logo

గంజాయి రవాణాదారులపై పీడీ యాక్ట్‌

జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న అయిదుగురిపై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తూ ఎస్పీ డాక్టర్‌ కె.తిరుమలేశ్వరరెడ్డి బుధవారం ఆదేశాలిచ్చారు.

Published : 01 Jun 2023 02:12 IST

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న అయిదుగురిపై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తూ ఎస్పీ డాక్టర్‌ కె.తిరుమలేశ్వరరెడ్డి బుధవారం ఆదేశాలిచ్చారు. గతంలో సారా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురిపై ఈ తరహా చర్యలు తీసుకోగా.. తాజాగా ముగ్గురు మహిళలు, ఇద్దరు వ్యక్తులపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. మరికొందరిపై నమోదుకు సిద్ధమవుతున్నారు. ఒక సారి దీన్ని అమలు చేస్తే.. ఏడాది జైలుశిక్షతో పాటు నిరంతర నిఘా ఉంటుంది. అప్పటికీ వారిలో మార్పు రాకపోతే జిల్లా బహిష్కరణ, జీవిత కాలం జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

అయిదుగురు వీరే..

* నెల్లూరు కపాడిపాలేనికి చెందిన అరవ రాజమ్మపై సెబ్‌ నెల్లూరు-1 స్టేషన్‌ పరిధిలో గంజాయి విక్రయాలు,  రవాణాకు సంబంధించి 10 కేసులు ఉన్నాయి. స్థానిక పోలీసు స్టేషన్‌లోనూ కేసులు ఉన్నాయి. కపాడిపాలేనికి చెందిన షేక్‌ సుభానిపై సెబ్‌ స్టేషన్‌లో నాలుగు కేసులు ఉండగా- స్థానిక పోలీసు స్టేషన్‌లోనూ ఉన్నాయి. వెంగళరావు నగర్‌కు చెందిన సీహెచ్‌ వెంకటేశ్వర్లుపై అయిదు కేసులు, కపాడిపాలేనికి చెందిన షేక్‌ ముంతాజ్‌పై 13 కేసులు ఉన్నాయి. అయిదుగురు నిందితులపై సస్పెక్టెడ్‌ షీట్లు ఉన్నాయి.

కడప కేంద్ర కారాగారానికి తరలింపు

అరవ రాజమ్మ, సిరాజ్‌, సుభాని, ముంతాజ్‌లతో పాటు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న వెంకటేశ్వర్లుకు సెబ్‌, పోలీసు అధికారుల బృందం నోటీసులు అందజేశారు. వారందరినీ కట్టుదిట్టమైన భద్రత మధ్య కడప కేంద్ర కారాగారానికి తరలించారు. నిందితులు నేర ప్రవృత్తిని వీడకపోతే పీడి యాక్ట్‌లు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. గంజాయి రహిత జిల్లానే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజలు సైతం తమ ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, తాగడం తదితరాలను గుర్తిస్తే 14500, డయల్‌ 100, 112కు, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని