logo

అసైన్డ్‌ భూముల్లో అక్రమాల పర్వం

ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. కబ్జా చేసి, ప్లాట్లు వేసి విక్రయాలకు పాల్పడుతున్నారు. రాజకీయమే అండగా.. అధికారమే పెట్టుబడిగా.. కొందరు అసైన్డ్‌, సీలింగ్‌ భూములను వదలకుండా దోచుకుంటున్నారు.

Published : 30 Mar 2023 03:46 IST

ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. కబ్జా చేసి, ప్లాట్లు వేసి విక్రయాలకు పాల్పడుతున్నారు. రాజకీయమే అండగా.. అధికారమే పెట్టుబడిగా.. కొందరు అసైన్డ్‌, సీలింగ్‌ భూములను వదలకుండా దోచుకుంటున్నారు. ఎవరైనా అభ్యంతరం చెబితే.. రెవెన్యూ అధికారుల సాయంతో రికార్డులను ఇష్టానుసారం మార్చి ముప్పుతిప్పలు పెడుతుండగా- ప్రస్తుతం బాధితులంతా కలెక్టర్‌, జేసీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: నగరం విస్తరించే అవకాశాలు ఉండటంతో.. సమీప ప్రాంతాలతో పాటు నెల్లూరు గ్రామీణ మండలంలోని భూములకు గిరాకీ వచ్చింది. సమీప కొత్తూరు, అంబాపురం, ధనలక్ష్మీపురం, కోడూరుపాడు, గుడిపల్లిపాడు, వావిలేటిపాడు ప్రాంతాల్లో ఎకరం విలువ రూ. కోట్లకు చేరింది. అదే అదనుగా అధికారమే అండగా కొందరు వ్యక్తులు మాఫియాగా ఏర్పడి భూ దందాకు తెరదీశారు. దానికి రూరల్‌ తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి సహకారం ఇవ్వడంతో రెచ్చిపోయారు. కొవిడ్‌ సమయంలో వందలాది ఎకరాలను యథేచ్ఛగా కబ్జా చేశారు. పేదలకు ఇచ్చిన భూములు కొనుగోలు చేసినట్లు, వారసత్వంగా వచ్చినట్లు రికార్డుల్లో ఇష్టానుసారం మార్పులు చేశారు. వాటికి సంబంధించిన రికార్డులేవీ కార్యాలయంలో అందుబాటులో లేకుండా చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకునేవారు లేకపోవడంతో... ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే స్పందనలో అర్జీలు సమర్పిస్తున్నారు. ఆ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌ నుంచి తహసీల్దారు కార్యాలయానికి సదరు అర్జీలు పంపిస్తుండగా- వాటికి సంబంధించిన ఎలాంటి రికార్డులు లేవని చెబుతుండటం గమనార్హం. ఇటీవల రెండు సమస్యలకు సంబంధించి రికార్డులు తీసుకురావాలని జేసీ కూర్మనాథ్‌ అడిగినా.. ఎలాంటి స్పందన లేకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

నాలుగేళ్లలో నాశనం

నెల్లూరు రూరల్‌ కార్యాలయంలో ఆ అధికారి అన్నీ తానై పని చేశారు. ఓ ప్రజాప్రతినిధి అండతో నాలుగేళ్లలో భూ రికార్డులు నాశనం చేశారు. ఎందరు తహసీల్దార్లు వచ్చినా.. అధికార బలంతో అక్కడ ఉండనీయలేదు. రికార్డుల మార్పు మొదలు.. అసలు దస్త్రాలు మాయం చేయడం వరకు, పేదల భూములను పక్కదారి పట్టించేందుకు ఎన్ని చేయాలో.. అన్నీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఎవరైనా తమ భూమికి సంబంధించిన వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరినా.. కనీసం సమాధానం ఇచ్చేవారు కాదని, అడిగితే మా దగ్గర లేవు. ఏం చేసుకుంటారో చేసుకోండని సమాధానం చెబుతున్నారని బాధితులు ఉన్నతాధికారుల వద్ద వాపోయిన సంఘటనలు ఉన్నాయి. కొత్తూరు పరిధిలో గతంలో 395 ఎకరాలను పేదలకు అసైన్‌మెంట్‌ కింద పట్టాలుగా పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆ భూములన్నీ పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కుట్రపూరితంగా రికార్డులు మార్చి.. అక్రమార్కులకు కట్టబెట్టినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వస్తున్న అర్జీలే చెబుతున్నాయి. కొందరు న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తే.. వెంటనే ఆ భూమిని లేఅవుట్లుగా మార్చి విక్రయిస్తుండటం గమనార్హం. ఉన్నతాధికారులు పదే పదే వివరాలు కావాలని అడుగుతుండటంతో.. సదరు ఉద్యోగి సెలవుపై వెళ్లారు. ఇదంతా అధికారులకు తెలిసినా.. కనీస చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనిపై చర్చ నడుస్తుండటంతో.. రూరల్‌ తహసీల్దారు కార్యాలయమంటేనే అధికారులు భయపడుతున్నారు. తహసీల్దారు సెలవుపై వెళ్లి నాలుగు నెలలైనా.. ఇప్పటికీ అక్కడ ఎవరూ విధుల్లో చేరలేదు.


ప్రత్యేక గ్రీవెన్స్‌కు 60 అర్జీలు

నెల్లూరు రూరల్‌ నుంచి.. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఎక్కువగా ప్రజలు వస్తుండటంతో జేసీ కూర్మనాథ్‌ ఇటీవల ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహించారు. దాదాపు 60 అర్జీలు అందాయి. వాటిలో తమ భూమి ఆక్రమించుకున్నారని, రికార్డులు మార్చారని, వాటిని సరిచేసి న్యాయం చేయాలన్నవే ఎక్కువ. మరికొందరు సమస్య కోర్టులో ఉన్నా.. అధికారులు విచారణ జరుపుతున్నా.. అక్రమార్కులు విక్రయాలు జరిపి.. నిర్మాణాలు చేపడుతున్నారని వాపోయారు.

దీనిపై జేసీ కూర్మనాథ్‌ మాట్లాడుతూ.. నెల్లూరు రూరల్‌ నుంచి వచ్చిన భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. వాటిని పరిశీలించి.. నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తాం. అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని