వివరాల సేకరణా? విలీనమా?
జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యా సంవత్సరం ఆరంభంలో 3 కి.మీ. పరిధిలోని ప్రాథమిక బడులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
పదిలోపు విద్యార్థులున్న బడులపై ఆరా
256గా తేల్చిన విద్యాశాఖ అధికారులు
న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య)
కేఎన్‌ఆర్ ప్రాథమిక పాఠశాల 4వ తరగతి విద్యార్థులకు గదులు లేక అదే పాఠశాలలో చెట్ల కింద బోధన
‘వెంకటాచలం మండలం కనుపూరు ఎస్సీ కాలనీలోని ఎంపీపీఎస్‌లో అయిదుగురు విద్యార్థులు ఉండగా- అల్లూరు మండలం నాగులదేవిపెంట ఎంపీపీఎస్‌లో 5, మర్రిపాడు మండలం చిలకపాడు ఎంపీపీఎస్‌లో 6, అల్లూరు మండలం సుబ్బనాయుడుపల్లి ఎంపీపీఎస్‌లో 8 మంది ఉన్నారు. ఇలా జిల్లాలోని 256 పాఠశాలల్లో పదిలోపు విద్యార్థులు ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు గుర్తించారు.’
‘ఇప్పటికే పాఠశాలలు విలీనమైన చోట తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత వేధిస్తుండటంతో.. కొన్నిచోట్ల పాత బడుల్లోనే తరగతులు కొనసాగిస్తుండగా- మరికొన్నిచోట్ల ఇబ్బందుల మధ్య చదువులు సాగుతున్న పరిస్థితి. ఉదాహరణకు నెల్లూరు కేఎన్‌ఆర్ ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను దగ్గర్లోని కేఎన్‌ఆర్ హైస్కూల్‌లో విలీనం చేశారు. శనివారం ‘న్యూస్‌టుడే’ పరిశీలించగా.. ఇటీవల విలీనమైన నాలుగో తరగతి విద్యార్థులు చెట్ల కింద చదువులు కొనసాగిస్తూ కనిపించారు.’
సర్కారీ బడులు బలోపేతం చేస్తాం.. అక్కడి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం.. అర్హులందరికీ జగనన్న గోరుముద్ద, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక తదితర పథకాలు వర్తింపజేస్తాం అని పాలకులు పదే పదే చెబుతున్నా... మరోవైపు పాఠశాలలు కుదించే కార్యాచరణకు అడుగులు పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కారణం.. తాజాగా పది మందిలోపు విద్యార్థులున్న పాఠశాలల వివరాలు సేకరిస్తుండటమే. ఇప్పటికే రెండు సార్లు విలీనంతో చాలా పాఠశాలలు మూలకు చేరగా.. మరోసారి కసరత్తు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు అందడం ఆందోళన కలిగిస్తోంది.
జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యా సంవత్సరం ఆరంభంలో 3 కి.మీ. పరిధిలోని ప్రాథమిక బడులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పరిధిని ఒక కి.మీ. తగ్గించారు. ఆ మేరకు 3, 4, 5 తరగతులకు సంబంధించి.. జిల్లాలో 197 ప్రాథమిక పాఠశాలల నుంచి 55,628 మందిని దగ్గర్లోని 184 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఈ నిర్ణయంతో విలీనమైన బడుల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడటం.. ఉపాధ్యాయుల సంఖ్య తగ్గడం, విద్యార్థులకు దూరాభారం పెరగడం తదితరాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
తాజా నిర్ణయంతో మళ్లీ..
విలీనం నేపథ్యంలో పదిలోపు విద్యార్థులున్న పాఠశాలలు మరింత పెరిగాయి. జిల్లాలో ప్రస్తుతం అలాంటి బడుల సంఖ్య 256కు పైనే ఉంది. పరిస్థితి ఇలా ఉంటే.. తాజాగా తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల వివరాలు పంపాలని జిల్లా విద్యాశాఖ.. మండల స్థాయి అధికారులను ఆదేశించింది. దీంతో ఇప్పటికే 84, 85, 117 జీవోలతో 3, 4, 5 తరగతులను విలీనం చేశారని, ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరిన్ని బడులు మూతపడి.. పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రెండు దశల్లో నాడు-నేడు పనులు చేసిన బడుల్లోని విద్యార్థులు ఉన్నత పాఠశాలల్లోకి విలీనం కావడంతో.. ఆయాచోట్ల విద్యాశాఖ వెచ్చించిన నిధులు వృథా అవుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
గ్రామీణ విద్యార్థులకు నష్టం
- ఎ.సురేంద్రరెడ్డి, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వం పిల్లలకు విద్య అందకుండా చేసేందుకు యత్నిస్తోంది. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. విలీనం పేరుతో పాఠశాలలను మూసి.. ఉపాధ్యాయులను మిగులుగా తేల్చుతున్నారు.
ప్రాథమిక పాఠశాలలు నిర్వహించాలి
- చలపతిశర్మ, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వ నిర్ణయంతో ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులకు దూరమయ్యాయి. బాలికల విద్య కుంటుపడుతోంది. సబ్జెక్టు టీచర్ల బోధన అంటూనే.. వారిని తీసి.. ఎస్జీటీలను వేస్తున్నారు. ప్రాథమిక, పూర్వ ప్రాథమిక కచ్చితంగా ఉండాలి.
నివేదిక పంపాం
- ఆర్.ఎస్.గంగాభవాని, డీఈవో
ఏయే పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న వివరాలు పంపాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అడిగారు. ఆ క్రమంలోనే వాటిని సేకరించి.. పంపించాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Sangareddy: గడ్డపోతారంలో విషవాయువులతో ఉక్కిరిబిక్కిరి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Hyderabad Metro: రాయదుర్గం మెట్రో... పార్కింగ్ లేదేంటో..
-
Ap-top-news News
Kakinada - stormy winds: ఈదురుగాలులు, వర్ష బీభత్సం
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్‌లో రూ.1.2 కోట్లతో డ్రైవర్ పరారీ
-
Ap-top-news News
UPSC-Civils: కఠినంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష!