logo

ఆగని తెల్లరాయి అక్రమ తవ్వకాలు

వరికుంటపాడు మండలం గువ్వాడి అటవీప్రాంతంలో ఇటీవల అక్రమార్కులు భారీ వాహనాలతో తెల్లరాయి తవ్వకాలు జరుపుతున్నారనే సమాచారం సంబంధిత అటవీశాఖ అధికారులకు అందింది.

Published : 03 Jun 2023 02:08 IST

వరికుంటపాడు మండలం గువ్వాడి అటవీప్రాంతంలో ఇటీవల అక్రమార్కులు భారీ వాహనాలతో తెల్లరాయి తవ్వకాలు జరుపుతున్నారనే సమాచారం సంబంధిత అటవీశాఖ అధికారులకు అందింది. దీంతో సంబంధిత అధికారులు ఆ ప్రదేశానికి వెళ్లగా అక్కడ అక్రమంగా తెల్లరాయి తవ్వుతున్నారు. దీంతో అక్కడి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆపై అటవీప్రాంతంలో అక్రమంగా తెల్లరాయి తీస్తున్నందుకు రూ. 5 లక్షలకు పైగా జరిమానా విధించారు.

న్యూస్‌టుడే, దుత్తలూరు: ఉదయగిరి నియోజకవర్గంలో తగిన పరిమాణంలో ఉన్న తెల్లరాయిని అక్రమంగా తవ్వి తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటన్నారు. అటవీ, ప్రభుత్వ, అసైన్‌మెంట్ భూములనే తేడా లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కూలీలతో రేయింబవళ్లు భారీ యంత్రాలతో గుంతలు తవ్వించి తెల్లరాయిని వెలికితీస్తున్నారు. ఆపై ఇతర రాష్ట్రాలకు తరలించి రూ. లక్షలు అర్జిస్తున్నారు. రాత్రికి రాత్రే లారీల ద్వారా జిల్లా హద్దులు దాటించి జేబులు నింపుకుంటున్నారు. ఈ అక్రమం వింజమూరు, వరికుంటపాడు, దుత్తలూరు, ఉదయగిరి మండలాల్లోని వివిధ గ్రామాల్లో కొన్ని నెలలుగా సజావుగా సాగుతోంది.

* ఉదయగిరి, వింజమూరు, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లోని బత్తినవారిపల్లి, గోళ్లవారిపల్లి, తక్కెళ్లపాడు, చాకలికొండ, గువ్వాడి, బోయమడుగుల, పాపంపల్లి, వెంకటంపేట, సోమలరేగడ తదితర గ్రామాల్లో ఈ తెల్లరాయి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

* నియోజకవర్గంలో మొత్తం 500 హెక్టార్లకుపైగా తెల్లరాయి నిక్షేపాలు ఉన్నట్లు అంచనా. తెల్లరాయిలో మొదటి రకం గ్రేడ్‌ టన్ను రూ. 9 వేల వరకు పలుకుతోంది. ద్వితీయ గ్రేడ్‌ ధర రూ. 2 వేల వరకు పలుకుతోంది. దీంతో ఆయా మండలాలకు చెందిన కొందరు ఇతర మండలాలకు చెందిన తెల్లరాయి తరలింపునకు సంబంధించి అనుమతి కలిగిన వారితో కుమ్మక్కై పట్టపగలే కూలీలతో తెల్లరాయిని భూముల నుంచి వెలికితీస్తున్నారు. ఆపై దాన్ని రాత్రిళ్లు ఇతర ప్రదేశాలకు తరలించి రూ. లక్షలు ఆర్జిస్తున్నారు.

* అక్రమార్కులకు ప్రభుత్వ భూములే అడ్డాగా మారాయి. వాటిలో భారీ యంత్రాలతో గుంతలు తవ్వి తెల్లరాయి తవ్వకాలు జరుపుతుండటం విశేషం. ః ప్రతి వారం సుమారు ఐదు నుంచి పది లారీల వరకు తెల్లరాయి అక్రమ రవాణా జరుగుతున్నా అటవీశాఖ, పోలీస్‌ శాఖ, రెవెన్యూ సిబ్బంది చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి వారం అక్రమార్కులు రూ. లక్షల్లో ప్రభుత్వ భూముల నుంచి ఆదాయం పొందుతున్నారు.

*  తెల్లరాయి తవ్వకాలు, తరలింపునకు ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇవేవీ అమలుకావటంలేదు. అధికారులు స్పందించి తెల్లరాయి తవ్వకాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అటవీ భూముల్లో తెల్లరాయి తరలింపునకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని ఉదయగిరి రేంజి అధికారిఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. ఎవరైనా అటవీ భూముల్లో తెల్లరాయి తవ్వకాలు జరిపినట్లు తెలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ భూములపై ప్రత్యేక నిఘా  పెట్టామన్నారు.

దుత్తలూరు మండలం పాపంపల్లి ప్రభుత్వ భూముల్లో తెల్లరాయిని ఇష్టానుసారం తవ్వి తరలిస్తున్నారు. కొంతమంది ప్రభుత్వ భూముల్లో కొన్ని నెలలుగా  తవ్వకాలు జరుపుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు