logo
Updated : 01 Dec 2021 04:49 IST

పచ్చని ఆశలపై దాడి

చేతికొచ్చిన పంటలను నాశనం చేస్తున్న అటవీ జంతువులు

పరిహారంపై అవగాహన కరవు

న్యూస్‌టుడే, భీమ్‌గల్‌

రైతు ఆరుగాలం శ్రమిస్తూ పండించే పంట.. అడవి పందుల దాడితో ఒక్కరోజులోనే నేలమట్టమవుతోంది. పరిహారం పొందే అవకాశం ఉన్నా తెలియక అన్నదాతలు నష్టపోతున్నారు. అవగాహన కల్పించాల్సిన అటవీశాఖ అధికారులు మిన్నకుండిపోతున్నారు.
నిజామాబాద్‌ జిల్లా సిరికొండ, భీమ్‌గల్‌, జక్రాన్‌పల్లి, ధర్పల్లి, మోర్తాడ్‌, ఇందల్‌వాయి, డిచ్‌పల్లి, కమ్మర్‌పల్లి.. కామారెడ్డిలోని మద్నూర్‌, గాంధారి, మాచారెడ్డి, జుక్కల్‌, కోటగిరి తదితర మండలాల్లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. సమీప గ్రామాల్లో అడవిపందులు, కోతులు పంటలను నాశనం చేస్తున్నాయి. ఉభయ జిల్లాల్లో ఏటా సుమారు వేయి ఎకరాల్లో నష్టం జరుగుతున్నట్లు అంచనా. ఎకరానికి రూ.10 వేల నష్టం జరిగినా ఏటా రూ.కోటి విలువైన పంట రైతులు కోల్పోవాల్సిన దుస్థితి. పరిహారం అందడం లేదు.

దరఖాస్తు ఇలా..
అడవి పందుల వల్ల పంటకు నష్టం వాటిల్లితే రెండు రోజుల్లో సంబంధిత రేంజ్‌ అధికారులకి దరఖాస్తు చేసుకోవాలి. వ్యవసాయ, రెవెన్యూ, అటవీశాఖల అధికారులు నష్టాన్ని పరిశీలించి నివేదిక ఇస్తారు. దీనిని పైఅధికారులకు పంపిస్తే వారు పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తారు. ఆ తర్వాత పరిహారం అందజేస్తారు. కానీ, ఇంత వరకు జరిగిన నష్టానికి పరిహారం అందలేదు.

క్షేత్రస్థాయిలో చెప్పడం లేదు
అటవీజంతువుల దాడితో జరిగిన పంటనష్టంపై పరిహారం ఇచ్చే విషయంలో అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు. పంట సంరక్షణకు భారత వ్యవసాయ పరిశోధన సంస్థ సూచించిన సౌరశక్తి కంచెలు, కందకాలు, వలయాకార, ఇనుప ముళ్లకంచెల గురించి రైతులకు అవగాహన కల్పించాల్సిన వ్యవసాయధికారులు తమకేదీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

కొన్ని ఘటనలు..
నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం సికింద్రాపూర్‌ బోడగుట్ట పరిసర ప్రాంతాల్లో మొక్కజన్నపై అడవి పందులు దాడి చేశాయి. చేతికొచ్చే సమయంలో పంట పూర్తిగా పనికి రాకుండా పోయింది.
బడాభీమ్‌గల్‌లో వరి నారు పోసిన రాత్రే అడవి పందులు కలియదిరిడంతో పనికిరాకుండా పోయింది. మరోసారి నారు పోసుకోవాల్సి వచ్చింది.
కామరెడ్డి జిల్లా మద్నూర్‌ మండలంలోని 34 గ్రామాల్లో రోజూ విధ్వంసం ఘటనలు ఉంటున్నాయి. ప్రధానంగా జింకలు, అడవి పందులు ఎక్కువగా ఈ ప్రాంతంలో సంచరిస్తుంటాయి. శనగ, మొక్కజొన్నకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది.
కమ్మర్‌పల్లి మండలం కోనారావుపేట, నర్సాపూర్‌లో ఇటీవల అడవి పందులు మొక్కజొన్న పంటపై దాడి చేసి తీవ్రంగా నష్టపర్చాయి.


మాకు తెలియదు : గంగారాం, బడాభీమ్‌గల్‌
పంట చేతికొచ్చే సమయంలో అడవి జంతువులు దాడులు చేస్తున్నాయి. ముకుమ్మడిగా వస్తున్నాయి. పంటలో సగభాగం వరకు నష్టపోతున్నాం. నష్టం జరిగితే అందే పరిహారం గురించి మాకు తెలియదు.


నమోదు చేయించాలి : గోవిందు, నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయధికారి
నష్టపోయిన రైతులు రెండు రోజుల్లో సంబంధిత రేంజ్‌ అధికారులకి దరఖాస్తు చేసుకోవాలి. పరికరాల కోసం వ్యవసాయశాఖ నుంచి ఎటువంటి రాయితీ అందదు. విద్యుత్తు తీగలు ఏర్పాటు చేయకూడదు. దీనివల్ల ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

అడవి జంతువుల వల్ల ప్రమాదం జరిగితే అటవీ శాఖ నుంచి పరిహారం పొందడానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు 57 విడుదల చేసింది. నేటికీ అదే అమలవుతోంది.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని