logo

Nellore: అమ్మే.. ఆయుష్షు తీసింది

కనురెప్పే కనుపాపను కాటేసింది.. పొత్తిళ్లలో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బిడ్డను తల్లే కడతేర్చింది. కారణమేదైనా.. అమ్మ స్పర్శ.. ఆమె రూపం తప్ప.. మరో ప్రపంచం తెలియని ఏడాదిన్నర బిడ్డ.. కన్నతల్లి కర్కశత్వానికి విగతజీవిగా మారింది.

Updated : 06 Apr 2023 10:12 IST

చిన్నారి అదృశ్యం.. విషాదాంతం

చిన్నారి లక్ష్మీ హారిక

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: కనురెప్పే కనుపాపను కాటేసింది.. పొత్తిళ్లలో పెట్టుకుని కాపాడుకోవాల్సిన బిడ్డను తల్లే కడతేర్చింది. కారణమేదైనా.. అమ్మ స్పర్శ.. ఆమె రూపం తప్ప.. మరో ప్రపంచం తెలియని ఏడాదిన్నర బిడ్డ.. కన్నతల్లి కర్కశత్వానికి విగతజీవిగా మారింది. మాతృత్వానికే కలంకం తీసుకొచ్చే ఈ విషాద సంఘటన నెల్లూరులోని గుర్రాలమడుగు సంఘంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని ఓ కళాశాలలో ఎంసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అనూషకు బంధువైన మణికంఠతో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరికి కృతిక, లక్ష్మీహారిక సంతానం. భర్త రాపూరులో హోటల్‌ నిర్వహిస్తూ.. అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటారు. ఈ నెల 2వ తేదీ రాత్రి అనూష తన ఇద్దరు పిల్లలతో సమీపంలోని బంధువుల ఇంట్లో నిద్రపోయింది. చిన్న కుమార్తె లక్ష్మీహారిక ఊయలలో నిద్రించగా.. పెద్ద కుమార్తె, తల్లి కింద పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నిద్రలేచి చూడగా ఊయలలో లక్ష్మీ హారిక కనిపించలేదు. రెండు బొమ్మలు ఉన్నాయి. దాంతో పాపను ఎవరో అపహరించారని తల్లి పెద్ద ఎత్తున కేకలు వేసింది. అనంతరం బాలాజీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. రెండు రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ తెలియకపోవడంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. తల్లి అనూషను అదుపులోకి తీసుకుని విచారించగా.. తొలుత తనకే పాపం తెలియదని బుకాయించింది. ఆ తర్వాత అసలు విషయం వెల్లడించింది. తన చదువు, భవిష్యత్తుకు రెండో బిడ్డ అడ్డుగా ఉందని భావించి రెండో తేదీ అర్ధరాత్రి ఇంటి వెనకున్న సర్వేపల్లి కాలువలో పడేశానని విచారణలో ఒప్పుకొంది. దాంతో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి ఈతగాళ్లను పిలిపించి సర్వేపల్లి కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా చిన్నారి మృతదేహం వెలుగుచూసింది. శవపంచనామా నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అదృశ్యం కేసును హత్య కేసుగా మార్చారు. బుధవారం సాయంత్రం నిందితురాలిని బాలాజీనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలను నగర డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్‌ రాములు నాయక్‌, ఎస్సై సుమన్‌, లేఖా ప్రియాంక, సిబ్బందిని అభినందించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని