logo

జగనన్నకు చెప్పినా.. వినట్లే!

‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. ప్రతి సమస్యను గడువులోపు పరిష్కరిస్తున్నాం. బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏ ఒక్క అర్జీ కూడా లేదు. - ఇవీ ఇటీవల కలెక్టర్‌ హరినారాయణన్‌ చెప్పిన మాటలు.

Updated : 01 Jun 2023 05:31 IST

పరిష్కరించకనే.. పరిష్కరించామని సంక్షిప్త సందేశాలు
సీఎంవో నుంచి ఫోన్‌ రావడంతో ‘రీ- ఓపెన్‌’
ఈనాడు డిజిటల్‌, నెల్లూరు

కలెక్టరేట్‌లో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అర్జీలు తీసుకుంటున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. ప్రతి సమస్యను గడువులోపు పరిష్కరిస్తున్నాం. బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏ ఒక్క అర్జీ కూడా లేదు.

ఇవీ ఇటీవల కలెక్టర్‌ హరినారాయణన్‌ చెప్పిన మాటలు.

రికార్డుల ప్రకారం అది నిజమే అయినా.. తిరిగి ఓపెన్‌ అవుతున్న అర్జీల సంఖ్య కూడా అలాగే పెరుగుతోంది. జిల్లాలోని ప్రతి మండల కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నా.. అక్కడ ఇచ్చే అర్జీలకు పరిష్కారం దొరకడం లేదనే ఉద్దేశ్యంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు వరుస కడుతున్నారు. ఆ సంఖ్య సగటున 200 నుంచి 250 వరకు ఉంటోంది. ఒక్క కలెక్టరేట్‌లో నిర్వహించే కార్యక్రమానికే ఇన్ని అర్జీలు వస్తుంటే.. జిల్లా, మండల కార్యాలయాల్లో ఆ సంఖ్య గణనీయంగానే ఉంటుంది. సమస్యను బట్టి వారం నుంచి మూడు నెలల్లో అర్జీ పరిష్కరించాల్సి ఉన్నా.. ఆ విషయంలో పలువురు అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి ఎంతో మంది కలెక్టరేట్‌కు వచ్చి తమ గోడును అర్జీల రూపంలో అందిస్తుండగా.. వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరించకుండానే.. చేసినట్లు చెబుతున్నారు. అర్జీదారుడికి సమాచారం ఇవ్వకుండానే సమస్య పరిష్కరించామని సెల్‌ఫోన్‌ సందేశం పంపి చేతులు దులుపుకొంటుండగా- బాధితులు మళ్లీ మళ్లీ ఫిర్యాదు చేయాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు.

ఫొటో అప్‌లోడ్‌ చేయాల్సి ఉన్నా..

జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను దరఖాస్తుదారుడికి తెలియకుండా మూసివేయడానికి వీలు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ అందుబాటులోకి తెచ్చింది. ఆ ప్రకారం సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లాల్సి ఉంటుంది. సంబంధిత శాఖ అధికారి అర్జీ ఇచ్చిన వారితో మాట్లాడటంతో పాటు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లే తేదీ, సమయం, ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తాం అనే వివరాలను ముందుగా చెప్పాల్సి ఉంది. క్షేత్రస్థాయికి పరిశీలనకు వెళ్లగానే ముందుగా సమస్యపై మాట్లాడి.. ఆ సమయంలో అర్జీదారుడితో తప్పనిసరిగా ఫొటో తీసుకోవాలి. అనంతరం ఆ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయడంతో పాటు ఏ విధంగా పరిష్కరించామనే వివరాలను పొందుపరచాల్సి ఉంది. ఇంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినా.. పరిష్కారం కాకుండానే పూర్తయినట్లు చూపుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. స్పందనకు వచ్చిన అర్జీల వివరాలు, అవి ఏయే దశల్లో ఉన్నాయనే సమాచారం ఇవ్వడంలోనూ కలెక్టరేట్‌ సిబ్బంది గోపత్య పాటిస్తుండటం గమనార్హం.

26 అర్జీలు తిరిగి ప్రారంభం

క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారమైనట్లు అధికారులు నమోదు చేసిన తర్వాత.. సీఎంవో నుంచి అర్జీదారులకు ఫోన్‌ చేస్తున్నారు. మీ సమస్య పరిష్కారం అవడంపై మీ సంతృప్తి చెందుతున్నారా? అని అడగ్గా.. సుమారు 26 మంది లేదని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దాంతో వాటిని తిరిగి ప్రారంభించాలని సూచించారు. రెవెన్యూ, గ్రామ సచివాలయాలు, పశుసంవర్ధకశాఖ, గ్రామీణ నీటిపారుదలశాఖ, వ్యవసాయం, సర్వే తదితర శాఖలవి తిరిగి ప్రారంభించాలన్న అర్జీలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

* నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి.. కాలువలు ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారని స్పందనలో ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆయన చరవాణికి ఓ సంక్షిప్త సమాచారం వచ్చింది. ‘మీ సమస్యను పరిష్కరించాం’ అని అందులో ఉంది. సదరు వ్యక్తి.. సమస్య ఉన్న ప్రాంతానికి వెళ్లగా.. ఎలాంటి మార్పు లేదు. పనులు ఆగడం అటుంచి.. శరవేగంగా జరుగుతుండటంతో అవాక్కయ్యారు.

* కోవూరు నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి.. నార్తురాజుపాళెం వద్ద ప్రభుత్వ స్థలంలో గ్రావెల్‌ అక్రమంగా తవ్వుతున్నారని కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే నిలుపుదల చేసినట్లు ఆయనకు ఓ సమాచారం పంపారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు లేదు. పైగా ఫిర్యాదు చేసిన వ్యక్తికి బెదిరింపులు వచ్చాయి. దాంతో నాకెందుకులే అని మిన్నకుండిపోయారు.

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి

రోణంకి కూర్మనాథ్‌, జేసీ

జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా వస్తున్న ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాం. వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నాం. కొన్ని దరఖాస్తులు తిరిగి రీ ఓపెన్‌ అవుతున్నాయి. అలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. నిత్యం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నాం. దరఖాస్తుదారుడు లేకుండా ఏ అర్జీ మూసివేయడానికి వీలులేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని