ఇష్టపడి సాధన చేసి.. ఆటల్లో మెరిసి
వారు పేదింటి విద్యార్థులు. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. క్రీడలపై ఆసక్తి పెంచుకున్నారు. అరకొర వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ ప్రదర్శనలు చేస్తున్నారు.
జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధం
న్యూస్‌టుడే, కందుకూరు పట్టణం : వారు పేదింటి విద్యార్థులు. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. క్రీడలపై ఆసక్తి పెంచుకున్నారు. అరకొర వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ ప్రదర్శనలు చేస్తున్నారు. తల్లిదండ్రులు, గురువుల సహకారంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ తమ జీవిత లక్ష్యాలు సాధించే దిశగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి ప్రస్తుతం రాష్ట్ర జట్టు తరఫున జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధమవుతున్నారు. ఈనెల 8వ తేదీ నుంచి మధ్యప్రదేశ్‌లో జరగబోయే హ్యాండ్‌బాల్, హాకీ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు కందుకూరు పట్టణంలోని టీఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు. వీరికి పీడీ సుబ్బారావు శిక్షణ ఇస్తున్నారు. జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటాలని కళాశాల ప్రిన్సిపల్ కదిరి నాగేశ్వరరావు ఆకాంక్షించారు.
హ్యాండ్‌బాల్‌లో ఉన్నత స్థాయికి చేరుకుంటా
వేముల నరేంద్ర, మల్లంపేట ...ఉమ్మడి ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మల్లంపేటకు చెందిన అల్లూరయ్య, రమణమ్మ దంపతుల కుమారుడు వేముల నరేంద్ర. ప్రస్తుతం పట్టణంలోని టీఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. పాఠశాలలో స్నేహితుల పరిచయాలతో హ్యాండ్‌బాల్ క్రీడపై మక్కువ పెంచుకున్నాడు. టీఆర్‌ఆర్‌లో హ్యాండ్‌బాల్ బాలుర, బాలికల జట్లు రాష్ట్ర స్థాయిలో పోటీపడిన విషయం తెలుసుకున్నాడు. తను కూడా అందులో ఉన్నతస్థాయికి చేరుకోవాలని భావించి రెండేళ్ల క్రితం టీఆర్‌ఆర్‌లో చేరాడు. అప్పటినుంచి పీడీ టి.సుబ్బారావు ఆధ్వర్యంలో సాధన చేస్తూ నైపుణ్యం సాధించాడు. ఈఏడాది ఫిబ్రవరిలో అనంతపురం జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టు తరఫున ప్రాతినిథయం వహించిన నరేంద్ర ఉత్తమ ప్రతిభ చూపడంతో రాష్ట్ర హ్యాండ్‌బాల్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈమేరకు ఈనెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరగబోయే అండర్-19 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటేందుకు కసరత్తు చేస్తున్నాడు.
జాతీయ జట్టులో ఎంపికవ్వాలని..
లింగసముద్రం మండలంలోని మొగిలిచర్లకు చెందిన పడిదపు శ్రీను, వెంకటరమణమ్మ దంపతుల కుమార్తె నందిని. చిన్ననాటి నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంది. ఈ క్రమంలో 4వతరగతి చదివేటప్పుడు స్కూల్ గేమ్స్‌లో రాణించి కడప క్రీడా పాఠశాలకు ఎంపికై అక్కడే పదోతరగతి వరకు చదివింది. హాకీలో కఠోర సాధన చేసి నైపుణ్యం సాధించింది. టీఆర్‌ఆర్ కళాశాలలో చేరి మరింత సాధన చేసింది. గతేడాది కాకినాడలో జరిగిన జూనియర్స్ విభాగం జాతీయ పోటీల్లో రాష్ట్ర జట్టుకు గోల్‌కీపర్‌గా రాణించింది. 2022-23 అండర్-19 స్కూల్ గేమ్స్ ఉమ్మడి ప్రకాశం జిల్లా తరఫున ఆడి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గోల్‌కీపర్‌గా పురస్కారం అందుకుంది. రాష్ట్ర జట్టుకు ఎంపికై త్వరలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతోంది. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో రాణించి జాతీయ జట్టుకు ఎంపిక కావాలన్నది తన లక్ష్యమని ఈమె చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.