logo
Published : 02/12/2021 06:15 IST

సర్వేకుసర్వావస్థలు

 చలాన్లు చెల్లించి నెలల తరబడి నిరీక్షణ

జిల్లా వ్యాప్తంగా 754 దరఖాస్తులు

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌ : భూసర్వే చేయించాలంటే రైతులకు అవస్థలు తప్పడం లేదు. చలాన్లు చెల్లించి నెలలు గడుస్తున్నా.. సర్వేయర్లు పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారు. భూముల కొలతల్లో వచ్చే తేడాలు, భూతగాదాలు, ఇతర అంశాల పరిష్కారంలో భూసర్వే తప్పనిసరి. కర్షకులు తమ వివాదాలు పరిష్కరించుకోవడానికి అధికారులను ఆశ్రయిస్తున్నారు. కొందరు ప్రైవేటు సర్వేయర్ల వద్దకు వెళ్తుంటే మరికొందరు ప్రభుత్వ అధికారులకు దరఖాస్తు పెట్టుకుంటున్నారు. నిబంధనల ప్రకారం చలాన్లు చెల్లిస్తున్నారు. వందల సంఖ్యలో పెండింగ్‌ ఉండటంతో నిత్యం భూకొలతలు, తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

కొందరివే చేయడంలో మతలబేంటీ..?

నిబంధనల ప్రకారం దరఖాస్తులను వరుస క్రమంలో పరిష్కరించాలి. కొందరివి ఎప్పుడూ పెండింగ్‌లోనే ఉంటుండగా.. మరికొందరివి వెంటనే పూర్తవుతున్నాయి. పలుకుబడి ఉన్నవారివి త్వరగా సర్వే చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. అదేంటని ప్రశ్నిస్తే.. ఒక గ్రామానికి వెళ్లినప్పుడు మళ్లీ రావడం ఎందుకనే ఉద్దేశంతో అందరివి చేసేస్తున్నామని చెబుతున్నారు. అమాయక రైతులు సర్వేయర్లు వస్తారనే ఆశతో నెలల తరబడి ఎదురుచూస్తున్నారు.

నివేదిక జారీలోనూ..

భూములు, స్థలాలు సర్వే చేసిన తర్వాత అధికారులు జారీ చేసే నివేదిక(రిపోర్టు) ముఖ్యం. భూమి పూర్తి వివరాలు, హద్దులు, విస్తీర్ణం, పటం వంటివి ఇందులోనే ఉంటాయి. వీటి జారీలోనూ తీవ్ర జాప్యం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. చేయి తడిపితే గానీ చేతికందదని పేర్కొంటున్నారు. అధికారుల తీరుతో భూ వివాదాలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

సిబ్బంది కొరతేనా..

దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడానికి సర్వేయర్ల కొరత ఒక కారణంగా చెబుతున్నారు. మండలస్థాయిలో 22 మందికి గాను 13 మంది మాత్రమే ఉన్నారు. ఖాళీలున్న చోట పక్క మండలాల వారికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇక డివిజన్‌ స్థాయిలో పనిచేస్తున్న పోస్టులు భర్తీ అయినప్పటికీ ఒక్కో డీఐకి 9 నుంచి 10 మండలాలు ఉన్నాయి. దీనికితోడు ప్రభుత్వ పనులు అధికంగా ఉండడంతో దరఖాస్తులు పెండింగ్‌లో పెడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రోడ్డు మార్గాలకు భూసేకరణ పనుల్లో గడుపుతున్నారు.


వీరు భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన రైతులు వెంకటేశ్‌, ఎల్లయ్య. వీరి భూమిని సర్వే చేయాలని కామారెడ్డి భూకొలతలశాఖ డీఐకి ఈ ఏడాది జూన్‌లో చలానా(నంబర్‌ 6100947491)చెల్లించారు. అధికారులు రేపుమాపంటూ కాలయాపన చేస్తున్నారు. అన్నదాతలు తరచూ కార్యాలయానికి వచ్చి త్వరగా సర్వే చేయాలని వేడుకుంటున్నారు. వస్తున్నామని చెప్పి ఆరుసార్లు పరిసర రైతులకు నోటీసులు జారీ చేశారు తప్ప వెళ్లలేదు. ప్రతిసారి ఇతర పనుల్లో బిజీగా ఉన్నామంటున్నారని రైతులు వాపోతున్నారు.


అన్నీ పరిష్కరిస్తాం

శ్రీనివాస్‌, జిల్లా భూకొలతల అధికారి, కామారెడ్డి

జిల్లాలో భూ కొలతల దరఖాస్తులన్నింటిని త్వరలో పరిష్కరిస్తాం. సిబ్బంది కొరత, ప్రభుత్వ పనులతో జాప్యం జరిగింది. వరుస క్రమంలోనే దరఖాస్తులు పరిష్కరించాలి. నివేదిక కోసం అధికారులెవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే మాకు ఫిర్యాదు చేయాలి. విచారణ చేయించి సస్పెండ్‌ చేయిస్తాం. కొన్నిచోట్ల ప్రైవేటు సర్వేయర్లు డబ్బులు తీసుకుంటున్నట్లుగా తెలిసింది. 

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని