logo

గుంతల దారి.. సర్దుకుపో బాటసారీ

ఉదయగిరి-నెల్లూరు రహదారి నందవరం నుంచి నందిపాడు వరకు అధ్వానంగా తయారైంది. మార్జిన్లలో రెండు వైపులా కొన్ని అడుగుల మేర గుంతలు ఏర్పడ్డాయి.

Published : 30 Mar 2023 03:46 IST

చినమాచునూరు సెంటర్‌లో అధ్వానంగా రోడ్డు

ఆత్మకూరు గ్రామీణం(మర్రిపాడు), న్యూస్‌టుడే: ఉదయగిరి-నెల్లూరు రహదారి నందవరం నుంచి నందిపాడు వరకు అధ్వానంగా తయారైంది. మార్జిన్లలో రెండు వైపులా కొన్ని అడుగుల మేర గుంతలు ఏర్పడ్డాయి. ఈ మార్గం ఇరుకుగా ఉండటంతోపాటు ప్రయాణం నరకంగా మారింది. ఈ గతుకుల నుంచి ఎప్పుడు బయట పడతామా? అని ప్రయాణికులు నిట్టూర్చుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు. ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుందనీ, గేరు తగ్గించుకుని నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోందని వాహనచోదకులు చెబుతున్నారు.

చినమాచునూరు నుంచి మరీ అధ్వానం..

రాంపల్లి నుంచి నెర్ధనంపాడు వరకు రోడ్డు కొంత ఫర్వాలేదు. కానీ, చినమాచునూరు నుంచి నందిపాడు వరకు అడుగడుగునా గుంతలతో వాహనచోదలకు అవస్థలు ఎదురవుతున్నాయి. ఎదుటి వాహనానికి దారివ్వాలంటే ఆగి పక్కకు తప్పుకోవాల్సిందే. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సుల్లో ప్రయాణించే వారు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించే పరిస్థితి ఉండదు. దారి ఇరుకుగా ఉండటంతోపాటు, ఎదురుగా వాహనాలు వస్తుండటంతో నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి. రోడ్డు పక్క మార్జిన్లు నిర్వహణ లేక గోతులతో ఉండటంతో కిందికి దిగి వాహనాలను దాటి వెళ్లలేని పరిస్థితి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే కనాకష్టంగా మారింది. రెండు వరుసలుగా మార్చేందుకు సర్వే చేసి ప్రతిపాదనలు సిద్ధమైనా నేటికీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.

ఆర్టీసీకి నిర్వహణ భారం

నరక దారుల్లో ఒక రోజు డ్యూటీకి వెళ్లొస్తే ఒళ్లు గుల్లవుతోందని బస్సు డ్రైవర్లు చెబుతున్నారు. బస్సులు తీవ్ర కుదుపులకు గురై.. ఒళ్లు హూనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే బస్సులకు స్ప్రింగ్‌లు, కట్టలు, టైర్లు తరచూ మరమ్మతులకు గురవుతూ ఆర్టీసీకి నిర్వహణ భారం తప్పడంలేదు. గుంతలదారి కావడంతో బస్సులు మాటిమాటికీ పాడవుతున్నాయి. మెకానిక్‌లు వీటికి ఎన్నిసార్లు మరమ్మతులు చేస్తున్నా.. పునరావృతం అవుతూనే ఉన్నాయని డ్రైవర్లు చెబుతున్నారు.

ప్రతిపాదనలకే పరిమితం

వీటి మరమ్మతులకుగానూ రహదారులు, భవనాలశాధికారులకు రూ.ఏడు కోట్ల వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు అనుమతి రాలేదు. ఫలితంగా ఇటుగా రాకపోకలు సాగించే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ర.భ.శాఖ ఏఈ అనిల్‌ను వివరణ కోరగా రూ.20 లక్షలతో రోడ్డుపై పెద్ద గుంతలు పడ్డి ఉన్నచోట మరమ్మతుల పనులు చేపట్టామన్నారు. రహదారి నిర్మాణానికి ప్రతిపాదనల ఆమోదం లభించిన వెంటనే పనులు మొదలు పెడతామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని