logo

నిర్లక్ష్యమే.. నీట ముంచింది

అధికారులు.. గుత్తేదారుల నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలో భారీ గుంతలు తీసినా.. కనీసం హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం.. పని ప్రదేశంలో కాపలాదారులను నియమించకపోవడం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

Published : 01 Jun 2023 02:12 IST

ప్రమాదం జరిగిన గుంత

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: అధికారులు.. గుత్తేదారుల నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలో భారీ గుంతలు తీసినా.. కనీసం హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం.. పని ప్రదేశంలో కాపలాదారులను నియమించకపోవడం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. రోజూ ఆడుకునే ప్రాంతం కావడంతో పిల్లలు గుంతల్లో నిలిచిన నీటిలో దిగగా- అప్రమత్తమైన తల్లులు బిడ్డలను కాపాడి.. వారు ప్రాణాలు వదిలిన హృదయ విదారక సంఘటన నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్‌నగర్‌లో బుధవారం చోటు చేసుకుంది. 2021 నవంబరులో కురిసిన భారీ వర్షాలకు పెన్నానదికి వరద పోటెత్తి.. వెంకటేశ్వరపురం, భగత్‌సింగ్‌ కాలనీలు నీటమునిగాయి. ఆ సందర్భంగా నెల్లూరు వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. వరద నీటి రక్షణ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. దానికి గత ఏడాది జులై జులై 13వ తేదీ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అంబటి రాంబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 94.59 కోట్లతో నిర్మించే రక్షణ గోడ పనులు మూడు రోజుల కిందటే ప్రారంభించారు. రెండు భారీ యంత్రాలతో 30 మీటర్ల పొడవు, అయిదు మీటర్ల వెడల్పుతో భారీ గుంతను తీయడంతో పాటు కాలనీ సమీపంలో మరో రెండు, మూడు ప్రాంతాల్లో గుంతలు తీశారు. సాధారణంగా పని జరిగే ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాదకర ప్రాంతాల దగ్గరకు ఎవరూ వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత గుత్తేదారు సంస్థపై ఉండగా- వాటిని సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షించాలి. వరద నీటి కాలువ పనులు ప్రారంభించి.. మూడు రోజులు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఒక్కరినీ నియమించలేదు.

పనులు కాదు.. పాత గుంతలో !

ప్రమాద విషయం తెలుసుకున్న ప్రతిపక్ష పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పెద్దఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుంతలను పరిశీలించడంతోపాటు బాధిత కుటుంబాలను పరామర్శించారు. అదే సమయంలో పోలీసులు, సచివాలయ సిబ్బంది బాధితులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ‘అయిపోయిందేదో అయిపోయింది.. జరగాల్సింది చూద్దాం’ అని చెప్పడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చే వరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు. సాయంత్రం 4 గంటలకు ప్రమాదం జరిగితే.. రాత్రి 9 గంటలైనా ఉన్నతాధికారులు స్పందించకపోవడం ఏమిటని అక్కడికి వచ్చిన అధికారులను నిలదీశారు. వారు వచ్చే వరకు మృతదేహాలను కదిలించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ సమయంలో ఓ పోలీసు అధికారి అవి రిటైనింగ్‌ వాల్‌ పనుల కోసం తీసిన గుంతలు కాదని, ఎప్పుడో తీసిన గుంతల్లో ప్రమాదవశాత్తు పడి చనిపోయారని చెప్పడంతో స్థానికులు మండిపడ్డారు. కళ్లెదుట ఇసుక తవ్విన యంత్రాలు కనిపిస్తున్నా.. ఈ విధంగా మాట్లాడటం.. రెండు ప్రాణాలు పోవడానికి కారణమైన వారిని రక్షించేందుకేనని విమర్శించారు. తెదేపా నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు కప్పిర శ్రీనివాసులు, సీపీఎం నాయకులు మూలం రమేష్‌, కత్తి శ్రీనివాసులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని