logo

వచ్చింది ఇవ్వరు.. ఇచ్చింది వదలరు

స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం- వాటికి స్థానికంగా సమకూరే ఆదాయ వనరులకూ గండి కొడుతోంది.

Published : 09 Jun 2023 02:15 IST

టీడీ నిధులకు స్థానిక సంస్థల ఎదురు చూపు
కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే

నెల్లూరులోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం- వాటికి స్థానికంగా సమకూరే ఆదాయ వనరులకూ గండి కొడుతోంది. భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలో రిజిస్ట్రేషన్‌శాఖ నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు సుమారు ఏడాదిగా రాకపోవడమే అందుకు నిదర్శనం. రిజిస్ట్రేషన్‌ అయ్యాక.. ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ కింద 1.5 శాతం రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి చెల్లించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఆదాయ వనరుల్లో ఇది కీలకం. ఏడాదిగా నిధులు రాకపోవడంతో మౌలిక వసతుల కల్పనకు అవి ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది.

టీడీతో ఆదాయం

భూముల క్రయ విక్రయాలు గత కొన్నేళ్లుగా అధికమయ్యాయి. ఆ క్రమంలో రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వారు.. ప్రభుత్వ మార్కెట్‌ విలువ ప్రకారం అందులో 7.5 శాతం (ఫీజు) చలానా చెల్లించాలి. ఇందులో 5 శాతం స్టాంప్‌ డ్యూటీ కింద ప్రభుత్వానికి వెళుతుంది. 1.5 శాతం స్థానిక సంస్థలకు ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ(టీడీ) కింద వెళితే.. 1 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజుగా ఉంటుంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు టీడీ 1.5 శాతం మొత్తం ఆయా సంస్థలకే వెళుతుండగా.. పంచాయతీలకు వెళ్లే 1.5 శాతంలో జడ్పీకి 20, మండల పరిషత్తుకు 20, గ్రామ పంచాయతీలకు 60 శాతం చొప్పున వెళుతుంది.

బదిలీ కాని నగదు

దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కు చెల్లించే రుసుం నేరుగా సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాకు జమవుతాయి. అందులో ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీని వెంటనే స్థానిక సంస్థలకు బదిలీ చేయాలి. సుమారు ఏడాదిగా బదిలీ చేయడం లేదు. సీఎఫ్‌ఎంఎస్‌లో నెలకొన్న సాంకేతిక కారణాలతో బదిలీ చేయడం లేదని..  కొద్ది రోజుల కిందట చేశామని అధికారులు చెబుతున్నా.. జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలకు రూపాయి కూడా జమ కాలేదు. కందుకూరు మున్సిపాలిటీకి 2022 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 1.4 కోట్లు రావాల్సి ఉండగా- కావలి మున్సిపాలిటీకి రూ. 6.95 కోట్ల బకాయి ఉంది. కందుకూరు, గుడ్లూరు మండల పరిషత్తులకు 2022 మార్చి నుంచి ఇప్పటి వరకు జమ కాలేదు. జిల్లాలో స్థానిక సంస్థలకు దాదాపు రూ. 40 కోట్ల వరకు టీడీ రావాల్సి ఉందని సమాచారం.

నిధుల లేమితో సతమతం

సాధారణంగా నెలకో, రెండు నెలలకో సబ్‌ రిజిస్ట్రార్లు టీడీని బదిలీ చేస్తారు. ఏడాదిగా జమ కాకపోవడంతో స్థానిక సంస్థలకు నిధుల కొరత ఏర్పడింది. టీడీ నగదు జనరల్‌ ఫండ్‌గా ఉంటుంది కాబట్టి.. మున్సిపాలిటీల్లో ఏ అవసరాలకైనా వినియోగించుకోవచ్చు. కందుకూరు, కావలి మున్సిపాలిటీల్లో అనేక చోట్ల అంతర్గత రోడ్లు, కాలువలు సక్రమంగా లేవు. మౌలిక వసతుల పరంగా ప్రజలు అర్జీలు ఇచ్చినా నిధుల లేమితో పరిష్కారం చూపించలేకపోతున్నట్లు అధికారులు చెబుతుండగా- ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు సొమ్ములు కనీసం ఎప్పుడు జమ అవుతాయో కూడా తెలియని పరిస్థితుల్లో స్థానిక సంస్థల అధికారులు ఉండగా.. రిజిస్ట్రేషన్‌ శాఖ మాత్రం మరో విధంగా చెబుతుండటం గమనార్హం.

కందుకూరులో అధ్వానంగా గుండంకట్ట రోడ్డు


ఏడాదిగా రాలేదు...

ఎస్‌.మనోహర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, కందుకూరు

కందుకూరు మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్‌శాఖ ద్వారా రావాల్సిన టీడీ నిధులు ఏడాదిగా రాలేదు. ఏటా రూ. కోటికిపైగా వచ్చేవి. వాటిని ప్రజోపయోగ అవసరాలకు వినియోగించేవాళ్లం.


నిధులు జమ చేశాం

బాలాంజనేయులు, జిల్లా రిజిస్ట్రార్‌

దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన 1.5 శాతం టీడీ నిధులు జమ చేసేందుకు గతంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. వాటిని పరిష్కరించుకుని నెల రోజుల కిందటే జిల్లా మొత్తం పంపించాము.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని