logo

పురోగతి సరే.. పటిష్ఠతేదీ?

జగనన్న కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా పురోగతి సాధించినా.. నాణ్యత ప్రశ్నార్థకమవుతోంది. ఒక్కో యూనిట్‌కు రూ. 1.80 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా..

Published : 02 Jun 2023 02:27 IST

జగనన్న కాలనీల్లో నాసిరకంగా ఇళ్ల నిర్మాణం
కనీస ప్రమాణాలు పాటించని గుత్తేదారులు

అంబాపురం సమీపంలోని జగనన్న కాలనీలో నిర్మిస్తున్న ఇళ్లు

జగనన్న కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా పురోగతి సాధించినా.. నాణ్యత ప్రశ్నార్థకమవుతోంది. ఒక్కో యూనిట్‌కు రూ. 1.80 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా.. ఇందులో కేంద్రం రూ. 1.50 లక్షలు భరిస్తోంది. మిగిలిన రూ. 30వేలను గ్రామీణ ప్రాంతాల్లో నరేగా కింద సర్దుబాటు చేస్తుండగా- పట్టణ ప్రాంతాల్లో మాత్రం రాష్ట్రం భరించాల్సి వస్తోంది. పెరిగిన ధరల నేపథ్యంలో ఇంటి నిర్మాణం లబ్ధిదారులకు కష్టతరంగా మారింది. మేస్త్రీ కూలీ నిర్మాణ పనుల్లో సగం ఉంటుండగా- ఇసుక, స్టీలు, సిమెంట్‌, ఇటుక ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రభుత్వం ఇస్తున్న సాయం సరిపోక కొందరు లబ్ధిదారులు ముందుకు రాకపోగా.. గుత్తేదారులు డబ్బును బట్టి ఇంటి నిర్మాణం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల కిందట కురిసిన గాలి వానకు.. నెల్లూరు రూరల్‌ పరిధిలోని అంబాపురం సమీపంలోని లేఅవుట్‌లో చేపట్టిన నిర్మాణాల్లో ఒకటి గాలికి పడిపోవడం విమర్శలకు తావిచ్చింది.

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి దాదాపు 90,092 ఇళ్లను ప్రభుత్వం పేదలకు మంజూరు చేసింది. వాటిలో ఇప్పటి వరకు 11,667 పూర్తి చేయగా.. 40,965 బీబీఎల్‌ స్థాయిలో నిలిచిపోయాయి. 20,597 బీబీఎల్‌ దశలో ఉన్నాయి. ఇదే సమయంలో కాలనీల్లో నిర్మాణాల పటిష్ఠతపై  సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పునాది బలంగా ఉంటేనే ఇల్లు పది కాలాలు దృఢంగా ఉంటుందనే సూత్రాన్ని కొందరు గుత్తేదారులు విస్మరిస్తున్నారు. బేస్‌మెంట్‌ నిర్మాణాలు నాసిరకంగా చేపట్టడంతో పాటు పిల్లర్ల నిర్మాణంలోనూ కనీస నిబంధనలు పాటించడం లేదు. కొన్నిచోట్ల ఒక్క అడుగు తవ్వకుండా.. నేలపైనే బీమ్‌ నిర్మించి.. బేస్‌మెంట్‌ వేస్తున్నారు. నిర్మాణం తర్వాత గోడలకు నీరు పట్టకపోవడంతో బలహీనంగా మారుతున్నాయి. నాసిరకం ఇటుకలు వినియోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఒక్కో ఇంటికి రూ. 2.15 లక్షలు

పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మూడో ఐచ్ఛికం కింద ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తోంది. అందులో భాగంగా జిల్లాలో 22,693 ఇళ్ల నిర్మాణాన్ని గుత్తేదారులకు అప్పగించారు. బిల్లులు నేరుగా లబ్ధిదారుల ఖాతా నుంచి.. వారికి జమయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కో ఇంటికి రూ. 1.80 లక్షలు ప్రభుత్వం ఇస్తోంది. దీంతో పాటు లబ్ధిదారుడికి రూ. 35వేలు వడ్డీలేని రుణం మంజూరు చేసి.. ఆ మొత్తం కూడా గుత్తేదారు సంస్థ ఖాతాలోకి మళ్లిస్తున్నారు. ఇలా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2.15 లక్షలు చెల్లిస్తున్నారు. గుత్తేదారులకు రూ. 487.89 కోట్ల విలువైన ఇళ్ల పనులను అప్పగించగా..ఇప్పటి వరకు 468 మాత్రమే పూర్తి చేశారు. ఆర్‌సీ, ఆర్‌ఎల్‌ స్థాయిలో 3,600 ఉన్నాయి.

* దీనిపై గృహ నిర్మాణశాఖ పీడీ నరసింహం వివరణ కోరగా.. నాసిరకంపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. అంబాపురం వద్ద వర్షానికి ప్లాస్టరింగ్‌ కారినట్లు సిబ్బంది తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని గుత్తేదారులకు సూచించాం. ఎక్కడైనా నాణ్యతను విస్మరించినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

బేస్‌మెంట్‌తోనే సరి..

జిల్లాలో గుత్తేదారులు చేపట్టిన ఇళ్లన్నీ దాదాపు బేస్‌మెంట్‌ దశలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు 468 పూర్తి చేశారు. బేస్‌మెంట్‌ పూర్తయిన వాటికి ప్రభుత్వం రూ. 70వేలు చెల్లిస్తోంది. దీంతో అక్కడి నుంచి నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రారంభించిన వాటిలో 12,875  బేస్‌మెంట్‌ స్థాయిలో నిలిచిపోయాయి. మిగిలిన వాటిలో 2,242 రూఫ్‌ దశ పూర్తి చేసుకోవడం గమనార్హం. నెలల తరబడి పనులు నిలిచిపోవడంతో నాణ్యత దెబ్బతింటోందని లబ్ధిదారులు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నాణ్యతను పరిశీలిస్తే.. పదికాలల పాటు పటిష్ఠంగా ఉంటాయని అభిలషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని