logo

విద్యా కానుక.. అందరికీ అందేనా?

పాఠశాలల ప్రారంభం రోజునే జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు అందిస్తామంటున్న విద్యాశాఖ అధికారులు... ఆచరణలో ఏటా విఫలమవుతూనే ఉంది.

Published : 09 Jun 2023 02:15 IST

ఇప్పటికీ పూర్తి స్థాయిలో చేరని కిట్లు

జగనన్న విద్యాకానుక కిట్లు దించుతున్న సిబ్బంది

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: పాఠశాలల ప్రారంభం రోజునే జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు అందిస్తామంటున్న విద్యాశాఖ అధికారులు... ఆచరణలో ఏటా విఫలమవుతూనే ఉంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందేమోనన్న ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రులను వెంటాడుతోంది. కారణం.. మరో మూడు రోజుల్లో పాఠశాలలు పునః ప్రారంభం కానుండగా.. ఇప్పటికీ విద్యా కానుకలోని పలు వస్తువులు పూర్తి స్థాయిలో జిల్లాకు చేరకపోవడమే.

1,92,752 మందికి..

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు 2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేసేందుకు సమగ్రశిక్షా అభియాన్‌ ద్వారా ప్రతిపాదనలు పంపారు. ఆ మేరకు జిల్లాలోని 2,245 పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు బాలురు 93,597, బాలికలు 99,155.. ఇలా మొత్తం 1,92,752 మందికి కిట్లను పంపిణీ చేయనున్నారు.

అందించేవి ఇవే..

విద్యాకానుక కిట్‌ ద్వారా ఒక్కో విద్యార్థికి ఎనిమిది రకాల వస్తువులు ఉచితంగా ఇస్తారు. మూడు జతల ఏకరూప వస్త్రం, బెల్ట్‌, సంచి, జత బూట్లు, రెండు జతల సాక్సులు, రాత పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, ఒక నిఘంటువు అందిస్తారు. ఏకరూప వస్త్రం కుట్టించుకునేందుకు వేరుగా సొమ్ము అందిస్తారు. వేసవి సెలవుల్లో.. ఈ కిట్లను సమకూర్చుకుని పాఠశాలలు తెరిచే రోజే విద్యార్థులకు అందించేలా ఎస్‌ఎస్‌ఏ అధికారులు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. విద్యా కానుక కిట్లు విడతల వారీగా జిల్లా కేంద్రానికి చేరుతుండగా.. ఇక్కడ నుంచి ఆయా మండల కేంద్రాలకు పంపుతున్నారు. నెల్లూరు నగరం, గ్రామీణం మండలానికి సంబంధించిన వస్తువులను సుబేదారుపేటలోని సెయింట్‌ జోసఫ్స్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ ప్రాంగణంలో నిల్వ చేసి.. ఆయా పాఠశాలలకు తరలిస్తున్నారు.

ఈ సారైనా...

పాఠశాలల ప్రారంభానికే కిట్లు అందిస్తామంటున్న విద్యాశాఖ అధికారులు.. ఏటా ఆ మాట నిలుపుకోలేకపోతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవడంలో విఫలమవుతున్నారు. వేసవి సెలవుల్లో ఇండెంట్‌ పెట్టిన మేరకు కూడా సిద్ధం చేసుకోవడం లేదు. దాంతో విద్యా సంవత్సరం చివరి వరకు అందిస్తూ ఉంటున్న పరిస్థితి నెలకొంటోంది. గతంలో నాణ్యతపై తల్లిదండ్రుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం కాగా, ఈసారి కిట్లలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా పర్యటనకు వచ్చిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ హెచ్చరించారు.


పాఠశాలలకు చేరుస్తున్నాం..

సీహెచ్‌ ఉషారాణి, ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ

జగనన్న విద్యా కానుక కిట్లను పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. ఇప్పటికే పలు వస్తువులు వచ్చాయి. మరికొన్ని రావాల్సి ఉంది. జిల్లాకు చేరుతున్న వాటిని జాగ్రత్తగా భద్రపరిచి.. విద్యార్థులకు అందించనున్నాం. వాటిలో నాణ్యత ఉండేలా చర్యలు తీసుకున్నాం. పాఠశాలలకు చేరుస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని