logo

నాలుగేళ్లుగా.. నత్తనడక

గ్రంథాలయాల్లో ఆధునిక వసతులు కల్పించి ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వం 2019లో రూ.4.10 కోట్లతో ఆరు గ్రంథాలయ భవనాల నిర్మాణాలు చేపట్టింది.

Updated : 04 Jun 2023 04:54 IST

పూర్తవని గ్రంథాలయ భవన నిర్మాణాలు

పురాతన భవనంలో కొనసాగుతున్న గ్రంథాలయం

నెల్లూరు(సాంస్కృతికం), న్యూస్‌టుడే: గ్రంథాలయాల్లో ఆధునిక వసతులు కల్పించి ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వం 2019లో రూ.4.10 కోట్లతో ఆరు గ్రంథాలయ భవనాల నిర్మాణాలు చేపట్టింది. కుల్లూరులో రూ.15 లక్షలతో, జలదంకిలో రూ.28.50 లక్షలతో ప్రతిపాదించిన భవనాలు మాత్రమే పూర్తిచేశారు. మిగిలిన నిర్మాణాలు నాలుగేళ్లు గడుస్తున్నా ముందుకు సాగడంలేదు. మరోవైపు ఇందుకూరుపేట, సీఆర్‌ పాళెం, అల్లూరు, దగదర్తి, ఏఎస్‌పేటలోని గ్రంథాలయ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
ప్రభుత్వం మారడంతో.. నెల్లూరు రేబాలవారి వీధిలో కేంద్ర గ్రంథాలయాన్ని 2019 ఫిబ్రవరిలో రూ.3 కోట్లతో పునర్నిర్మించేందుకు అప్పటి మంత్రులు శంకుస్థాపన చేశారు. అందుకు అవసరమైన రూ.50 లక్షల నిధులను విద్యా మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ(ఏపీఈడబ్ల్యుఐడీసీ)కి మంజూరు చేశారు. అనంతరం ప్రభుత్వం మారిపోయింది. పాత భవనం తొలగించి కొత్తది నిర్మించాలనే ప్రతిపాదనను మార్చారు. వెనుకవైపు స్థలంలో నూతన భవనం నిర్మించాలని గ్రంథాలయ సంస్థ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ పనులు పునాదిస్థాయి దాటలేదు. గతేడాది మరో రూ.50 లక్షలు విడుదల చేసినా తొలి అంతస్తు పైకప్పు మాత్రమే పూర్తిచేశారు. కోవూరులో రూ.35 లక్షలు, ఉదయగిరిలో రూ.26.30 లక్షలతో చేపట్టిన నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. నవాబుపేటలో రూ.25 లక్షలతో తలపెట్టిన భవన నిర్మాణానికి మూడుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ రాకపోవడంతో నిలిచిపోయింది.


సిబ్బంది ఖాళీలు..

జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో 61 గ్రంథాలయాలు ఉన్నాయి. ఉచిత భవనాల్లో 22, అద్దె భవనాల్లో 5, సొంత భవనాల్లో 43 నిర్వహిస్తున్నారు. 105 మంది సిబ్బందికిగాను 41 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 64 ఖాళీలు ఉన్నాయి. 12 మంది పొరుగుసేవల సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.


నిధుల కొరతతో ఆలస్యం

కె.కుమార్‌రాజ, జిల్లా గ్రంథాలయసంస్థ కార్యదర్శి

కేంద్ర గ్రంథాలయ నూతన భవనానికి మరో రూ.2 కోట్లు, శిథిలావస్థకు చేరుకున్న మిగిలిన 5 భవనాల పూర్తికి రూ.5 కోట్లు అవసరమవుతాయి. జిల్లా గ్రంథాలయ సంస్థకు నగరపాలక సంస్థ సెస్సు బకాయి రూ.29.69 కోట్లు చెల్లించాలి. అందులో నుంచి అత్యవసరంగా రూ.కోటి చెల్లించాలని కలెక్టర్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ను కోరారు. ఆ మేరకు నిధులు అందితే పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. కోవూరు, ఉదయగిరిలో నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని