logo

బాలుడి అపహరణ.. 2 గంటల్లో గుర్తింపు

అమ్మమ్మతో దేవస్థానానికి వెళ్లిన బాలుడిని గుర్తుతెలియని మహిళ అపహరించింది. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు.

Published : 25 Mar 2023 05:34 IST

ఎస్పీ సమక్షంలో బాలుడిని తల్లికి అప్పగిస్తున్న నగర డీఎస్పీ

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: అమ్మమ్మతో దేవస్థానానికి వెళ్లిన బాలుడిని గుర్తుతెలియని మహిళ అపహరించింది. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని బీవీనగర్‌లో శ్రీకాంత్‌రెడ్డి, ఇంద్రజ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి సవ్యసాక్షిక్‌రెడ్డి అనే నాలుగేళ్ల బాలుడు ఉన్నాడు. శుక్రవారం ఉదయం ఇంద్రజ తల్లి తాటిపర్తి పద్మ తన మనవడితో కలసి శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వెళ్లారు. అక్కడ గుర్తుతెలియని మహిళ బాలుడ్ని ఆడిస్తున్నట్లు నటించి తీసుకెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన ఆమె కుమార్తెకు విషయాన్ని తెలియజేసి దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ సీహెచ్‌ విజయరావు వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయడంతో నగరంలో నాకా బందీ నిర్వహించారు. చెక్‌పోస్టులు, టోల్‌ప్లాజాల వద్ద తనిఖీ చేపట్టారు. దేవస్థానంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అపహరణ చేసిన మహిళ బాలుడితో కలిసి పద్మావతి సెంటరు వైపు వెళ్లి అక్కడి నుంచి ఆటో ఎక్కి ఆత్మకూరు బస్టాండుకు వెళ్లినట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆటోను గుర్తించి డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా ఆ మహిళ ఆత్మకూరు బస్టాండులో దిగి పామూరు బస్సు ఎక్కినట్లు తెలిపారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి  గాలించగా బాలుడు కనిపించాడు. అపహరణ చేసిన మహిళ కనపడలేదు. దీంతో పోలీసులు బాలుడ్ని ఎస్పీ చేతులమీదుగా తల్లికి అప్పగించారు. రెండు గంటల్లోనే కుమారుడిని సురక్షితంగా అప్పగించినందుకు పోలీసు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిభ కనబరిచిన నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ సీతారామయ్య, పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు. అపహరించిన మహిళ ఎవరనేది తెలియరాలేదు. ఆమె కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని