logo

సజావుగా ఉపాధి పనులు: పీడీ

ప్రస్తుత వేసవిలో గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద వివిధ అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ వెంకట్రావు సూచించారు.

Published : 03 Jun 2023 02:08 IST

వివరాలు తెలుసుకుంటున్న డ్వామా పీడీ వెంకట్రావు

జలదంకి, న్యూస్‌టుడే: ప్రస్తుత వేసవిలో గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద వివిధ అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ వెంకట్రావు సూచించారు. గత ఏడాది జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు రూ 7 లక్షల నగదు హెచ్చించి చామదల గ్రామ పంచాయతీలోని ఆదిరెడ్డి పాలెం గిరిజన కాలనీ లోతట్టు ప్రాంతంలో  గ్రావెల్‌ మట్టితో మెరక తోలి చదును పనులు చేశారు. ఏడాది గడిచినా పనులకు నేటికీ బిల్లులు రాలేదని గ్రామ సర్పంచి పి.సీతారామమ్మ, ఎంపీటీసీ పి.అమరావతి స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. జిల్లా అధికారుల సూచనల మేరకు శుక్రవారం డ్వామా పీడీ వెంకట్రావు, ఎంపీడీవో శ్రీధర్‌బాబుతో కలిసి ఆదిరెడ్డిపాలెం గిరిజన కాలనీలో చేపట్టిన పనులను పరిశీలించారు. గ్రామ సర్పంచి, ఎంపీటీసీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీడీ మాట్లాడుతూ సమస్యను జిల్లా కలెక్టర్‌కు తెలిపి త్వరితగతిన బిల్లులు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక గిరిజనులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని, ఇళ్లు నిర్మించుకోలేనివారు గుత్తేదారుల ద్వారా గృహాలు నిర్మింపజేయాలని ఎంపీడీవోకు సూచించారు. ఏపీవో శ్యామల, టీఏ రంగారెడ్డి, పి.రవిచంద్ర పాల్గొన్నారు.


యువకుడిని కాపాడిన మెరైన్‌ పోలీసులు

ఉలవపాడు, న్యూస్‌టుడే: సముద్రంలో మునిగిపోతున్న యువకుడిని మెరైన్‌ పోలీసులు శుక్రవారం కాపాడారు. సీఐ కిషోర్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెల్లూరులోని కోటమిట్ట ప్రాంతానికి చెందిన 17ఏళ్ల పటాన్‌పిల్‌ కుటుంబసభ్యులతో కలిసి గురువారం రాత్రి తెట్టు ఉత్సవానికి వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం సముద్రంలో స్నానాలు చేసేందుకు రామాయపట్నం తీరానికి చేరారు. పటాన్‌పిల్‌కు పిట్స్‌ రావడంతో సముద్రంలో మునిగిపోతుండగా గమనించిన మెరైన్‌ పోలీసులు కాపాడారు. యువకుడికి స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి.. క్షేమంగా ఇంటికి పంపించారు.


నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలి

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: విద్యుత్తు వినియోగదారులకు నాణ్యమైన సరఫరా అందించేందుకు సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎస్‌ఈ వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జిల్లా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్తు కోతలు విధించడం లేదని, సాంకేతిక సమస్యలతో అంతరాయం ఏర్పడుతోందన్నారు. అధిగమించేందుకు సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈదురుగాలులు, వర్షం కారణంగా సాంకేతిక లోపాలు తలెత్తితే సిబ్బంది త్వరితగతిన చర్యలు తీసుకొని సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. డీటీఆర్‌ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. జగనన్న కాలనీలకు విద్యుత్తు అందించాలని, గడపగడపకు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఎనర్జీ ఆడిట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు బెనర్జీ, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని