logo

తగ్గిన పాలధర

ఎండలు మండిపోతున్నాయి. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ప్రభావం పాల దిగుబడిపై పడింది. పాలు తక్కువగా వస్తుండటంపై తమ జీవనంపై ప్రభావం చూపుతోందని పాడి రైతులు

Updated : 02 Jun 2023 06:09 IST

ఎండలు మండిపోతున్నాయి. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ప్రభావం పాల దిగుబడిపై పడింది. పాలు తక్కువగా వస్తుండటంపై తమ జీవనంపై ప్రభావం చూపుతోందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా- ఉష్ణోగ్రత ప్రభావం పడకుండా పశుసంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పశువైద్యులు సూచిస్తున్నారు.

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే : పశుసంవర్ధకశాఖ లెక్కల ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా 6,46,106 నల్ల, 57,774 తెల్ల పశువులు ఉండగా- వీటిల్లో పాలిచ్చేవి 3,47,799 ఉన్నాయి. సంవత్సరంలో ప్రతి 90 రోజులకు.. వాటి నుంచి వచ్చే పాల దిగుబడిని లెక్కిస్తారు. ఆ ప్రకారం రోజువారీ 22 లక్షల లీటర్ల పాల దిగుబడులు వస్తున్నాయి. వేసవిలో ఈ మొత్తం తగ్గడం సహజం. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు నెల వరకు ఈ పరిస్థితి ఉంటుంది.

ఈ ఏడాది 20 శాతం తగ్గుదల

ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. ప్రస్తుతం 40 డిగ్రీల వరకు ఉంటున్నాయి. ఎండలకు తోడు.. వేడి గాలుల ప్రభావం పాల దిగుబడిపై పడింది. ఎండా కాలంలో పచ్చగడ్డి దొరకదని, పశువులకు మేతగా ఎండుగడ్డే ఇవ్వడం.. ఉష్ణోగ్రతల కారణంగా పాల దిగుబడి తగ్గిపోయిందని పోషకులు చెబుతున్నారు. ప్రస్తుతం 18 లక్షల లీటర్ల దిగుబడి ఉండొచ్చని జిల్లా పశుసంవర్ధకశాఖ అంచనా వేస్తోంది. విజయ పాల డెయిరీకి సాధారణ రోజుల్లో.. రోజువారీ 28 వేల లీటర్లు వస్తుండగా- ప్రస్తుతం 18 వేలకే పరిమితమయ్యాయి. ఈ క్రమంలో ఖర్చులు పెరిగి.. ఆదాయం తగ్గిందని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా- వేసవి తీవ్రత తగ్గి.. వర్షాకాలం మొదలవగానే.. యథాప్రకారం పాల దిగుబడి పెరుగుతుందని పశువైద్యులు చెబుతున్నారు.

18 లీటర్లకు 13

నా వద్ద ఉన్న పశువుల్లో 5 బర్రెలు పాలిస్తాయి. వాటి నుంచి రోజువారీ 18 లీటర్లకు పైగా వచ్చేవి. ఇటీవల నుంచి 12 లీటర్లు వస్తున్నాయి. ఎండలు తగ్గే వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. - పెంచలయ్య, వెంకటాచలం మండలం

ప్రత్యేక చర్యలతో..

ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో పశుసంరక్షణకు రైతులు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఎండకు మేపునకు వదలకుండా.. షెడ్డులో ఎండ పడకుండా.. పశువులకు గాలి బాగా వచ్చేలా ఫ్యాన్లు ఏర్పాటు చేయడం తదితరాలు చేపట్టాలి. వాటికి ఏదైనా సమస్య వస్తే.. వెంటనే పశువైద్య సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాలి. నీటిని అందుబాటులో ఉంచాలి. ఎండలు తగ్గితే.. మళ్లీ పాల దిగుబడి పెరుగుతుంది.

డాక్టర్‌ మంజునాథ్‌ సింగ్‌, పశుసంవర్ధకశాఖ వైద్యులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని