logo

ఆరిన కంటి పాపలు

వారు నిరుపేదలు.. తమ కష్టాలు పిల్లలకు రావొద్దని వారిని కష్టపడి చదివిస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో ఇంటి వద్ద ఉంటున్నారు.

Updated : 04 Jun 2023 04:55 IST

చిన్నారి మృతదేహం వద్ద మంత్రి కాకాణి, విలపిస్తున్న కుటుంబ సభ్యులు

వెంకటాచలం, న్యూస్‌టుడే : వారు నిరుపేదలు.. తమ కష్టాలు పిల్లలకు రావొద్దని వారిని కష్టపడి చదివిస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో ఇంటి వద్ద ఉంటున్నారు. తల్లికి పనిలో తోడుగా దుస్తులు ఉతికేందుకు సమీపంలోని కాలువ వద్దకెళ్లారు. ఒక్కసారిగా అదుపుతప్పి పడి పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న హృదయ విదారక ఘటన వెంకటాచలం మండలం చింతలపాలెంలో శనివారం జరిగింది.. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కసుమూరు పంచాయతీ చింతలపాలెంనకు చెందిన కడివేటి పెంచలరత్నం, భవాని దంపతుల కుమార్తె లక్కీషా(13), శేషం అంకయ్య, నాగమణిల కుమార్తె అక్షిత(12) శనివారం ఉదయం దుస్తులు ఉతికేందుకు కాలనీలోని కొందరితో కలిసి గ్రామ సమీపంలోని కనుపూరు కాలువ వద్దకెళ్లారు. ప్రమాదవశాత్తు కాలువలో పడిపోవడంతో ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తుంది. ఇద్దరు చిన్నారులు అదుపుతప్పి పడిపోయి కొంత దూరం ప్రవాహంలో కొట్టుకెళ్లి ఈత రాక మునిగి పోయారు. అక్కడున్న వారు పెద్దగా కేకలు వేయడంతో గ్రామస్థులు హుటాహుటిన వచ్చి కాలువలో గాలించి చిన్నారులను బయటకు తీశారు. వెంకటాచలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా వైద్యులు పరీక్షించి చిన్నారులు మృతిచెందినట్లు చెప్పారు. లక్కీషా కసుమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగా, అక్షిత నెల్లూరులోని గిరిజన సంక్షేమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. కడివేటి పెంచల రత్నంనకు లక్కీషా ఒకే కుమార్తె కాగా, శేషం అంకయ్యకు ముగ్గురు కుమార్తెల్లో అక్షిత రెండో కుమార్తె. సమాచారం తెలుసుకున్న వెంకటాచలం సీఐ గంగాధర్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చింతలపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాలను మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరామర్శించారు. వారిని ఓదార్చి అండగా ఉంటామన్నారు.

బావిలో ఈత కొడుతూ..

నాగులవరం(బిట్రగుంట) : బోగోలు మండలంలోని నాగులవరానికి చెందిన రేగలగడ్డ తిరుపాలు (45) శనివారం గ్రామ సమీపంలోని బావిలో ఈత కొడుతూ మృత్యువాత పడ్డారు. వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి బావిలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబ సభ్యులు దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నారు. కావలి గ్రామీణ సీఐ రాజేష్‌, బిట్రగుంట ఎస్సై ఆదిలక్ష్మి సంఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలికి తరలిస్తున్నామని సీఐ రాజేష్‌ తెలిపారు. బిట్రగుంట ఎస్సై ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు