logo

చెరువుల్లో మట్టి తోడేళ్లు!

సామాన్య ప్రజలు ఇంటి అవసరాలకు ఒక ట్రక్కు మట్టి కావాలంటే అనుమతి ఇచ్చేందుకు అధికారులు కుంటిసాకులు చెబుతున్నారు.

Published : 02 Jun 2023 02:27 IST

పోకూరు చెరువులో మట్టి తోడుతున్న పొక్లెయిన్‌

న్యూస్‌టుడే, కందుకూరు పట్టణం : సామాన్య ప్రజలు ఇంటి అవసరాలకు ఒక ట్రక్కు మట్టి కావాలంటే అనుమతి ఇచ్చేందుకు అధికారులు కుంటిసాకులు చెబుతున్నారు. అదే పలుకుబడి ఉన్న వారు, అధికార పార్టీ అండ ఉన్న వారు టన్నుల కొద్దీ తరలించి విక్రయిస్తున్నారు. అనుమతులు ఇచ్చామని చెబుతున్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నా అడ్డుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. నియోజకవర్గంలో అక్రమార్కుల మట్టి దందా ఇటీవల కాలంలో జోరుగా సాగుతుంది.

అనుమతి కొంత.. తవ్వేది కొండంత

సింగరాయకొండ నుంచి మాలకొండ వరకు మొదటి ఫేజ్‌ కింద జరుగుతున్న 167 బి జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన మట్టి కోసం ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, ప్రధాన రహదారుల వెంబడి ఇష్టారీతిన గుంతలు చేస్తున్నారు. ఈ పనుల కోసం వలేటివారిపాలెం మండలంలోని పోకూరు చెరువులో మొదటి విడతలో 4500 క్యూబిక్‌ మీటర్లకు  అనుమతి పొందారు. ఇందుకు క్యూబిక్‌ మీటర్‌కు రూ.105 చొప్పున ఇరిగేషన్‌ శాఖకు గుత్తేదారులు జమ చేశారు. అనంతరం మరో 3 వేల క్యూబిక్‌ మీటర్లకు అనుమతి తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ లెక్కలకు పొంతనే ఉండడం లేదు. అనుమతికి మించి తరలించినట్లు తెలుస్తోంది. ఒక భాగంలో భారీ స్థాయిలో గుంతలు తీసి తరలించడంతో భవిష్యత్తులో వర్షం వస్తే నీరు అక్కడే నిలిచే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. గుడ్లూరు మండలంలోని మోచర్లలో ఇష్టారీతిన తవ్వకాలు చేస్తున్నారు. అక్కడి నుంచి తెట్టు సమీపంలో నూతనంగా ఏర్పాటుచేస్తున్న ప్రైవేటు వెంచర్లకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఓడరేవు పనులకని రావూరు చెరువులో అనుమతులు తీసుకున్నా అక్కడికి కాకుండా పక్క దారి పట్టిస్తున్నారు. ఉలవపాడు మండలంలోని రామాయపట్నం చెరువులో తువ్వ మట్టి తరలిస్తున్నారు.  

* వలేటివారిపాలెం మండలంలోని చుండి పెద్ద చెరువులో మట్టిని ఇటుక బట్టీల నిర్వాహకులు అక్రమంగా తరలించుకుపోతున్నారని ఈగ్రామస్థులతో పాటు అయ్యవారిపల్లె వాసులు గత నెల 25వ తేదీ వాహనాలను అడ్డుకున్నారు. ఇరిగేషన్‌ అధికారులు అనుమతులు ఇచ్చినట్లు చెప్పి ఇష్టారీతిన తవ్వకాలు చేస్తున్నారు. ఇదే మండలంలోని రామన్న చెరువులో తవ్వుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

* పోకూరు చెరువులో తవ్వకాలు చేస్తుండగా ఇటీవల తెదేపా నాయకులు వెళ్లి నిరసన తెలిపారు. పది అడుగుల లోతున తవ్వకాలు చేస్తే నీటి పారుదల జరగక  రైతులు ఇబ్బందులు పడతారని చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు, గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

అనుమతుల మేరకే

పోకూరు చెరువులో 7500 క్యూబిక్‌ మీటర్ల కోసం నగదు చెల్లించగా అనుమతులు ఇచ్చాం. నిబంధనల మేరకు తవ్వకాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో ఎక్కడైనా అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.

కె.చెరియన్‌, ఇరిగేషన్‌ డీఈ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని