logo

ఈ సారీ.. చక్కెర లేదాయె

జిల్లాలో రేషన్‌ పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఒక నెలలో చక్కెర ఇస్తే.. మరో నెలలో కందిపప్పు ఇవ్వని దుస్థితి నెలకొంది. దీంతో కార్డుదారులకు ప్రతి నెలా ఇబ్బందులు తప్పడం లేదు.

Published : 01 Jun 2023 02:12 IST

కందిపప్పు అరకొరగానే..
కోవూరు, న్యూస్‌టుడే

కోవూరు మండలం ఇనమడుగు స్టాక్‌పాయింట్లో చక్కెర, కందిపప్పు కోసం వచ్చిన డీలర్లు

జిల్లాలో రేషన్‌ పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఒక నెలలో చక్కెర ఇస్తే.. మరో నెలలో కందిపప్పు ఇవ్వని దుస్థితి నెలకొంది. దీంతో కార్డుదారులకు ప్రతి నెలా ఇబ్బందులు తప్పడం లేదు. రేషన్‌ దుకాణంలో వచ్చే కందిపప్పు, చక్కెర కోసం ఎదురు చూడటం తప్ప.. ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు దృష్టిసారించి.. అవి సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలని కోరుతున్నారు.

జిల్లాలో ఈ నెలలో చక్కెర పంపిణీకి అధికారులు ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పంపిణీ అనుమానంగానే ఉంది. కందిపప్పు సైతం 40శాతం మందికి సరిపడానే జిల్లాలోని 11 మండల స్టాక్‌ పాయింట్లకు సరఫరా చేయగా- అక్కడా అధికారులు తమకు అనుకూలమైన డీలర్లకు అధికంగా ఇచ్చి.. తక్కిన వారికి తక్కువ పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు నెలకొన్నాయి. చివర్లో ఉన్న వారికి అదీ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బియ్యం మాత్రమే పంపిణీ చేసి.. కందిపప్పు ఇవ్వకుంటే ప్రజలు తమను నిలదీస్తున్నారని.. పైగా కందిపప్పు అమ్మితేనే తమకు ప్రభుత్వం కమిషన్‌ ఇస్తుందని డీలర్లు వాపోతున్నారు. ఈ పరిస్థితులపై కార్డుదారులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బక్రీద్‌ సమయంలోనూ ఇంతేనా?

రసూల్‌, కోవూరు

బక్రీద్‌ ఉంది.. ఈ నెలలోనూ చక్కెర పంపిణీ చేయకుంటే ఎలా? రేషన్‌ దుకాణాలకు బదులు బియ్యం దుకాణం అని పేరు పెడితే బాగుండేది. చక్కెర, కందిపప్పు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

గుత్తేదారుడు సరఫరా నిలిపివేశారు

వెంకటేశ్వర్లు, డీఎం, పౌరసరఫరాలశాఖ

గుత్తేదారుడు చక్కెర సరఫరాను గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేశారు. విన్నవిస్తున్నా ఫలితం లేదు. జిల్లాకు ప్రతి నెలా 271.519 టన్నులు అవసరం. కందిపప్పు 25 శాతం అలాట్‌మెంట్‌ కింద 172 టన్నులు రావాల్సి ఉండగా.. 145 టన్నులు వచ్చింది. 27 టన్నులు కొరత ఏర్పడింది. అన్ని రేషన్‌ దుకాణాలకు కందిపప్పు సమానంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని