logo

హమ్మయ్యా.. అంతా క్షేమం

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం జిల్లా వాసులను ఆందోళనకు గురి చేసింది. వందల మంది ప్రయాణికులు చనిపోగా- మరెందరో గాయపడటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

Published : 04 Jun 2023 02:56 IST

నెల్లూరు : రైళ్ల రాకకోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: కావలి,కలెక్టరేట్‌, నేరవార్తలు, న్యూస్‌టుడే: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం జిల్లా వాసులను ఆందోళనకు గురి చేసింది. వందల మంది ప్రయాణికులు చనిపోగా- మరెందరో గాయపడటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్‌తో పాటు రైల్వేస్టేషన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. జిల్లాకు చెందిన వారెవరైనా ఆయా రైళ్లలో ఉంటే సంప్రదించాలని కోరారు. అవసరమైన ఫోన్‌ నంబర్లు ప్రకటించారు. అదృష్టవశాత్తు నెల్లూరు నుంచి బెంగళూరు-హావ్‌డా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన వారంతా క్షేమంగా ఉన్నారు. నెల్లూరు రైల్వేస్టేషన్‌ నుంచి మొత్తం 8 మంది హౌవ్‌డా ఎక్స్‌ప్రెస్‌ ఎక్కగా.. వారిలో ముగ్గురు పలాస, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో దిగారు. మిగిలిన వారిలో ముగ్గురు తాము క్షేమంగా ఉన్నామని రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాత.. ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేశారు. కృష్ణపట్నం దగ్గర ఓ ఆయిల్‌ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరు శనివారం సాయంత్రానికి భువనేశ్వర్‌ చేరుకున్నారు. మరోవైపు అనుకోని ప్రమాదంతో నెల్లూరు స్టేషన్‌ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు కాగా- రిజర్వేషన్‌ చేయించుకున్న వారితో పాటు సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ముందస్తుగా రిజర్వేషన్‌ చేసుకున్న వారు.. స్టేషన్లలో పడిగాపులు కాశారు. చివరకు ప్రైవేటు వాహనాలు పట్టుకుని కొందరు గమ్యస్థానాలకు ప్రయాణమవగా.. మరికొందరు ప్రయాణం రద్దు చేసుకున్నారు. సుబజిత్‌ మెహతా అనే వ్యక్తి హావ్‌డాకు టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నా.. వెయిటింగ్‌ లిస్ట్‌ ఎక్కువగా ఉండటంతో ప్రయాణం  విరమించుకున్నారు.

ఆరు రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 9 రైళ్లు రద్దు చేయగా.. వాటిలో నెల్లూరు మీదుగా వెళ్లేవి ఆరున్నాయి. వీటిలో బెంగళూరు-హావ్‌డా, హౌరా-చెన్నై, మంగుళూరు సెంట్రల్‌-సంట్రగాచి, చెన్నై-షాలీమర్‌, చెన్నై-సంట్రగాచి వెళ్లేవి ఉన్నాయి. ఇప్పటికే బయలుదేరిన కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌ సుమారు ఆరుగంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఆదివారం ఉదయం 12.45కు రావాల్సి ఉండగా.. ఉదయం 6.13 గంటలకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. వారాంతం కావడంతో.. రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు స్టేషన్‌ వరకు వచ్చి నిరాశతో వెనుదిరిగారు. వేర్వేరు మార్గాల్లో నడుస్తున్న రైళ్లన్నీ సుమారు 40 నిమిషాల నుంచి 2 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఏమైందో అర్థం కాలేదు..

కృష్ణపట్నం సమీపంలోని ఆయిల్‌ కంపెనీలో పనిచేస్తున్నాం. స్వగ్రామం హావ్‌డా వెళ్లేందుకు నెల్లూరులో రైలెక్కాం. సాయంత్రం 7 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. మాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. మేమున్న బోగీకి.. ఏం కాకపోవడంతో సురక్షితంగా బయటకు వచ్చాం. అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. వందల మంది చనిపోతారని ఊహించలేదు. సమయం గడిచేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. దాంతో భయపడుతూనే రాత్రంతా అక్కడే ఉన్నాం. కనీసం నీరు కూడా దొరకలేదు. శనివారం సమీప  గ్రామస్థులు ఆహారం అందించారు. సహాయక చర్యలు చేపట్టారు. శనివారం సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాం. దేవుడి దయతోనే ప్రాణాలతో బయట పడ్డాం.
- బికష్‌ ముర్ము, మముని ముర్ము

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని