logo

త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తాం

సోమశిల హైలెవల్‌ కెనాల్‌ ఫేజ్‌-1, ఫేజ్‌-2 నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల భూ సమస్యలను త్వరితంగా పరిష్కరిస్తామని కలెక్టర్‌ హరినారాయణన్‌ అన్నారు.

Published : 03 Jun 2023 02:08 IST

 కలెక్టర్‌ హరినారాయణన్‌

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

మర్రిపాడు, న్యూస్‌టుడే: సోమశిల హైలెవల్‌ కెనాల్‌ ఫేజ్‌-1, ఫేజ్‌-2 నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల భూ సమస్యలను త్వరితంగా పరిష్కరిస్తామని కలెక్టర్‌ హరినారాయణన్‌ అన్నారు. పడమటినాయుడుపల్లి, కంపసముద్రం గ్రామాల్లో శుక్రవారం హైలెవల్‌ కెనాల్‌ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పడమటినాయుడుపల్లిలో 2013 నుంచి హైలెవల్‌ కెనాల్‌ నిర్మాణంలో జాప్యం జరుగుతోందని.. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యలు పరిష్కారం కాలేదని ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి నివేదిక అందించారన్నారు. దాంతో సీఎం ఆదేశాల మేరకు గ్రామస్థులతో సమావేశం నిర్వహించామన్నారు. భూసేకరణ డ్రాఫ్ట్‌ డిక్లరేషన్‌ వరకు వచ్చిందని.. త్వరలో రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్రక్రియ కూడా త్వరితంగా పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని భూ సమస్యలను ప్రజలు, రైతులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. త్వరలో గ్రామసభ నిర్వహించి.. సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని హామీ ఇచ్చారు.

సోమశిల జలాశయం సందర్శన

అనంతసాగరం : కలెక్టర్‌ హరినారాయణన్‌ శుక్రవారం సోమశిల జలాశయాన్ని సందర్శించారు. తొలుత శంకరనగరంలోని కొమ్మలేరు వాగును పరిశీలించారు.  నిర్మాణ పనుల్లో పొలాలు నష్టపోయి.. పరిహారం అందక ఇబ్బంది పడుతున్న రైతులతో మాట్లాడారు. స్థానిక అధికారులతో చర్చించారు. పూర్తి నివేదికను తయారు చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సోమశిల జలాశయం నీటి నిల్వను తిలకించారు. డెల్టా, నాన్‌ డెల్టాకు విడుదల చేసే నీటి వివరాలను ప్రాజెక్టు ఈఈ దశరథరామిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆగిపోయిన ఆఫ్రాన్‌ పనులపై ఆరా తీశారు. ఉత్తర, దక్షిణ కాలువలకు విడుదల విడుదల చేసే సాగునీటికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగేలా సిబ్బందిని పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ కూర్మనాథ్‌, ఆర్డీవో కరుణకుమారి, ఇన్‌ఛార్జి తహసీల్దారు ప్రదీప్‌, ప్రాజెక్టు డీఈఈ, జేఈఈలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని