‘రామోజీ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో.. మానవతా సదన్‌కు సామగ్రి వితరణ
వంట పాత్రలు అందజేస్తున్న నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, తదితరులు
డిచ్పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: దాతలు అందించే ప్రతి రూపాయి పేద పిల్లల బంగారు భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. ‘రామోజీ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో డిచ్పల్లిలోని మానవతా సదన్‌కు రూ.2.07 లక్షల విలువైన స్టడీ కుర్చీలు, రాతప్యాడ్లు, వంట పాత్రలు, హైమాస్ట్ వితరణ కార్యక్రమం మంగళవారం చేపట్టారు. పాలనాధికారి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వాటిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామోజీ ఫౌండేషన్ ఇక్కడి పిల్లలను దృష్టిలో పెట్టుకొని సహాయం చేసేందుకు ముందుకురావడం సంతోషదాయకమన్నారు. ‘ఈనాడు’ యాజమాన్యం చేపడుతున్న సామాజిక కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, వివిధ సందర్భాల్లో చూస్తూనే ఉన్నామన్నారు. తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.