logo

కళ్లలో నీరు..కళ్లాల్లో దిగుబడి

రూ. లక్షలు పెట్టుబడి పెట్టి.. ఆరుగాలం శ్రమించి.. పసుపు పంట సాగు చేసిన రైతులకు.. దిగుబడి చేతికొచ్చే సమయానికి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.

Published : 03 Jun 2023 02:08 IST

అవస్థల్లో పసుపు సాగు రైతులు

రూ. లక్షలు పెట్టుబడి పెట్టి.. ఆరుగాలం శ్రమించి.. పసుపు పంట సాగు చేసిన రైతులకు.. దిగుబడి చేతికొచ్చే సమయానికి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. తెగుళ్ల కారణంగా ఆశించిన దిగుబడి లేక.. చేతికొచ్చిన పంట అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర లభించక పరేషాన్‌ అవుతున్నారు. మార్కెట్‌లో ధరలు ఇలాగే కొనసాగితే కనీసం పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేదని.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

దుత్తలూరు, ఉదయగిరి, న్యూస్‌టుడే: ఉదయగిరి మండలం కొండకింద పల్లెలైన కృష్ణారెడ్డిపల్లి, బిజ్జంపల్లి, కొత్తపల్లి, లింగమనేనిపల్లి, బండగానిపల్లి, అయ్యవారిపల్లి తదితర గ్రామాలతో పాటు సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు, మర్రిపాడు, అనంతసాగరం మండలాల్లో రైతులు ఎక్కువగా పసుపు సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 90 హెక్టార్లలో వేశారు. విత్తనం పసుపు, ఎరువులు, కూలీలు, వ్యవసాయం తదితర ఖర్చులు కలుపుకొని ఎకరా సాగుకు రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.40 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. అవి కాకుండా.. పంట తవ్వకాల సమయంలో కూలీలకు ఎకరాకు రూ. 30వేల వరకు వెచ్చించినట్లు రైతులు చెబుతున్నారు. ఎలాంటి తెగుళ్లు సోకకుండా.. ఆరోగ్యవంతంగా పంట చేతికందితే.. ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది వేరు, దంపకుళ్లు తెగుళ్లు వెంటాడటంతో ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్లలోపు మాత్రమే దిగుబడి చేతికందింది. ప్రస్తుతం బహిరంగ  మార్కెట్‌లో కింటా రూ. 4,500 నుంచి రూ. 5,500లోపు మాత్రమే పలుకుతుండగా- ఈ లెక్కన పెట్టుబడి సైతం దక్కే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే.. మద్ధతు ధరకు అమ్ముకోవాలని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు నిరసన

ఉదయగిరిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని పసుపు సాగు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆ మేరకు నిరసనలు చేపట్టారు. గత ఏడాది మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఉదయగిరి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పసుపు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి క్వింటా రూ. 6,850 మద్ధతు ధరతో కొనుగోలు చేశారు. ఈ ఏడాది కూడా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించి.. రైతులు నష్టపోకుండా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

గిట్టుబాటు ధర కల్పించకపోతే నష్టాలే

ఈ ఏడాది మూడు ఎకరాల్లో సుమారు రూ. నాలుగు లక్షలకుపైగా పెట్టుబడి పెట్టి పసుపు పంట సాగు చేశా. తెగుళ్లతో ఆశించిన దిగుబడి రాలేదు. మార్కెట్‌లో ధరలూ తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి ఉదయగిరిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మద్ధతు ధరకు కొనుగోలు చేస్తే ప్రయోజనం ఉంటుంది. పంట చేతికొచ్చి.. మూడు నెలలు దాటినా ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు.

 కొండా రమణారెడ్డి, కృష్ణారెడ్డిపల్లి, రైతు

ఉత్తర్వులు రాగానే...

పవన్‌కుమార్‌, జిల్లా మార్క్‌ఫెడ్‌ డీఎం

జిల్లాలో ఈ ఏడాది 160 మంది రైతులు పసుపు పంట సాగు చేశారు. వారిలో 110 మంది వరకు నమోదు చేయించుకున్నారు. మిగిలిన వారు కూడా త్వరగా చేయించుకోవాలి. కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. రాగానే కొనుగోలు చేస్తాం.  ఉత్తర్వులు రాగానే...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని