logo

మసకబారిన వెలుగు

నెల్లూరు నగరంలో విద్యుద్దీపాల నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు. కొన్నిచోట్ల పగలు వెలుగుతుండగా- మరికొన్ని చోట్ల రాత్రిళ్లు వెలగకపోవడంతో అంధకారం నెలకొంటోంది. ఫిర్యాదులతో సిబ్బంది వచ్చి మరమ్మతులు చేసినా..

Published : 02 Jun 2023 02:27 IST

మెక్లిన్స్‌ రోడ్డులో విద్యుద్దీపాలు వెలగక అలుముకున్న చీకట్లు

నెల్లూరు నగరంలో విద్యుద్దీపాల నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు. కొన్నిచోట్ల పగలు వెలుగుతుండగా- మరికొన్ని చోట్ల రాత్రిళ్లు వెలగకపోవడంతో అంధకారం నెలకొంటోంది. ఫిర్యాదులతో సిబ్బంది వచ్చి మరమ్మతులు చేసినా... నిరీక్షించినంత కాలం ఫలితం ఉండటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంధకారం నెలకొని కాలనీల్లో ప్రమాదాలు, దొంగతనాలు తీవ్రమవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.

నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే : నగరం 150 చదరపు కి.మీ. విస్తరించింది. 54 డివిజన్లలో 1.60 లక్షల గృహాలు ఉండగా- సుమారు పది లక్షల మంది జనాభా ఉన్నారు. పలు ప్రధాన కూడళ్లు, రహదారుల్లో ఏర్పాటు చేసిన వీధి దీపాలు పూర్తి స్థాయిలో వెలగడం లేదు. చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి. కొన్ని స్తంభాలకు దీపాలే లేవు. శివారులోని కొత్తూరు, చంద్రబాబునగర్‌, భగత్‌సింగ్‌ కాలనీ, వైఎస్సార్‌ నగర్‌, శ్రామికనగర్‌, బుజబుజ నెల్లూరు, ఆర్టీసీ, రెవెన్యూ, టైలర్స్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది.

కొరవడిన పర్యవేక్షణ

నగరంలో మొత్తం 40వేల వరకు వీధి దీపాలు ఉండగా- వీటిలో పది వేల వరకు మరమ్మతులకు గురైనట్లు సమాచారం. నిర్వహణను ఓ సంస్థకు అప్పగించారు. ఎల్‌ఈడీ దీపాలతో పాటు వాటి పరికరాలను సదరు సంస్థ సమకూరుస్తోంది. ప్రధాన కూడళ్లలో 110 వాట్స్‌, అంతర్గత వీధుల్లో 60, 20 వాట్స్‌ దీపాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆటో ఆన్‌, ఆటో ఆఫ్‌ విధానం అమలు చేస్తోంది. ఎక్కడైనా మరమ్మతులకు గురైతే.. దానికి సంబంధించిన సంక్షిప్త సమాచారం చేరిన 48 గంటల్లో కొత్తది ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇబ్బందులు ఉంటే.. ఆ ప్రాంతంలో విద్యుత్తు స్తంభానికి ఏర్పాటు చేసిన పెట్టెపై ఉన్న నంబరుకు ఫోన్‌ చేసి చెప్పొచ్చు. ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదనే అసంతృప్తి ఉంది. దీనిపై ఎలక్ట్రికల్‌ డీఈ నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ.. ప్రజల నుంచి ఎక్కడ విద్యుద్దీపం వెలగడం లేదని ఫిర్యాదు వచ్చినా.. వెంటనే స్పందించి మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని