logo

నృత్య శిక్షణ.. బాలికలు భళా!

పట్టణానికి చెందిన కొందరు బాలికలు వేసవి సెలవులను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. వివిధ కళలపై అవగాహన పొందుతున్నారు.

Published : 02 Jun 2023 02:27 IST

కావలి, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన కొందరు బాలికలు వేసవి సెలవులను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. వివిధ కళలపై అవగాహన పొందుతున్నారు. ఆపై నృత్యశిక్షణపై దృష్టిసారించి సాధన చేస్తున్నారు. కళలపై శిక్షణ నిమిత్తం నాట్యగురువులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ కళలను తరువాత తరాలకు తీసుకెళ్లేలా కృషి చేస్తున్నారు. కూచిపూడి, భరత నాట్యం తదితరాలు కొద్దికాలంలో నేర్చుకోవడం కష్టతరమే. అయినా విద్యార్థినుల ఆసక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేపథ్యంలో గురువులు నేర్పించగలుగుతున్నారు. సెలవులు సద్వినియోగం చేసుకుంటున్న బాలికలు కళలపై శిక్షణ పొందుతుండటాన్ని అనేకులు ప్రశంసిస్తున్నారు. వివిధ వేదికలపై ప్రతిభ కనబరుస్తున్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే పోటీల్లో కూడా విజేతలుగా నిలుస్తున్నారు.


ఎంతో ఇష్టం

కావలికి చెందిన హనీఫా నాట్యంపై మక్కువ చూపుతున్నారు. చక్కగా శిక్షణ పొందుతున్నారు. పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ బాలిక గతంలో విజయవాడ, కర్నూలులో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌ రవీంద్రభారతి, చిన్నజీయర్‌ ఆశ్రమంతోపాటు స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో చక్కని ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈమె తండ్రి శేషావలి బ్యాంక్‌ మేనేజర్‌. తల్లి హసీనా గృహిణి.


అంజన.. సాధనలో దిట్ట

ఆరేళ్ల చిన్నారి నాగ అంజనా జాన్సిసింగ్‌ నృత్య ప్రదర్శనల్లో చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు. బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం, మసీదులు, పాఠశాలల వార్షికోత్సవాలు, ఆన్‌లైన్‌ పోటీల్లో ప్రత్యేకత చాటుతున్నారు. వేసవి శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారు. తండ్రి శివకుమార్‌సింగ్‌ మిఠాయి వ్యాపారి. తల్లి రమాబాయ్‌ గృహిణి. తల్లిదండ్రులు ఇస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని ఆ చిన్నారి చెబుతున్నారు.


ఊహా ఆరాధ్య.. ఏకాగ్రత  

కావలికి చెందిన ఊహా ఆరాధ్య నృత్య శిక్షణలో ఏకాగ్రతతో రాణిస్తున్నారు. గతంలో బిట్రగుంట వెంకటేశ్వరస్వామి ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో, పాఠశాల వార్షిక వేడుకల్లోనూ సత్తా చాటుతున్నారు. ఈమె తండ్రి సుధాకర్‌ చిల్లర దుకాణదారుడు. తల్లి కల్పన గృహిణి


చక్కా సాత్విక.. ఓపిక

నాట్య శిక్షణను సద్వినియోగం చేసుకోవడంలో కావలికి చెందిన చక్కా సాత్విక ముందుంటున్నారు. ప్రతి వేసవి సెలవుల్లో శిక్షణలో ప్రత్యేకంగా అవగాహన పొందుతున్నారు. వివిధ ప్రదర్శనల్లో ప్రతిభ కనబరిచారు. తండ్రి రాజు మిఠాయి వ్యాపారి. తలి లక్ష్మీ గృహిణి. కుమార్తెను నాట్యకళలో ఉన్నత స్థానంలో చూడాలని వారు ఆశిస్తున్నారు.


జాస్విత.. ఘనత

తరగతి గదిలో పాఠాలను, నృత్య శిక్షణలో గురువు చెప్పే పద్ధతులను కావలికి చెందిన చిన్నారి చేగు జాస్విత శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. సాధారణ రోజుల్లో కూడా నాట్యంపై శిక్షణ పొందుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ బాలిక నాలుగో తరగతి చదువుతోంది. తండ్రి రమేష్‌బాబు చిల్లర దుకాణదారుడు. తల్లి సురేఖ గృహిణి. వారిద్దరూ తమ కుమార్తెను నాట్యంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని