logo

ధర ధగధగ.. దళారుల దగా

జిల్లాలో బత్తాయి సాగుదారులు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. బత్తాయి కాయలకు ధర ఆశించినంతగా ఉన్నా దిగుబడులు తక్కువగా ఉన్నాయి. ఇదే సందర్భంలో దళారులు రైతుల అవసరాలను సొమ్ముచేసుకుంటున్నారు.

Published : 07 Jun 2023 04:33 IST

బత్తాయి సాగుదారులకు కష్టం

సాగులోని బత్తాయి తోట

జిల్లాలో బత్తాయి సాగుదారులు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. బత్తాయి కాయలకు ధర ఆశించినంతగా ఉన్నా దిగుబడులు తక్కువగా ఉన్నాయి. ఇదే సందర్భంలో దళారులు రైతుల అవసరాలను సొమ్ముచేసుకుంటున్నారు. ధరలను తగ్గించి కొనుగోలు చేస్తూ అన్నదాతలను నష్టపరుస్తున్నారు. ఉదయగిరి, కనిగిరి ప్రాంతాల్లో అధికంగా బత్తాయి తోటలు సాగులో ఉన్నాయి. ప్రధాన మార్కెట్‌ నెల్లూరులో మాత్రమే ఉంది. అయినా కొందరు రైతులు గిట్టుబాటు ధర లభించలేదంటూ హైదరాబాదు, నాగపూర్‌, ముంబయి, దిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.

న్యూస్‌టుడే, వరికుంటపాడు : ఆరుగాలం కష్టించి, లక్షలు పెట్టుబడిగా పెట్టి సాగు చేసిన బత్తాయి పంట దిగుబడి వచ్చిన తరువాత విక్రయించేందుకు జిల్లాలో సరైన మార్కెట్‌ సౌకర్యం లేదు. ప్రస్తుతం టన్ను బత్తాయి కాయల ధర రూ. 50వేల వరకు పలుకుతోంది. అయినా దళారులు తోటలవద్దకు వచ్చి కాయ నాణ్యతలేదని, మచ్చ ఉందని, మంగు సోకిందంటూ టన్నుకు రూ. 15 నుంచి రూ. 20 వేలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో పెట్టుబడులు కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

* నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో దాదాపు 40 వేల ఎకరాల్లో బత్తాయిలో తోటలు విస్తరించి ఉన్నాయి.  వరికుంటపాడు మండలంలో మూడు వేల ఎకరాల్లో తోటలు ఉన్నాయి. గతంలో వర్షాభావంతో తోటలు నిలువునా ఎండిపోయాయి. అప్పట్లో రైతులు తీవ్రంగా నష్టపోవడంతో సాగు క్రమంగా తగ్గింది. ఈ మధ్య మళ్లీ పుంజుకుంటోంది.

* ఈ పంట  ఏడాదిలో రెండు దఫాలుగా దిగుబడి ఇస్తోంది. వేసవిలో బత్తాయి కాయల వినియోగం ఎక్కువ. దీంతో ధర కూడా ఆశించిన రీతిలో ఉంటోంది. దిగుబడి తక్కువగా ఉంటోంది. వర్షాకాలంలో దిగుబడి ఎక్కువగా ఉన్నా ధర మాత్రం ఆశించినంతగా ఉండటంలేదు.

గిట్టుబాటు ధర కల్పించాలి

ఎకరా బత్తాయి తోట సాగుకు రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చవుతుంది. వర్షాకాలంలో దిగుబడి 5 టన్నులు వరకు … వచ్చింది. వేసవిలో మాత్రం ఒకటిన్నర టన్నులు మాత్రమే వచ్చింది. ప్రభుత్వం ఇతర పంటల వలే బత్తాయికి కూడా గిట్టుబాటు ధర కల్పించాలి. కాయలను నిల్వ ఉంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి.

మల్లంపాటి కొండలరావు, రైతు

గిడ్డంగులు ఏవీ

వినియోగం తక్కువగా ఉన్న సమయంలో వచ్చిన పంటను నిల్వ చేసుకునేందుకు గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. రవాణా సౌకర్యం కూడా కల్పిస్తే మేలు. దళారీ వ్యవస్థను నిర్మూలించి గిట్టుబాటు ధర కల్పించాలి. వేసవికాలంలో చెట్లను కాపాడుకోవడం కష్టంగా ఉంది. గొట్టపు బావులు వట్టిపోవడంతో ట్యాంకర్లతో నీటిని అందించి చెట్లను కాపాడుకుంటున్నాం.

మల్లంపాటి సుదర్శన్‌, రైతు

స్టోరేజీ సౌకర్యం కల్పించలేం

షహిల్‌, ఉద్యానాధికారి : బత్తాయికి స్టోరేజీ సౌకర్యం కల్పించలేని పరిస్థితి. నిల్వ ఉంచుకుని అమ్ముకుంటే రైతుకు నష్టం అధికమవుతుంది. వీటికి ఇతర పంటల వలే మద్దతు ధర కూడా కల్పించడం సాధ్యంకాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని