logo
Published : 28/11/2021 04:07 IST

పిల్లలెట్లున్నరో..!

గురుకులాల్లో తల్లిదండ్రులకు ఆంక్షలు

బయటి నుంచే చూసి వెనుదిరగాలి

న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం

లింగంపేట బీసీ గురుకులంలో ఆరో తరగతి విద్యార్థి మూడు రోజుల క్రితం పారిపోయాడు. కుటుంబీకులు కంగారుపడుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతా గాలిస్తుండగా.. అతనే ఇంటికి చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. మద్నూర్‌ మండలం మేనూర్‌ ఆదర్శ పాఠశాల 8వ తరగతి విద్యార్థి ఇటీవల అదృశ్యమయ్యాడు. పోలీసులు ప్రిన్సిపల్‌ను ఆరా తీస్తే బడికి వచ్చి పది రోజులైందని చెప్పారు.

గురుకులాలు, వసతిగృహాల్లో కొవిడ్‌ నిబంధనల కారణంగా తల్లిదండ్రులు, పిల్లలు ఒకరిపైఒకరు బెంగపెట్టుకునే పరిస్థితి వచ్చింది. విద్యార్థులను కలవడానికి వస్తున్న వారిని లోనికి అనుమతించడం లేదు. ఇంటి దిగులు పెట్టుకున్న పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. వారిని స్వస్థలానికి పంపిస్తున్నారు.ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తున్నామని విద్యాలయాల బాధ్యులు చెబుతున్నారు. వసతిగృహాల్లోనూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నారు. బయట నుంచి ఎవరైనా వస్తే భౌతికదూరం పాటించేలా జాగ్రత్తపడుతున్నారు.

ఏడాదిన్నర తరువాత దూరంగా..

కొవిడ్‌ నేపథ్యంలో ఏడాదిన్నరపాటు విద్యాలయాలు మూతపడ్డాయి. సంక్షేమ గురుకులాల విద్యార్థులు ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులు విన్నారు. పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించారు. తరువాత వసతిగృహాలు, గురుకులాలు తెరిచారు. వారం రోజుల పాటు హాజరు శాతం తక్కువే నమోదైనా క్రమంగా పెరుగుతూ వచ్చింది. నెల క్రితం వచ్చిన పిల్లలు తిరిగి ఇంటికెళ్లలేదు. సుదీర్ఘకాలం తరువాత ఇంటికి దూరమైన పిల్లల్ని చూడాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. కొందరు విద్యార్థులు ఇంటికెళ్తామంటూ పట్టుబడుతున్నారు.


గిరిజన గురుకులం బయటనిరీక్షణ

ముఖద్వారాల వద్దే ములాఖత్‌

గురుకులాల ప్రారంభ సమయంలోనూ తల్లిదండ్రుల్లో ఒక్కరే రావాలని అధికారులు సూచించారు. తరచూ చూసేందుకు రావొద్దని ఆదేశించారు. దూరప్రాంతాల నుంచి పిల్లల్ని చూడటానికి వస్తున్న వారిని ముఖద్వారం వద్దే ఆపేస్తున్నారు. పిల్లలను నేరుగా కలవకుండా ఆవలి నుంచే మాట్లాడిస్తున్నారు. బాగా బెంగ పెట్టుకున్న వారిని అనుమతిస్తున్నారు.


జైలు తరహాలో ఉంది

నా కొడుకు సరంపల్లి గిరిజన గురుకులంలో చదువుతున్నాడు. వసతిగృహం మొదలైనప్పటి నుంచి తరగతులకు పంపుతున్నా. అప్పటి నుంచి ఒకసారి వెళ్లిచూద్దామంటే లోనికి అనుమతించడం లేదు. గేటు వద్ద వివరాలు చెబితే అక్కడికే పిలిచి మాట్లాడించారు. ఇక్కడ పరిస్థితి జైలు ములాఖత్‌లాగే ఉంది.

- గాంధారి మండలానికి చెందిన తండ్రి పరశురాం ఆవేదన


ఆదేశాలకు అనుగుణంగానే..

తల్లిదండ్రులను గురుకులంలోకి అనుమతించొద్దని ఆదేశాలున్నాయి. ఎవరైనా చూడడానికి వస్తే బయటే ఆపేస్తున్నాం. కొవిడ్‌ నేపథ్యంలో జాగ్రత్తలు తప్పవు. వైరస్‌ ఇంకా పూర్తిగా తొలగనందున కొన్నాళ్లు సంయమనం పాటించాలి.

- కిషన్‌చౌహాన్‌, గిరిజన గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్‌, కామారెడ్డి


చూసి 20 రోజులాయే

గురుకులం ప్రారంభించాక వారం రోజులకు బాబును తీసుకొచ్చి చేర్పించా. చాలారోజులు ఇంటి వద్దే ఉండటంతో ఇళ్లంతా సందడి ఉండేది. 20 రోజులవడంతో చూద్దామనిపించి గురుకులానికి వచ్ఛా గేటు వద్దకు బాబును పంపాలని కబురుపెట్టా.

- లీలా, విద్యార్థి తల్లి


అలవాటయ్యేందుకు సమయం పట్టింది

కొవిడ్‌ కారణంగా ఇంటి వద్దే ఉండటంతో కుటుంబీకులతో బాగా సాన్నిహిత్యం ఏర్పడింది. ఒక్కసారిగా బయటకు వచ్చాక పరిస్థితులు అలవాటు కావడానికి సమయం పట్టింది. అమ్మానాన్నలను గేటు వద్దే కలుస్తున్నా.

- జిత్మల్‌, విద్యార్థి(పిట్లం మండలం)


సార్లే ధైర్యం చెబుతున్నారు

ఏడాదిన్నర పాటు ప్రత్యక్ష తరగతులకు దూరమయ్యాం. ఒక్కసారిగా విద్యాలయాలు ప్రారంభించాక తప్పనిసరిగా చదువుకోవాల్సిన పరిస్థితి. గురుకులానికి వచ్చి నెల రోజలవుతోంది. అమ్మానాన్న గుర్తొస్తున్నారు. ఉపాధ్యాయులు ధైర్యం చెబుతుండటంతో చదువులపై దృష్టి సారిస్తున్నాం.

- మిథున్‌సింగ్‌, విద్యార్థి(గాంధారి మండలం)

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని