logo

జల్‌జీవన్‌.. మరింత జాప్యం

పల్లెసీమల్లో ఇంటింటా కుళాయిలు నిర్మించి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయటానికి ఉద్దేశించిన జలజీవన్‌ మిషన్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇందులో రాజకీయ జోక్యంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల పాత్ర నామమాత్రమవుతోంది.

Published : 01 Jun 2023 02:12 IST

గుత్తేదారుకి నోటీసులు మళ్లీ టెండర్లకు సిద్ధం
న్యూస్‌టుడే, కావలి

కావలి మండలంలో చేపట్టిన జల్‌జీవన్‌ మిషన్‌ పనులు

పల్లెసీమల్లో ఇంటింటా కుళాయిలు నిర్మించి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయటానికి ఉద్దేశించిన జలజీవన్‌ మిషన్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇందులో రాజకీయ జోక్యంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల పాత్ర నామమాత్రమవుతోంది. టెండర్లు దాఖలు చేసిన గుత్తేదారులు ఆపై ముందుకు రాకపోవడంతో లక్ష్యాన్ని సాధించలేక ఇబ్బంది పడుతున్నారు.

కావలి నియోజకవర్గంలో మాజీ మార్కెట కమిటీ ఛైర్మన్‌ తనయుడు పేరిట పొందిన పనులన్నింటినీ (సుమారు వందకు పైగానే) రద్దు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ యంత్రాంగం నిర్ణయించుకుంది. ఈమేరకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. నోటీసుల ప్రక్రియ అంతా లాంఛనమే. మరో నెలలో మళ్లీ టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీంతో పనులు మరింత జాప్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

* రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపడుతున్న అనేక అభివృద్ధి పనులు చేపట్టటానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యాల నిధులతోనే జలజీవన్‌ పథకం పనులు చేపడుతున్నారు. ఈతరహా పనులు సైతం సకాలంలో చేపట్టకపోవడంతో నిధులు వెనక్కువెళ్లే పరిస్థితి ఎదురవుతోంది.

* జిల్లా పరిధిలో రూ.253 కోట్లతో 1941 పనులను జలజీవన్‌ పథకం కింద మంజూరు చేశారు. ఈ పనులన్నీ గత మార్చి నెలాఖరుకే పూర్తి చేయాలి. అంతా అనుకున్నట్టుగా జరిగి ఉంటే దాదాపు 2.51 లక్షల నివాసాలకు ఇంటింటా కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది.

* గ్రామీణ నీటి సరఫరా అధికారులు చొరవ చూపుతున్నా పనులు చేసిన వారికి సకాలంలో బిల్లులు అందటంలేదు. దీంతో ఇతర గుత్తేదారుల్లో కూడా నిరుత్సాహం కలుగుతోంది.

* జిల్లాలో మొత్తం 414 పనులకు రూ.30 కోట్లకు పైగా బిల్లులు రావాలి. పెట్టుబడి పెట్టలేక పైగా, ఇతర రాష్ట్రాలకు చెందిన శ్రామికులు ఇక్కడకు వచ్చి పనులు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

* జలజీవన్‌కు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 1514 వరకు పూర్తిచేయాలి. అందులో రూ.90 కోట్ల విలువైన 372 పనులను ఇప్పటి వరకు ప్రారంభించలేదు. అందులో సగభాగం పనులు కావలి నియోజకవర్గ పరిధిలోనే ఉండటం గమనార్హం. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ఆయా పనులు రద్దు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నోటీసులు కూడా జారీచేశారు.

మిగిలిన పనులు చేయిస్తాం

కృష్ణచైతన్య, ఇన్‌ఛార్జి డీఈఈ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, కావలి

గుత్తేదారులు పనులు స్వీకరించాక జాప్యం తగదు. ఇప్పటి వరకు ప్రారంభంకాని జలజీవన్‌ పనులను రద్దు చేసే నిమిత్తం నోటీసులు జారీ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో అన్ని పనులను పూర్తి చేయిస్తాం. పనులు చేసేవారికి ఎలాంటి ఢోకా లేదు.

కావలి మండల సమాచారం

మొత్తం పనులు: 72

సాంకేతిక కారణాలతో రదు: 2

పనుల జాప్యం నేపథ్యం:  39

అంచనా నిధులు: రూ. 17.04 కోట్లు

పూర్తి దశకు చేరినవి: 3

ఆర్సీపాళెం, తాళ్లపాళెం, అన్నగారిపాళెం పంచాయతీల్లో పనులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని