేంద్రం నుంచి తీసుకున్నారు. సిమెంట్‌, ఇనుము గృహ నిర్మాణ సంస్థ గోదాము నుంచే అప్పగించారు. ఇవన్నీ లేఅవుట్‌కు రాకుండా ప్రైవేట్‌ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాయని విశ్వసనీయ సమాచారం.

పోలీసులకు ఫిర్యాదు చేసినా..

గుత్తేదారుల చేతివాటంపై గ్రామీణ పోలీసులకు గృహ నిర్మాణ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ పూర్తిస్థాయిలో జరగలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో నిర్మాణాల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. నిర్మాణ సామగ్రిని పక్కదారి పట్టిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో అమ్మేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


మాట్లాడుకునే అవకాశం కల్పించాం
వెంకట్రావు, కావలి గ్రామీణ పోలీసుస్టేషన్‌

గృహ నిర్మాణ సంస్థ తరఫున ఫిర్యాదు చేశారు. గుత్తేదారులతో ఏఈ మాట్లాడేలా చేశాం.


గుత్తేదారులు సహకరించాలి
ఖాజామొహిద్దీన్‌, ఏఈ, గృహ నిర్మాణ సంస్థ

గుత్తేదారులు సహకరించాలి. ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున ఇప్పటికైనా త్వరగా కట్టుబడి చేయాలని కోరుతున్నాం. పనులు నాణ్యతగా జరిగేలా చూస్తున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని