logo
Published : 27/11/2021 04:33 IST

నిరీక్షించి.. నీరసించి

ధాన్యం కొనుగోళ్లలో అదే మందగమనం

లారీల కొరతతో కల్లాల్లోనే బస్తాలు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి; న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

పేరుకుపోతున్న సంచులు

జిల్లాలో కొనుగోళ్ల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. కొనుగోలు కేంద్రాల్లోనే నిరీక్షించి.. నీరసించి రైతుల గుండె ఆగుతున్నా యంత్రాంగంలో కించిత్తు స్పందన ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మబ్బులు చూస్తే గుబులు పుడుతోంది. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియక కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. ఓ వైపు లారీల కొరత, మరో వైపు అన్‌లోడింగ్‌ సమస్యలతో ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోంది.

తరలింపులోనే...

మూడు రోజులుగా వర్షాలు లేకపోవడంతో కల్లాల్లో ధాన్యం ఆరబెడుతున్నారు. తేమ 17శాతం లోపు ఉంటున్నా కాంటాలు వేయడం లేదు. ఇది వరకే పూర్తయినవి తరలించాకే మిగతా వారికి వేస్తామని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. కేంద్రాలకు రెండు రోజులకో లారీ వస్తోంది. దీనికి తోడు మిల్లుల్లో నిదానంగా దించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇదే మాదిరిగా కొనసాగితే కొనుగోళ్లు పూర్తయ్యేసరికి మరో రెండు నెలలు పట్టేలా ఉందని రైతులు వాపోతున్నారు.

మంత్రి ఆదేశాలు బేఖాతరు

కాంటాలు వేసిన సంచులను 24 గంటల్లో మిల్లులకు తరలించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిర్దేశించినా అమలు కావడం లేదు. జాప్యం చేసే మిల్లర్లపై కఠిన చర్యలు చేపట్టాలని ధాన్యం కొనుగోళ్ల సమీక్ష సమావేశం సందర్భంగా ఆదేశించారు. అధికారులు ఆయన ఆదేశాలను అమలు చేయడం లేదు. గతేడాది ఇదే పరిస్థితి ఉత్పన్నమవగా.. మిల్లుకో రెవెన్యూ అధికారిని నియమించి వేగిరం చేశారు. ప్రస్తుతం ట్రాన్స్‌పోర్టర్లు, మిల్లర్లతో ఒకరిద్దరు అధికారులు ములాఖత్‌ కావడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు పౌరసరఫరాలశాఖ సిబ్బందే వెల్లడిస్తున్నారు.

చనిపోతున్నా.. స్పందించరా..!

కొనుగోళ్లలో జాప్యం కారణంగా ఇప్పటికే ఇద్దరు రైతులు కేంద్రాల్లో కుప్పకూలి మరణించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు జిల్లా అధికారులపై కన్నెర్ర చేశారు. రంగంలోకి దిగిన అధికారులు హడావుడిగా సమీక్షలు నిర్వహించి మమ అనిపించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సేకరణ లక్ష్యం: 5.50 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఇప్పటి వరకు: 3.05 లక్షల మెట్రిక్‌ టన్నులు


సమస్యలు పరిష్కరిస్తున్నాం

- వెంకటమాధవరావు, అదనపు పాలనాధికారి, కామారెడ్డి

ధాన్యం సేకరణ వేగవంతం చేసేందుకు పాలనాధికారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. శుక్రవారం మిల్లర్లు, పౌరసరఫరాలు, సహకార, రెవెన్యూశాఖల అధికారులతో సమీక్షించారు. లారీల కొరత తీర్చేందుకు ఇతర వాహనాలను ఏర్పాటు చేస్తున్నాం.


సంచికి రూపాయి ఇవ్వాలిందే

- శ్రీనివాస్‌రావు, రైతు, శివాయిపల్లి

కాంటాలు పూర్తయినా లారీలు రావడం లేదు. రెండు మూడు రోజులకు ఒకటి వస్తోంది. సంచికి రూపాయి అదనంగా ఇవ్వాలని డ్రైవర్లు డిమాండు చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని లారీలు వచ్చేలా చూడాలి.


నెల రోజులుగా పడిగాపులు

- రాధ, రైతు, పొందుర్తి

నెలరోజులుగా కేంద్రంలోనే పడిగాపులు కాస్తున్నా. కాంటాలు వేసిన సంచులను తరలించేందుకు లారీలు రావడం లేదు. యాసంగి పనులు చేసుకోవాల్సి ఉంది. కేంద్రంలో 50 మంది హమాలీ కాంటాలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నా.. లారీలు రాకపోవడంతోనే సమస్య నెలకొంది.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని