logo

బడి చిత్రం మారలేదు!

మరో పది రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వేసవి సెలవులు పూర్తి చేసుకొని పిల్లలంతా ఉత్సాహంగా బడి బాట పట్టనున్నారు. చక్కటి గదులు, వసతులతో స్వాగతం చెప్పాల్సిన ప్రభుత్వ విద్యాలయాలు మాత్రం అసౌకర్యాలతోనే కునారిల్లుతున్నాయి.

Updated : 03 Jun 2023 04:58 IST

బిల్లుల సమస్యతో ముందుకు కదలని నాడు-నేడు పనులు

మరో పది రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వేసవి సెలవులు పూర్తి చేసుకొని పిల్లలంతా ఉత్సాహంగా బడి బాట పట్టనున్నారు. చక్కటి గదులు, వసతులతో స్వాగతం చెప్పాల్సిన ప్రభుత్వ విద్యాలయాలు మాత్రం అసౌకర్యాలతోనే కునారిల్లుతున్నాయి. నాడు-నేడు రెండో విడత కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో పునాదులు దశే దాటనివెన్నో, దీంతో ఈ విద్యా సంవత్సరం కూడా గదుల కొరతతో ఆరుబయట, చెట్ల కింద పాఠాలు చెప్పాల్సిన దుస్థితి. ఫలితంగా విద్యార్థులకు పాఠశాలల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: విద్య, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన బడి నాడు-నేడు’ ద్వారా మౌలిక వసతులు కల్పిస్తామన్న ప్రకటనలు కార్యరూపం దాల్చడంలో జాప్యం జరుగుతోంది. నూతన విద్యా విధానాన్ని ఆగమేఘాలపై అమలు చేస్తున్న ప్రభుత్వం- అందుకు అనుగుణంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై తగిన దృష్టి పెట్టలేదు. మరో పది రోజుల్లో పాఠశాలలు ప్రారంభమవుతున్నా.. నేటికీ చాలా బడుల్లో పనులు ఊపందుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో నెలల తరబడి నిలిచిపోయాయి. మొన్నటి వరకు సిమెంట్‌, ఇసుక, ఇనుము కొరతతో జరగకపోగా- గత కొన్ని రోజులుగా బిల్లుల సమస్యతో ముందుకు సాగడం లేదు. నూతన విద్యా విధానంలో భాగంగా ఉన్నత పాఠశాలకు కిలోమీటరు పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను విలీనం చేశారు. ఇప్పటి వరకు 6-10 తరగతులతో నడిచే 200కు పైగా ఉన్నత పాఠశాలు.. ఈ ఏడాది నుంచి 3-10 తరగతులుగా మారాయి. ఆ ప్రకారం ప్రతి తరగతికి ఒక గది ఉండాల్సి ఉండగా- 90 శాతం పాఠశాల్లో తగినన్ని లేవు.

నిర్మాణాలు.. నత్తతో పోటీ

3, 4, 5 తరగతుల విలీనాన్ని దృష్టిలో పెట్టుకుని నాడు-నేడు రెండో దశలో ఉన్నత పాఠశాలల్లో గదుల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు. 854 బడుల  అభివృద్ధికి, 552 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 453.91 కోట్లు మంజూరు చేసింది. వీటిలో దాదాపు అన్నిచోట్ల పనులు ప్రారంభమైనట్లు అధికారులు లెక్కలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం నుంచి సిమెంట్‌, ఇనుము సరఫరా చేస్తామని చెప్పడంతో గుత్తేదారులు వాటి కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని పాఠశాలలకు ఇసుక సరఫరా చేసినా.. మిగిలినవి అందుబాటులో లేకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. చాలా చోట్ల పునాదుల్లో నిలిచిపోయాయి. బిల్లులు కూడా విడతల వారీగా విడుదల అవుతుండటంతో.. గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఈ ఏడాదీ విద్యార్థులకు వరండాలు, చెట్ల నీడే దిక్కయ్యేలా ఉందని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు.

వెంకటాచలం:

వెంకటాచలం ఉన్నత పాఠశాలలో గదులు సరిపోకపోవడంతో విద్యార్థులను చెట్ల కిందనే కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏడాది కిందట అదనపు తరగతి గదులను మంజూరు చేశారు. ప్రస్తుతం వాటి నిర్మాణం ప్రారంభమైంది. బిల్లులు సకాలంలో రాకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. మండలంలోని చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

నెల్లూరు

మూలాపేటలోని రామయ్య బడిలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులివి. ఇక్కడున్న పాత భవనాలను కూల్చి.. కొత్తవి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ సుమారు 400 మంది చిన్నారులు ఉండగా.. గదులు సరిపోని పరిస్థితి. ఈ ఏడాది 3, 4, 5 తరగతుల వారు వచ్చి చేరుతుండటంతో సమస్య జఠిలమయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు పనులు పూర్తవుతాయో.. ఎప్పుడు గదులు అందుబాటులోకి వస్తాయోనని ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.

వేగం పెంచుతాం

ఉషారాణి, ఏపీసీ, సమగ్రశిక్షా అభియాన్‌

నాడు-నేడు పనుల్లో వేగం పెంచుతున్నాం. పాఠశాలలు ప్రారంభించేలోపు మరుగుదొడ్లు, బోర్డులు, ప్రహరీలు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అదనపు గదుల్లో 80 పైకప్పు దశలో ఉన్నాయి. త్వరితంగా అన్నింటినీ పూర్తి చేసి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూస్తాం.

వేగం పెంచుతాం

ఉషారాణి, ఏపీసీ, సమగ్రశిక్షా అభియాన్‌

నాడు-నేడు పనుల్లో వేగం పెంచుతున్నాం. పాఠశాలలు ప్రారంభించేలోపు మరుగుదొడ్లు, బోర్డులు, ప్రహరీలు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అదనపు గదుల్లో 80 పైకప్పు దశలో ఉన్నాయి. త్వరితంగా అన్నింటినీ పూర్తి చేసి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూస్తాం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని