logo
Published : 01/12/2021 04:19 IST

కాంక్షలపైౖ ఆంక్షలు

ప్రత్యామ్నాయంపై అయోమయం
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

చెరకు సాగుకు జిల్లా ప్రసిద్ధి చెందింది. బెల్లం వండకంలో ఉమ్మడిరాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉండేది. దేశంలోనే మేలైన చెరకు పండించడంలో కామారెడ్డి కర్షకులు ప్రత్యేక గుర్తింపు పొందారు. నాటుసారా తయారీకి వినియోగిస్తున్నారనే నెపంతో బెల్లం వండకంపై ప్రభుత్వం నిషేధం విధించారు. ఫలితంగా చెరకు సాగు  గణనీయంగా తగ్గింది. నియంత్రిత ఆంక్షలతో మొక్కజొన్న దిక్కులేనిదైంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం తీసుకోనని చెప్పడంతో యాసంగి సీజన్‌లో వరి సాగు ఊగిసలాడుతోంది. ఇలా జిల్లాలో పండించే ప్రధాన పంటలపై ఏటేటా ఆంక్షలు విధిస్తుండటం అన్నదాతలను ఆవేదనకు గురిచేస్తోంది.

కామారెడ్డి ప్రాంతంలోనే చెరకు ఎక్కువగా సాగయ్యేది. కుటీర పరిశ్రమగా బెల్లం వండకం కొనసాగేది. గుజరాత్‌, మహారాష్ట్రకు ఎగుమతి చేసేవారు. స్వరాష్ట్రం సిద్ధించాక ఆంక్షలు తొలగిపోతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. నల్లబెల్లంతో గుడుంబా కాస్తున్నారని చెప్పి పాకం వండకాన్ని నిషేధించి ఎందరిదో ఉపాధిని నిర్వీర్యం చేశారు. ఈ పరిశ్రమను నమ్ముకొని జీవించిన ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. చెరకు రైతులకూ దెబ్బపడింది. జిల్లాలో గతంలో దాదాపు 30 వేలకు పైగా ఎకరాల్లో సాగుచేసేవారు. ఇప్పుడు కేవలం 4,520 ఎకరాలకే పరిమితమైంది.

వర్షాధారంగా..
పెద్దఎత్తున మొక్కజొన్న సాగు చేస్తుంటారు. వానాకాలంలో 89,220 ఎకరాల్లో వేశారు. దిగుబడులు భారీగానే వచ్చాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మద్దతు ధర కంటే తక్కువకు తీసుకొంటుండటంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వేద్దామన్నా కొనుగోలు చేసేవారు లేక వెనుకడుగు వేస్తున్నారు.

సాగుపై తర్జన భర్జన
గతంలో ఇక్కడ వరి సాగు అంతంత మాత్రంగానే ఉండేది. చెరకు తగ్గిన తర్వాత వానాకాలం మాత్రమే వరి వేసి యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. విస్తార వర్షాలతో భూగర్భజలాల వృద్ధి ఉంది. జలవనరులు, ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. నీరు పుష్కలంగా ఉండటంతో చాలా చోట్ల రెండు కాలాల్లో వరి పండిస్తున్నారు. ధాన్యం రాశులు వెల్లువెత్తుతున్నాయి. యాసంగిలో వరి వేస్తే ఉరే అని రాష్ట్ర ప్రభుత్వం నిక్కచ్చిగా చెబుతుండటంతో దీనికే అలవాటు పడిన రైతులు ఏమి వేయాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధమైనా అవసరమైన విత్తనాలు లభ్యం కావడం లేదు. దీనికి తోడు ఆరుతడికి నేలలు అనుకూలంగా లేకపోవడం సమస్యగా మారింది.
నేలను బట్టి పంట
ఆరుతడికి సమాయత్తమైన బీర్కూర్‌ ఏటిగడ్డ రైతు ఉత్పత్తిదారుల సంఘం వారు ఇటీవల మహారాష్ట్రలోని సగ్రోలి కృషివిజ్ఞాన కేంద్రానికి వెళ్లి శిక్షణ పొందారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మొదటగా నేలలను సాగుకు అనుకూలంగా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. మడులు కట్టిన పొలాలను చదును చేస్తేనే సాధ్యమవుతుందని తేల్చారు. దీంతో అన్నదాతలు చేసేదేమి లేక వరిసాగుకే సిద్ధమయ్యారు. ఈ పరిస్థితి వీరొక్కరిదే కాదు జిల్లావ్యాప్తంగా రైతుందరిది.


తాపకోటి దూరం చేస్తున్నారు
- కిశోర్‌బాబు, బీర్కూర్‌

తాపకో పంట దూరం చేస్తున్నారు. ఇలా అయితే భవిష్యత్తులో సాగు కష్టమే. ఆరుతడి అంటున్న సర్కారు నాణ్యమైన విత్తనాలు అందివ్వడం లేదు. కూలీల కొరత ఉంది. అటవీ జంతువుల బారినుంచి పంటలు కాపాడటం కత్తిమీద సామే.


సన్న, చిన్నకారుకు ఇబ్బందే
- బాబు, పాత బాన్సువాడ

చెరువుల కింద వరి తప్ప వేరేది పండదు. శనగ, సోయా సాగు చేస్తే పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. ఇలా అయితే సన్న, చిన్నకారు రైతులకు ఇబ్బందులే. అధికారులు మాటలు చెబుతారు కాని క్షేత్రస్థాయిలో తలెత్తే ఇబ్బందులకు పరిష్కారం చూపెట్టరు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని