గడపగడపకు న్యాయ విజ్ఞానం
బాలసదన్ చిన్నారులతో జిల్లా జడ్జి కుంచాల సునీత
నిజామాబాద్ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహించిన గడపగడపకు చట్టాలపై అవగాహన కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయ విజ్ఞానం అందించే ప్రయత్నం జరిగిందని జిల్లా జడ్జి కుంచాల సునీత అన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. శనివారం జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో అంబేడ్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా జడ్జి హాజరై మాట్లాడారు. ఇందులో భాగస్వాములైన న్యాయవాదులు, పారాలీగల్ వాలంటరీలు, న్యాయవిద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. కుటుంబ కోర్టు జడ్జి షౌకత్ జహన్ సిద్దిఖీ, ఎస్సీ ఎస్టీ కోర్టు జడ్జి గోవర్ధన్‌రెడ్డి, రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి పంచాక్షరి, న్యాయసేవా సంస్థ కార్యదర్శి విక్రమ్, మెజిస్ట్రేట్లు అజయ్‌కుమార్ జాదవ్, భవ్య, గిరిజ, సంస్థ పర్యవేక్షకులు పురుశోత్తంగౌడ్, చంద్రసేన్, భరత్, నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.