logo

వేసవి ప్రయాణం..నరకప్రాయం

వేసవి నేపథ్యంలో రైలు ప్రయాణం నరకప్రాయంగా మారింది. వడగాలులు వీచడంతో సామాన్య ప్రయాణికుల బాధ వర్ణనాతీతం. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధి జిల్లాలో నడిచే రైళ్ల పరిస్థితిది.

Published : 02 Jun 2023 02:27 IST

కుళాయి వద్ద వేడినీటిని పట్టుకుంటున్న ప్రయాణికులు

బిట్రగుంట, న్యూస్‌టుడే: వేసవి నేపథ్యంలో రైలు ప్రయాణం నరకప్రాయంగా మారింది. వడగాలులు వీచడంతో సామాన్య ప్రయాణికుల బాధ వర్ణనాతీతం. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధి జిల్లాలో నడిచే రైళ్ల పరిస్థితిది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తీరప్రాంతం సమీపంలో ఉండడంతో పగలు రాకపోకలు సాగించే రైళ్లల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంది. సామాన్య ప్రయాణికులు వడదెబ్బకు గురవుతున్నారు. నెల్లూరు, గూడూరు, కావలి, బిట్రగుంట తదితర స్టేషన్లలో ఆగే రైళ్లను పరిశీలిస్తే సామాన్య ప్రయాణికుల కష్టాలు కనిపిస్తాయి. ఏ స్టేషన్‌లో ఆగినా స్థోమత కలిగినవారు మినరల్‌ వాటర్‌్ కొనుగోలు చేస్తున్నారు. సామాన్యులు కుళాయిల వద్ద పరుగులు తీస్తున్నారు. అక్కడ వేడి నీళ్లు వస్తుండటంతో హైరానా పడుతున్నారు. ఏదో ఒకటని సర్దుకుపోయి తాగి వడదెబ్బకు గురవుతున్నారు. రైళ్లలో తగినన్ని జనరల్‌ బోగీలు ఉండటంలేదు. దీంతో రద్దీ ప్రభావం..ఆపై ఉక్కపోతలో ప్రయాణం నరకప్రాయంగా తయారైందని పలువురు పేర్కొన్నారు. ఫుట్బోర్డు, కిటికీల వద్ద కూర్చున్న వారి పరిస్థితి భయానకంగా ఉంది. లగేజీ బోగీల్లోనైనా జాగా ఉంటే చాలని భావించి ప్రయాణిస్తున్నారు. ఛార్జీలు చెల్లించినా అసౌకర్యాలను సైతం లెక్కచేయకుండా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేసవిలో ప్రతి స్టేషన్లల్లో చల్లనినీరు ప్రయాణికులకు అందేలా చూడడంతోపాటు జనరల్‌ బోగీల సంఖ్య ప్రతి ఎక్స్‌ప్రెస్‌లోనూ పెంచేలా పాలకులు చర్యలు తీసుకోవాలని అనేకులు కోరుతున్నారు.

ఛార్జీలు చెల్లించినా లగేజీ బోగీలో ప్రయాణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని