logo

కాసుల యావ.. నాణ్యత మాయ

పేదల ఇళ్లు అధికారులు, నాయకులకు కాసులు కురిపిస్తున్నాయి. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారు. అడ్డుకోవాల్సిన ఉన్నతాధికారులు పత్రాల్లో లెక్కల కోసం తాపత్రయ పడుతున్నారు.

Updated : 07 Jun 2023 05:47 IST

వెంకటేశ్వరపురంలో నిర్మాణంలోని ఇళ్లు

పేదల ఇళ్లు అధికారులు, నాయకులకు కాసులు కురిపిస్తున్నాయి. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారు. అడ్డుకోవాల్సిన ఉన్నతాధికారులు పత్రాల్లో లెక్కల కోసం తాపత్రయ పడుతున్నారు. గుత్తేదారులతో కలసి జేబులు నింపుకుంటున్నారు. దీంతో అక్రమాలకు అడ్డులేకుండాపోతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు సమీక్షలు చేసే ఉన్నతాధికారులు ఈ రోజు ఎన్ని పూర్తయ్యాయి.? రేపటికి ఎన్ని చేస్తారు.? అని అడగడం మినహా.. ఎలా కడుతున్నారు.? నాణ్యత పాటిస్తున్నారా? లబ్ధిదారులను మమేకం చేస్తున్నారా? వంటి ప్రశ్నలు అడగడమే మానేశారు. ఇది కొంతమందికి కలిసొచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే త్వరిగతిన కట్టిస్తామని గొప్పలు చెప్పిన గుత్తేదారులు నాణ్యతకు పాతరేస్తున్నారు. అందినకాడికి దోచుకుని పారిపోతున్నారు. దీంతో ప్రభుత్వం జగనన్న కాలనీల్లో శిథిలమైన పిల్లర్లు, మొండిగోడలు దర్శనమిస్తున్నాయి. ఊళ్లు తయారుచేస్తామని చెప్పిన మాటలు ఆమడదూరంలో ఉన్నాయి.

ఈనాడు, నెల్లూరు : జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 90 వేల ఇళ్లు పేదలకు మంజూరు చేశారు. ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షల నగదు సరిపోదని లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు రాలేదు. దీంతో ఆప్షన్‌-3 (ప్రభుత్వమే కట్టించి ఇచ్చేలా)లో 22 వేల మందిని గుర్తించింది. వీరి ఇళ్ల నిర్మాణాన్ని వంద మందికిపైగా గుత్తేదారులకు అప్పగించింది. మొదట్లో మేస్త్రీలకు ఇవ్వాలని ప్రతిపాదించినా దాన్ని పక్కన పెట్టారు. గుత్తేదారు సంస్థలకు అప్పగించారు. టెండరు విధానం, వర్క్‌ ఆర్డర్లు లేకుండా రూ.400 కోట్ల విలువైన ఇళ్ల నిర్మాణాల బాధ్యతను కట్టబెట్టారు. ఇందులో అధికారులే కీలకపాత్ర పోషించారు. ప్రభుత్వమిచ్చే నగదు నేరుగా గుత్తేదారుడికి చెల్లించేందుకు నిబంధనలు అడ్డురావడంతో లబ్ధిదారుల ఖాతాల్లో వేసి మళ్ల్లిస్తున్నారు. ముందస్తు ఒప్పందం ప్రకారం రూ.1.80 లక్షలకే నిర్మించాల్సి ఉండగా.. సరిపోవని చెప్పడంతో మరో రూ.35 వేలు లబ్ధిదారుల పేరుతో రుణం తీసుకుని మరీ చెల్లిస్తున్నారు.

వెసులుబాటుతో అక్రమాల బాట !  

వేగంగా చేసేందుకే నిర్మాణ బాధ్యతలను గుత్తేదారులకు అప్పగిస్తున్నామని చెబుతున్న అధికారులు వాటిని పూర్తి చేయించడంపై శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. 22 వేల ఇళ్ల బాధ్యతను కట్టబెడితే.. రెండేళ్లలో 585 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి పూర్తయ్యే దశలో ఉన్నాయా అంటే అదీ లేదు. 16 వేల ఇళ్లు పునాది కంటే దిగువనే ఉన్నాయి. ఆపై స్థాయి వచ్చే సరికి నిర్మాణ వ్యయంలో దాదాపు రూ.70 వేలు కాంట్రాక్టర్‌కు చేరుతుంది. అక్కడి నుంచి పనులు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో దాదాపు 9 వేల ఇళ్ల నిర్మాణ బాధ్యత చేపట్టిన ఓ గుత్తేదారు సంస్థ ఉప గుత్తేదారుకు అప్పగించింది. అతను మధ్యలో వదిలేసి వెళ్లిపోవడం గమనార్హం. నిర్మించిన వాటిలోనూ నాణ్యత పాటించకపోవడంతో గోడలు బీటలు వారాయి. సిమెంట్‌ రాలిపోతుంది. ఇటుకలు ఊడి పడిపోతున్నా కనీసం ప్రశ్నించేవారు కరువయ్యారు.

పేదల సొమ్ముతో..

ఇంత జరుగుతున్నా.. అధికారులకు తెలియదా.? అంటే పొరపాటు పడినట్లే. అసలు ఈ దందాకు సూత్రధారులు అధికారులే కావడం గమనార్హం. పక్కా ప్రణాళిక ప్రకారం గుత్తేదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నెల్లూరు నగరంలో పనిచేస్తున్న ఓ అధికారి కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడులో మూడంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. దీనికి జగనన్న కాలనీలకు సరఫరా చేసే స్టీల్‌, సిమెంట్‌ను ఓ గుత్తేదారు సరఫరా చేసినట్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. నెల్లూరు నగరంలో మరో అధికారి ఇదే విధంగా ఇళ్లు నిర్మించడం గమనార్హం. నెల్లూరు డివిజన్‌ పరిధిలో మరో అధికారి కాస్త ముందుకు వెళ్లి గుత్తేదారు నుంచి ఫోన్‌పే ద్వారా లావాదేవీలు చేయడం విశేషం. అధికారులు ఇలా దండుకొని జేబులు నింపుకుంటూ పేదల ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు పాతరేస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి పెట్టి థర్డ్‌పార్టీతో పరిశీలించడంతో పాటు.. విజిలెన్స్‌ విచారణకు ఆదేశిస్తేనే జగనన్న లక్ష్యం నెరవేరుతోందని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం

నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించాలని గుత్తేదారులకు సూచనలు చేశాం. ఎక్కడైనా కట్టకుండా, నాణ్యత పాటించకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. అధికారుల అవినీతిపై మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు.

నరసింహం, పీడీ, గృహ నిర్మాణ శాఖ

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని