ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
టెలీకాన్ఫరెన్సులో మాట్లాడుతున్న కలెక్టర్ జితేష్ వి పాటిల్
కామారెడ్డి కలెక్టరేట్, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో పాటు ఆయా శాఖల అధికారులు, ఎమ్మెల్యేలతో శనివారం టెలీకాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి ప్రాంతాల్లో వేగిరం చేయడానికి బాన్సువాడ, జుక్కల్ ప్రాంతాల నుంచి కాంటాలు, హమాలీలు, లారీలు తెప్పించాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పర్యవేక్షించాలన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో వివరాలు నమోదు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చూడాలన్నారు. కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు మూడు లక్షల మెట్రిక్‌టన్నులు సేకరించినట్లు తెలిపారు. బాన్సువాడలో 94శాతం, జుక్కల్‌లో 80శాతం పూర్తయినట్లు వివరించారు. కార్యక్రమంలో జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, సురేందర్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్‌ధోత్రే, వెంకటమాధవరావు, డీసీసీబీ ఛైర్మన్ భాస్కర్‌రెడ్డి, ఆర్డీవోలు శ్రీను, రాజాగౌడ్, డీసీవో వసంత, రవాణాశాఖ అధికారిణి వాణి పాల్గొన్నారు.
సీఎస్ వీసీ : కామారెడ్డి కలెక్టరేట్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం నిర్వహించిన వీసీలో కలెక్టర్ పాల్గొన్నారు. కొనుగోళ్లు, సీఎంఆర్ వివరాలు ఆయనకు వివరించారు. డీఎస్వో రాజశేఖర్, డీఎం జితేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.