logo

శతాబ్దాల చరిత.. కలువాయి చెరువు ఘనత

కలువాయి చెరువుకు శతాబ్దాల చరిత్ర ఉంది. కాలంలో కాస్త వెనక్కి వెళ్తే 500 సంవత్సరాల క్రితం కలువాయి కనిగిరి, ఉదయగిరి ప్రాంతాలు శ్రీకృష్ణ దేవరాయలు సామ్రాజ్యంలో ఉండేవి.

Published : 30 Mar 2023 03:46 IST

కలువాయి చెరువు

కలువాయి, న్యూస్‌టుడే: కలువాయి చెరువుకు శతాబ్దాల చరిత్ర ఉంది. కాలంలో కాస్త వెనక్కి వెళ్తే 500 సంవత్సరాల క్రితం కలువాయి కనిగిరి, ఉదయగిరి ప్రాంతాలు శ్రీకృష్ణ దేవరాయలు సామ్రాజ్యంలో ఉండేవి. ఆయన ఈ ప్రాంతాన్ని క్రీ.శ.1509 నుంచి 1529 వరకు పాలించారు. 1512లో ఉదయగిరి దుర్గాన్ని  జయించి.. దానికి అధిపతిగా రాయసం కొండముర్సయ్యను నియమించారు. ఈయన గొప్ప సేనాని. అంతేగాకుండా ప్రజల కష్ట సుఖాలు తెలిసిన నాయకుడు. నాటి ఉదయగిరి దుర్గం ఏలుబడిలో ఆత్మకూరు, ఉదయగిరి, కనిగిరి, కలువాయి ప్రాంతాలు ఉండేవి.

తటాకం నిర్మించింది ఇలా..

క్రీ.శ. 1520లో ఉదయగిరి దుర్గం రక్షణ కోసం సైన్యాన్ని బలపరిచే నిమిత్తం కావలసిన గుర్రాల కొనుగోలుకు దేవరాయలు 10వేల వరహాలు కొండముర్సయ్య ఇచ్చి తంజావూరు నగరాధీశుని వద్ద గుర్రాలను కొనుగోలు చేసి తీసుకురమ్మని పంపించాడు. వెంటనే ఆయన బయల్దేరి మార్గమధ్యలో కలువాయి పక్కనే ఉన్న బ్రాహ్మణపల్లిలో ఒక రోజు విడిది చేశాడు. వెంట వచ్చిన సైనికులు ఆ ప్రాంతలో దొరికిన రాగులతో రాగి సంగటి చేసుకొని తిని తృప్తి చెందారు. కొండముర్సయ్య మాత్రం వరి బియ్యం కోసం గ్రామంలోకి మనుషులను పంపించాడు. ఎక్కడా వారికి బియ్యం దొరకలేదు. గ్రామంలోని ఒక వృద్ధురాలు దుర్గాధిపతితో.. ‘ఇక్కడ వరిపంట పండదు. పెంచలకోన కొండల నుంచి వచ్చే వాగులన్నీ పెన్నా నదిలోకి ప్రవహిస్తాయి. అందువల్ల ఇక్కడ వరిసాగు లేదు’ అని చెప్పింది. దీంతో అక్కడ పరిస్థితిపై బాధపడిన కొండముర్సయ్య ప్రజల కష్టనష్టాల గురించి ఆలోచించి.. గుర్రాల కోసం ఇచ్చిన 10వేల వరహాలను వినియోగించి బ్రాహ్మణపల్లి కొండ, బొటికొండల మధ్య కట్టను ఏర్పాటు చేసి కలువాయి చెరువును నిర్మించారు. అయితే అప్పట్లో వారు చెరువుకు పడమటి అలుగును మాత్రమే నిర్మించారు. దీంతో ప్రజలకు కొంతమేర మాత్రమే ఉపయోగంలో ఉండేది. తరువాత కాలంలో కుల్లూరు సీమ అధిపతి చింతపట్ల రుద్రప్ప 1612లో తూర్పు అలుగును నిర్మించాడు. దీంతో ప్రజలకు పూర్తిస్థాయిలో కలువాయి తటాకం వినియోగంలోకి వచ్చింది.

ఏడాదికి రెండు పంటలు

ఇటీవల కాలంలో సోమశిల జలాశయం నిర్మాణం తరువాత దక్షిణ కాలువను ఏర్పాటు చేసి కలువాయి చెరువును బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ చేయడంతో కలువాయి, బ్రాహ్మణపల్లి, పెన్నబద్దెవోలు, నూకనపల్లి ప్రజల సాగునీటి, తాగునీటి అవసరాలను తీరుస్తోంది. ఈ చెరువు ఆయకట్టుదారులు ఏడాదికి రెండు సీజన్లలో పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని