చిత్ర వార్తలు
పచ్చందాల ప్రయాణం
రోడ్డుకు రెండువైపులా చెట్లతో ఉన్న ఈ ప్రాంతం ఇందల్వాయి నుంచి ధర్పల్లి వెళ్లే మార్గంలోనిది. చుట్టుపక్కల అటవీ ప్రాంతంతో పచ్చదనం పరుచుకుని ప్రయాణికులకు ఆహ్లాదం పంచుతోంది.
- ఈనాడు, నిజామాబాద్
కంచం పట్టుకొని.. నీటి డబ్బా తెచ్చుకొని
బడులకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా చేస్తామన్నారు.. ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధిజలాలు అందిస్తామన్నారు. ఆచరణలో ఇవేవీ కనిపించడం లేదు. విద్యార్థులు ఇంటి నుంచే సీసాలు తెచ్చుకొంటున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో ఓ చేత్తో కంచం.. మరో చేతిలో నీటిడబ్బా పట్టుకుని వరుసలో నిల్చుంటున్నారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో కనిపించిన దృశ్యమిది.
- న్యూస్టుడే, కామారెడ్డి పట్టణం
సాగుకు తిప్పలు
తెప్పపై అవతలి ఒడ్డుకు వెళ్తున్న రైతు
బోధన్ మండలం హంగర్గలోని 85 మంది రైతులు తమ పంట పొలాలకు చేరుకోవాలంటే తెప్పపై లేదంటే వాగులో ఈదుకుంటూ వెళ్లాల్సిందే. ఈ రెండు కాదంటే ఊరి చుట్టూ కొన్ని కి.మీ.ల మేర తిరిగి వెళ్లాలి. శ్రీరాంసాగర్ వెనుక జలాల కారణంగా వాగులో నీరు నిలిచి ఈ పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వెనుక జలాలు గ్రామశివారులోని పసుపు వాగు వరకూ చొచ్చుకొచ్చాయి. దీంతో వాగు అవతలివైపునున్న తమ వ్యవసాయ భూముల్లోకి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొందరు రైతులు రెంజల్ మండలం నీలా శివారు నుంచి సుమారు 14కి.మీ.మేర చుట్టూ తిరిగి వెళ్తున్నారు. శాశ్వత పరిష్కారంగా వాగులో 95 మీటర్ల మేర వంతెన నిర్మిస్తే రెండు వ్యవసాయ సీజన్లలో సాగు కష్టాలు దూరం అవుతాయని అన్నదాతలు అంటున్నారు. సమస్యను ఎమ్మెల్యే షకీల్ దృష్టికి తీసుకెళ్లడంతో వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. అంచనాలు రూపొందించేందుకు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు పంచాయతీరాజ్ ఏఈ సాయిలు తెలిపారు.
- న్యూస్టుడే,బోధన్ గ్రామీణం