విచారణ.. సాగదీత
వెంకటాచలం మండలం పంచాయతీరాజ్ విభాగంలో సిమెంట్, ఇసుక పక్కదారి పట్టిన వ్యవహారంపై అధికారుల విచారణ ముందుకు సాగడం లేదు.
నిగ్గు తేలని సిమెంటు, ఇసుక స్వాహాపర్వం
వెంకటాచలం, న్యూస్‌టుడే
వెంకటాచలం మండలం పంచాయతీరాజ్ విభాగంలో సిమెంట్, ఇసుక పక్కదారి పట్టిన వ్యవహారంపై అధికారుల విచారణ ముందుకు సాగడం లేదు. జిల్లా మంత్రి, కలెక్టర్, ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విచారణ వేగవంతం చేసి అక్రమాలు నిగ్గు తేల్చాలని చెప్పినా.. నేడు, రేపు అంటూ మీనమేషాలు లెక్కిస్తున్న పరిస్థితి.
వెంకటాచలం మండలంలో రూర్బన్, ఉపాధి నిధులతో రూ. కోట్లు వెచ్చించి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశారు. గుత్తేదారుల సౌలభ్యం కోసం అప్పట్లో ప్రభుత్వం ముందుగా రాయితీపై సిమెంట్, ఇసుక సరఫరా చేసింది. వాటికి సంబంధించిన నగదును తర్వాత బిల్లుల్లో రికవరీ చేశారు. ఇక్కడే అధికారులు అవినీతికి తెరలేపారు. చాలా మంది గుత్తేదారులకు సిమెంట్, ఇసుక సరఫరా చేయకుండానే.. చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి బిల్లుల్లో నగదు స్వాహా చేశారు. విషయం తెలుసుకున్న గుత్తేదారులు ఖంగుతిన్నారు. తమకు సిమెంట్, ఇసుక ఇవ్వకుండా బిల్లుల్లో నగదు ఎలా మినహాయించుకుంటారని నాటి ఏఈని నిలదీశారు. సమాధానం కరవైంది. ఈ మొత్తం వ్యవహారంపై ఫిబ్రవరి 18న ‘గుత్తేదారులకే సున్నం’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది.
ఆదేశాలిచ్చినా.. అమలేదీ?
‘ఈనాడు’లో కథనం వచ్చిన వెంటనే స్పందించిన మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ఆరోపణలతో పాటు మొత్తం పనులపై విచారణ జరపాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు(పూర్వ, ప్రస్తుత) ఆ మేరకు మూడు నెలల కిందటే ఆదేశాలు జారీ చేసినా, నేటికీ విచారణ పూర్తి చేయలేదు. ప్రారంభంలో విచారణ పేరుతో హడావుడి చేసి.. ఆ తర్వాత మిన్నకుండిపోయారని గుత్తేదారులు ఆరోపిస్తున్నారు. విచారణ మొక్కుబడిగా సాగుతోందంటూ కొందరు ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిగ్గు తేల్చాలని.. అక్కడి నుంచి కూడా 20 రోజుల కిందటే ఆదేశాలు వచ్చినా.. ‘చూస్తాం.. చేస్తాం.. మాట్లాడుతున్నాం’ అనే మాటే వినిపిస్తోందని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోతుగా పరిశీలిస్తే...
జిల్లా అధికారులు ఒకటీ, రెండు పనులపైనే విచారణ జరిపారు. సిమెంట్, ఇసుక పక్కదారి పట్టిందని నిర్ధారించారు. ఒకరికి సిమెంటు ఇవ్వకుండా ఇచ్చినట్లు చూపి నగదు తగ్గించగా, ఒక గుత్తేదారుడికి పనులకు మించి సిమెంటు సరఫరా చేసినట్లు గుర్తించారు. అలా ఒకరి సిమెంటును మరొకరికి విక్రయించి అప్పటి పంచాయతీ రాజ్ ఏఈ చేతివాటం ప్రదర్శించారని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం కొన్ని పనులకు మాత్రమే బిల్లులు చెల్లించింది. చాలా మందికి ఇంకా రావాల్సి ఉంది. బిల్లులు తీసుకున్న వారు.. వాటిలో సిమెంట్, ఇసుక ఇవ్వకుండా నగదు తగ్గించడాన్ని గుర్తించి ఫిర్యాదు చేశారు. అందరికీ మొత్తం బిల్లులు చెల్లిస్తే.. ఎంత వరకు అక్రమాలు జరిగాయన్నది వెల్లడవుతుంది. ఆ దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గుత్తేదారులు కోరుతున్నారు.
మరి ఇసుక...
వెంకటాచలంలో ఉంటున్న నాలి రవికుమార్ కాకుటూరులో రూ. 12.25 లక్షలతో సిమెంట్ రోడ్లు వేయించారు. ఈయనకు సిమెంట్, ఇసుక ఇవ్వలేదు. సిమెంట్ 640 బస్తాలు(32 మెట్రిక్ టన్నులు), ఇసుక 224 టన్నులు ఇచ్చినట్లు చూపి బిల్లులో రూ. 1.20 లక్షలు, రూ. 84వేలు కోత విధించారు. ఈ విషయంపై ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైన వెంటనే జిల్లా అధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపిన పంచాయతీరాజ్ అధికారులు సిమెంట్ మరో గుత్తేదారుడికి ఇచ్చారని తేల్చి.. నగదు ఇచ్చారు. ఇసుక విషయం కూడా తేల్చాలని సదరు గుత్తేదారుడు మూడు నెలలుగా తిరుగుతున్నా నేడు, రేపు అంటూ అధికారులు కాలయాపన చేస్తూనే ఉన్నారు.
రికార్డులు చూపించాలని చెప్పాం..
బాలసుబ్బారావు, పీఆర్ ఈఈ
వెంకటాచలం మండలంలో సిమెంట్, ఇసుక పక్కదారి పట్టించారని వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నాం. అప్పట్లో గడ్డ కడుతోందని ఒకరి సిమెంట్ మరొకరికి ఇచ్చారు. జరిగిన పనులకు సబంధించిన మొత్తం రికార్డులు చూపించాలని అప్పటి ఏఈకి సూచించాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Tragedy: సరిగ్గా 14 ఏళ్ల క్రితం.. ఇదే శుక్రవారం..!
-
Crime News
Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. 278కి చేరిన మృతుల సంఖ్య
-
General News
Odisha Train Accident: రాజమహేంద్రవరం రావాల్సిన 21 మంది ప్రయాణికులు సురక్షితం
-
India News
Odisha Train Tragedy: విపత్తు వేళ మానవత్వం.. రక్తదానానికి కదిలొచ్చిన యువకులు
-
General News
odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
-
India News
Trains Cancelled: ఒడిశా రైలు ప్రమాదం.. 40కిపైగా రైళ్లు రద్దు..