logo

అడిగేదెవరు? ఆక్రమించేశారు

అదో పారిశ్రామిక ప్రాంతం.. అక్కడ స్థలాలకున్న గిరాకీ అంతా ఇంతా కాదు.. అంకణం రూ. 4 లక్షల పైమాటే.. అలాంటి చోట ఏకంగా రహదారి పక్కనున్న రూ. 25కోట్ల విలువ చేసే 0.97 ఎకరాల స్థలం(580 అంకణాలు) దర్జాగా ఆక్రమించారు.

Published : 29 Mar 2023 01:43 IST

రూ. 25 కోట్ల ప్రభుత్వ స్థలానికి ఎసరు
వెంకటాచలం, ముత్తుకూరు, న్యూస్‌టుడే

ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు

అదో పారిశ్రామిక ప్రాంతం.. అక్కడ స్థలాలకున్న గిరాకీ అంతా ఇంతా కాదు.. అంకణం రూ. 4 లక్షల పైమాటే.. అలాంటి చోట ఏకంగా రహదారి పక్కనున్న రూ. 25కోట్ల విలువ చేసే 0.97 ఎకరాల స్థలం(580 అంకణాలు) దర్జాగా ఆక్రమించారు. ప్రభుత్వ కార్యాలయాల ముందే.. అధికారుల కళ్లెదుటే.. ఏకంగా నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోని పరిస్థితి. ఈ నిష్క్రియాపరత్వమే మరిన్ని ఆక్రమణలకు ఊతమిస్తోందన్న ఆవేదన స్థానికంగా వ్యక్తమవుతోంది.

వసతిగృహ నిర్మాణానికి వేసిన శిలాఫలకం

ముత్తుకూరులో.. నెల్లూరు-ముత్తుకూరు ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలో.. సర్వే నంబరు 485-1బీలో 0.97 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. దాన్ని రెండు దశాబ్దాల కిందట నాటి ప్రభుత్వం ఎస్సీ వసతిగృహ నిర్మాణానికి కేటాయించింది. శంకుస్థాపన కూడా చేశారు. బిల్లులు సక్రమంగా విడుదల చేయకపోవడంతో పనులు దక్కించుకున్న గుత్తేదారుడు.. పునాదుల దశలోనే భవన నిర్మాణ పనులు నిలిపివేశారు. అప్పటి నుంచి ఆ స్థలం అలానే ఉండగా.. కృష్ణపట్నం పోర్టు ఏర్పాటు కావడంతో స్థలాలకు భారీగా గిరాకీ పెరిగింది. అదే స్థాయిలో అక్రమాలు ఊపందుకున్నాయి.

నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు.. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ స్థలానికి మంచి గిరాకీ ఏర్పడటంతో.. కబ్జాదారుల కన్నుపడింది. కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ వెళ్లారు. సుమారు రూ. 25కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని.. ఇప్పటికే 80 శాతం వరకు ఆక్రమించారు. కొందరు సర్వే నంబర్లు మార్చి.. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు ఆరోపణలు ఉండగా- ఆక్రమించిన స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేసి క్రయ విక్రయాలు చేస్తున్నారనే ఫిర్యాదులు సైతం అధికారులకు అందాయి. 2015లో ఆక్రమణలపై దళిత నాయకులు, స్థానికులు ఎస్సీ కమిషన్‌తో పాటు అప్పటి కలెక్టర్‌ జానకికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆమె.. నిగ్గుతేల్చాలని విచారణకు ఆదేశించగా.. కొద్దిరోజులు ఆక్రమణదారులు మిన్నకుండిపోయారు. ప్రస్తుతం తిరిగి ఆక్రమణలు
ప్రారంభించారు.

అర్ధరాత్రి పూట నిర్మాణాలు

మొత్తం 0.97 ఎకరాల స్థలంలో చాలా వరకు ఆక్రమించగా- ప్రస్తుతం కొంత మాత్రమే మిగిలింది. అప్పట్లో వసతిగృహ నిర్మాణానికి మంత్రులు వేసిన శిలాఫలకం ఆ స్థలంలోనే ఉంది. వారం రోజులుగా శిలా ఫలకాన్ని పక్కకు నెట్టి.. ఉన్న కొద్దిపాటినీ ఆక్రమించి.. నిర్మాణాలు చేపడుతున్నారు. రహదారి పై వెళ్లే వారికి కనిపించకుండా పెద్ద పెద్ద తెరలు అడ్డుగా పెట్టి నిర్మాణాలు చేపడుతున్నారు. స్థలానికి ఒకవైపు(రహదారి మార్గంలో) గదులు, మరో వైపు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. శని, ఆదివారాలు అర్ధరాత్రి సమయంలో పైకప్పు వేశారు.

ఫిర్యాదు అందినా... పట్టని అధికారులు

ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి.. నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామస్థులు వారం రోజులుగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా.. కనీసం పరిశీలించిన దాఖలాలు లేవు. అధికారులు నిత్యం అటుగా వెళుతున్నా.. ఆ వైపు కన్నెత్తి చూడటడం లేదు. దాంతో కొందరు గ్రామస్థులు సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సాంఘిక సంక్షేమశాఖ అధికారులూ మిన్నకుండిపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఉన్న కొద్దిపాటి స్థలాన్ని అయినా కాపాడాలని కోరుతున్నారు.


నిజమే.. పరిశీలించి చర్యలు

మనోహర్‌బాబు, తహసీల్దారు, ముత్తుకూరు

వసతిగృహానికి కేటాయించిన ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని కొందరు ఫిర్యాదు చేశారు. పరిశీలించాలని వీఆర్వోకు సూచించాం. వారం కిందట నిర్మాణాలు నిలిపివేశాం. రెండు రోజుల కిందట అర్ధరాత్రి సమయంలో పైకప్పు వేస్తున్నారని సమాచారం ఇచ్చారు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. అక్రమ నిర్మాణాలని తేలితే కూల్చివేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని